శనివారం 04 జూలై 2020
Hyderabad - Jul 01, 2020 , 01:29:33

ఆస్తి కంటే.. ఆరోగ్యం ముఖ్యం

ఆస్తి కంటే.. ఆరోగ్యం ముఖ్యం

మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా భావించాలి 

భావితరాలకు మంచి వాతావరణం ఇవ్వాలి..మంత్రి తలసాని 

ఉప్పల్‌ భగాయత్‌లో మొక్కలు నాటిన మంత్రి, ఎమ్మెల్యే

ఉప్పల్‌ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఉప్పల్‌ భగాయత్‌లో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన ప్రాంతంతో పాటు, భగాయత్‌ పరిసరాల్లో హరితహారంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు పడటానికి, వాతావరణ సమతుల్యతకు, ఆరోగ్యానికి ఆటంకాలు లేకుండా చెట్లు ఉపయోగపడుతాయన్నారు. భవిష్యత్‌లో ఆస్తికంటే పిల్లలకు ఆరోగ్యం, ఆహ్లాదం అందించడమే ముఖ్యమన్నారు. నాటిన మొక్కలను  తమ బిడ్డలవలే పెంచాలన్నారు. హరిత ఉప్పల్‌గా మార్చేందుకు పెద్దసంఖ్యలో మొక్కలు నాటేవిధంగా చూస్తామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సీఎం చేపట్టిన హరితయాజ్ఞాన్ని విజయవంతం చేయడానికి సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ వై.నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు బేతి స్వప్నారెడ్డి, గంధం జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, గోపు సరస్వతి, డిప్యూటీ కమిషనర్‌ ఆరుణ కుమారి, ఉప్పల్‌ సీఐ రంగస్వామి, ట్రాఫిక్‌ సీఐ కాశీవిశ్వనాథ్‌, మధుసూదన్‌, ఉప్పల్‌ నాయకులు మేకల హన్మంతరెడ్డి, మేకల మధుసూదన్‌రెడ్డి, తవిడబోయిన గిరిబాబు, ఆకుల మహేందర్‌, వేముల సంతోశ్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌, పిట్టల నరేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

రాజేంద్రనగర్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో

 మొక్కలు నాటిన మంత్రులు

బండ్లగూడ:  రాష్ట్రంలో  33 శాతం అడవులను పెంచి పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని  గిరిజనాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఆవరణలో మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ..  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 4లక్షల 60వేల మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా గిరిజన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒక్కరోజే 4లక్షల మొక్కలు నాటేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ చర్యలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి హరితహారంపై దృష్టి కేంద్రీకరించారని తెలిపారు.  కార్యక్రమంలో సాంఘిక గిరిజన గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌  కార్యదర్శి క్రిస్టివాజెడ్‌ చోంగ్లు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, గిరిజన గురుకులాల ఉప కార్యదర్శి నవీన్‌ నికోలస్‌, సీతారాం నాయక్‌, స్థానిక కార్పొరేటర్‌ కోరని శ్రీలతామహాత్మ తదితరులు పాల్గొన్నారు. 

పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాలి: మంత్రి తలసాని

ఎల్బీనగర్‌: పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని నాగోలు శ్మశాన వాటికలో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ, నాగోలు కార్పొరేటర్‌ చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు తెలంగాణ వ్యాప్తంగా ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో  డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సతీష్‌ యాదవ్‌, హయత్‌నగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ మారుతీ దివాకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


logo