గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 07:16:48

ముంపు ప్రాంతాల్లో ఆరోగ్యరక్ష

ముంపు ప్రాంతాల్లో ఆరోగ్యరక్ష

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలోని ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా హైదరాబాద్‌  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు  ముమ్మరం చేసింది.  ప్రతి రోజు ఔట్‌ రీచ్‌ క్యాంపులతో పాటు అదనంగా 104 అంబులెన్స్‌ల ద్వారా ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వైద్యసిబ్బంది.  వానలు, వరదల వల్ల సాధారణంగా వచ్చే అంటు వ్యాధులు, చర్మ రోగాలు, డయేరియా వంటివి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వరదకు గురైన కాలనీలు, బస్తీలతో పాటు ప్రతి ఇంటిని వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సర్వే చేస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు. 265 ఔట్‌రీచ్‌ క్యాంపులతో పాటు 31  అంబులెన్స్‌లతో ముంపు ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. బాధితుల్లో కొందరికి చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నట్లు గుర్తించామని, వారి నుంచి రక్త నమూనాలు సేకరించి చికిత్స అందించినట్లు చెప్పారు. గురువారం ఒక్కరోజే 292 ప్రాంతాల్లో  24,223 మందిని పరీక్షించి 1542 మందికి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఔట్‌రీచ్‌ క్యాంపుల ద్వారా 262 ఏరియాలు, 104 అంబులెన్స్‌ల ద్వారా 30 ప్రాంతాల్లో సిబ్బంది పర్యటించి వైద్యసేవలు అందించినట్లు వివరించారు.743 వైద్య, ఆరోగ్య సర్వే బృందాలు 62,742 ఇండ్లను సర్వే చేసి.. ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నాయన్నారు. 151 మంది మలేరియా అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించామని, వాంతులు, విరేచనాలకు గురైన వారికి 33,539 ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా 10,323 మందికి మాస్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.