శుక్రవారం 07 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:39:05

లిఫ్ట్‌ ఇచ్చిన మహిళలను వేధించిన..

లిఫ్ట్‌ ఇచ్చిన మహిళలను వేధించిన..

టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

బంజారాహిల్స్‌ : లిఫ్ట్‌ ఇచ్చిన మహిళను వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన వీరబాబు(33) టీఎస్‌ఎస్‌పీ 12వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. యూసుఫ్‌గూడలోని ఫస్ట్‌బెటాలియన్‌ క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు అటాచ్‌లో ఉన్న వీరబాబు అక్కడే డ్యూటీ చేస్తున్నాడు. 

ఈనెల 7న ఉదయం 8.15 ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలో నివాసముంటున్న మహిళ (34) జూబ్లీహిల్స్‌ వైపు నుంచి హోండా సిటీ కారులో తన ఇంటికి వెళుతోంది. అదే సమయంలో ఇందిరానగర్‌ ప్రాంతంలో యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్‌ వీరబాబు ఆ కారును ఆపాడు. డ్యూటీకి టైమవుతోంది.. పంజాగుట్టలో డ్రాప్‌ చేయాలని కోరగా.. ఆ మహిళ కారులో ఎక్కించుకుంది. ప్రయాణిస్తున్న సమయంలోనే  వీరబాబు ఆమె వద్ద నుంచి ఫోన్‌ నంబర్‌ తీసుకొని... తన ఫోన్‌ నంబర్‌ ఆమెకు ఇచ్చాడు. పంజాగుట్టలో వీరబాబును దింపేసిన మహిళ.. ఇంటికి వెళ్లిపోయింది.

కౌన్సెలింగ్‌ నుంచి వస్తూ.. మరో మహిళా డాక్టర్‌ను..

శ్రీనగర్‌కాలనీకి చెందిన మహిళను వేధించిన కేసులో వీరబాబును అరెస్ట్‌ చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు.. అతడిని విచారించగా మరో నిర్వాకం బయటపడింది. ఈ నెల 9న షీటీమ్స్‌ కౌన్సెలింగ్‌ కోసం వెళ్లి వచ్చే సమయంలో.. లక్టీకాపూల్‌లో ఓ లేడీ డాక్టర్‌ కారును ఆపిన  వీరబాబు.. మాసాబ్‌ట్యాంక్‌ వరకు లిఫ్ట్‌ ఇవ్వాలని కోరాడు. తనకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని. ఎప్పుడైనా అవసరం ఉంటే ఫోన్‌ చేస్తానంటూ.. డాక్టర్‌ వద్ద నుంచి ఫోన్‌ నంబర్‌ తీసుకున్న వీరబాబు.. రెండురోజుల నుంచి ఆమెకు  ఫోన్లు చేస్తూ వేధిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు బాధిత డాక్టర్‌ రెండురోజుల కిందట సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా కేసు నమోదైనట్లు గుర్తించారు. 

వేధింపులు షురూ..

మరుసటి రోజు నుంచి వీరబాబు తరచూ ఆమెకు ఫోన్లు చేయడంతో పాటు వాట్సాప్‌ సందేశాలు పంపిస్తూ వేధింపులు ప్రారంభించాడు. ఫొటోలు పంపించాలని, తనతో మాట్లాడాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈనెల 9న షీటీమ్స్‌ పోలీసులు వీరబాబును  కంట్రోల్‌రూమ్‌కు పిలిపించి.. కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి ఇలాంటి తప్పు చేయనంటూ వీరబాబు ప్రాధేయపడటంతో.. హెచ్చరించి వదిలేశారు. కౌన్సెలింగ్‌ తర్వాత కూడా ఆమెకు ఫోన్‌లో సందేశాలు పెట్టాడు. దీంతో ఆ మహిళ శనివారం సాయంత్రం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు వీరబాబుపై ఐపీసీ 354 (డీ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్‌ చేశారు. 

      చట్టానికి ఎవరూ అతీతులు కారు..

మహిళను వేధించిన కానిస్టేబుల్‌ వీరబాబు వ్యవహారంపై నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. మహిళను వేధించిన 12వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ వీరబాబును అరెస్ట్‌ చేసి జైలుకు పంపించామన్నారు. పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకున్న ఇలాంటి క్రిమినల్స్‌ చర్యలతో సిగ్గుపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పనులకు పాల్పడేవారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, పోలీస్‌శాఖకు చెందిన వారెవరైనా తప్పు చేస్తే 9490616555 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.


logo