గురువారం 25 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 18, 2021 , 06:13:17

సౌర విద్యుత్‌పై గ్రేటర్‌ వాసుల ఆసక్తి

సౌర విద్యుత్‌పై గ్రేటర్‌ వాసుల ఆసక్తి

  • 7 వేలు దాటిన సోలార్‌ నెట్‌ మీటర్లు
  • ప్రతి రోజు 100 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి

మారుతున్న జీవన విధానంలో విద్యుత్‌ వినియోగం పెరుగుతున్నది. ఉత్పత్తి, వినియోగం మధ్య భారీ వ్యత్యాసం ఒకవైపు, మరోవైపు సహజ వనరులు కండ్ల ముందే కరిగిపోతున్న తరుణంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తే అసలైన ప్రత్యామ్నాయంగా మారింది.  ఎకరాల కొద్ది భూములు, ఎత్తయిన ప్రదేశాలే కాదు.. పట్టణాల్లోని ఇండ్ల మీద సైతం సోలార్‌ ప్యానెల్స్‌తో విద్యుదుత్పత్తి చేసే కార్యక్రమం ఊపందుకుంది. హైదరాబాద్‌ మహానగరంలో 2014లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జీరో. కానీ ఆరేండ్లలో 7300 మంది సౌర విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఒక వైపు తమ అవసరాలకు కావాల్సినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తూ ఆదాయం పొందుతున్నారు.

కనెక్షన్లు ఇలా..

గ్రేటర్‌ పరిధిలోని గృహాలు, భారీ భవనాలపై భాగంలో సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నెట్‌ మీటర్‌కు కనెక్షన్‌ ఇస్తారు.  సోలార్‌ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇండ్లలో వాడుకున్న తర్వాత మిగిలిన విద్యుత్‌ (యూనిట్ల రూపంలో) నెట్‌ మీటర్‌తో గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. గ్రిడ్‌కు పంపించిన యూనిట్ల లెక్క ఇండ్లలో ఏర్పాటు చేసిన నెట్‌ మీటర్‌లో నమోదవుతుంది. ఇంటికి వాడిన కరెంటు యూనిట్ల కంటే సౌర విద్యుత్‌ అధికంగా ఉత్పత్తి అయితే 6 నెలలకు ఒకసారి విద్యుత్‌ బిల్లులో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు.  ఉదాహరణకు ఒక ఇంటిలో 200 యూనిట్ల విద్యుత్‌ను వాడుకుంటే అందులో 100 యూనిట్లు సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ కనెక్షన్‌ ద్వారా ఉత్పత్తి అయితే, మిగిలిన 100 యూనిట్లకే చార్జీ వసూలు చేస్తారు.  3 కిలో వాట్స్‌ కంటే తక్కువ లోడ్‌ కలిగిన కనెక్షన్లకు 40 శాతం, 5 కిలో వాట్స్‌ దాటిన కనెక్షన్లకు 20 శాతం సబ్సిడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుండటంతో సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్లు తీసుకునేందుకు నగర వాసులు ఆసక్తి  చూపుతున్నారు. 3కిలో వాట్స్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్‌కు సుమారు రూ.1.20లక్షలు ఖర్చు అవుతుంది. 

పెరుగుతున్న సోలార్‌ రూఫ్‌ టాప్‌ కనెక్షన్లు

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. 4-5 ఏండ్ల క్రితం 1కిలో వాట్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.లక్ష ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.35-40వేలకే 1కిలో వాట్‌ ఉత్పత్తి అవుతున్నది. దీంతో  ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులు రూ.2 నుంచి 3వేలు చెల్లించే వారు ఇండ్ల మీద 3కిలో వాట్‌ సామర్థ్యంతో సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కోర్‌ సిటీతోపాటు నగర శివారు ప్రాంతాల్లోనూ కొత్తగా చేపడుతున్న నిర్మాణాల్లో సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో ఉన్న 9 సర్కిళ్లలో ప్రస్తుతం 7300 సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ మీటర్లు ఉండగా, వాటి ద్వారా ప్రతి రోజు 100 నుంచి 150 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. దీంతో ప్రతి నెలా సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్ల కోసం కొత్తగా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.

శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కోర్‌ సిటీతో పోల్చితే నగర శివారు ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పట్ల ఆసక్తి చూపే వినియోగదారులు ఎక్కువగా ఉన్నారని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. మేడ్చల్‌  సర్కిల్‌ పరిధిలో 19.6 మెగావాట్లు, రాజేంద్రనగర్‌ పరిధిలో 16.12 మెగావాట్లు, హబ్సిగూడలో 16.02, సైబర్‌ సిటీ( ఐటీ కారిడార్‌)లో 11.3 మెగావాట్ల  సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

ప్రభుత్వ మార్గదర్శకాలు

తెలంగాణలో సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు అమలు చేస్తున్నది. 2016 వరకు ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేసి 2020లో కొత్తగా వాటిని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం గృహ వినియోగదారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేలా అవసరమైన  సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసి, దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇతరులకు 80 శాతం మాత్రమే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. సింగిల్‌ ఫేజ్‌ వినియోగదారుడు 5కిలో వాట్స్‌ సామర్థ్యం ఉన్న సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

రిపోర్టు ఆధారంగా అనుమతి

ఇండ్ల మీద సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకొని విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలనుకునే వారు మొదట టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు ఆ ఇంటి ప్రాంతాన్ని పరిశీలించి సాధ్యాసాధ్యాల(ఫిజిబిలిటీ)పై రిపోర్టును ఇస్తారు. రిపోర్టు ఆధారంగా ఎంత మొత్తంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉందో దానికి మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత సంస్థ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఏజెన్సీలు ఇండ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసి నెట్‌ మీటరింగ్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో విద్యుత్‌ సంస్థ సరఫరా చేస్తున్న విద్యుత్‌తోపాటు సోలార్‌ ద్వారా వస్తున్న విద్యుత్‌ను నెట్‌ మీటరింగ్‌లో గుర్తించేలా చేస్తారు. సోలార్‌  రూఫ్‌టాప్‌ ద్వారా ఉత్పత్తి  అయిన విద్యుత్‌ను తగ్గించి మిగతా దానికి మాత్రమే బిల్లు వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు.

VIDEOS

logo