శనివారం 06 మార్చి 2021
Hyderabad - Jan 21, 2021 , 02:40:20

కోకాపేటలో మహావేలం

కోకాపేటలో మహావేలం

 • ఎకరం మొదలు 11.34 ఎకరాల విస్తీర్ణంలో విశాల ప్లాట్లు
 • 36, 45 ఫీట్ల రహదారులు.. అత్యాధునిక మౌలిక సౌకర్యాలు
 • రూ.280 కోట్లతో 513 ఎకరాల్లో వసతులు 
 • సర్కారు గ్రీన్‌సిగ్నల్‌తో హెచ్‌ఎండీఏ సర్వే షురూ 

నాలెడ్జ్‌ సిటీకి కూతవేట దూరంలో.. హైటెక్‌సిటీకి అత్యంత సమీపంలో ఉన్న కోకాపేటలో భారీ లేఅవుట్‌ చేసేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చకచకా అడుగులు వేస్తున్నది. హెచ్‌ఎండీఏ పంపిన ప్రతిపాదనకు సర్కారు సై అనడంతో సర్వే ప్రారంభించింది. 202 ఎకరాల్లో రహదారులు, ఇతరత్రా వసతులకు పోను 109.40 ఎకరాలను వేలం వేయనున్నారు. ఎకరం మొదలు గరిష్టంగా 11.34 ఎకరాల విస్తీరంలో 15 ప్లాట్లుగా విభజించనున్నారు. ఐటీపరంగా అత్యంత డిమాండ్‌ ఉన్న ప్రాంతం కావడంతోపాటు బహుళజాతి కంపెనీలను దృష్టిలో పెట్టుకొని ప్లాట్ల పరిమాణాన్ని నిర్ధారించారు. ఈ భారీ లేఅవుట్‌లో 36,45 ఫీట్ల విశాల రహదారులతోపాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందుకు రూ.280 కోట్లు ఖర్చవుతాయని ప్రణాళిక రూపొందించగా ప్రభుత్వం అనుమతి తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. పనులు ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే మొదలుపెట్టారు.

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): చారిత్రక హైదరాబాద్‌... సికింద్రాబాద్‌తో కలిసి జంట నగరాలు... ఆపై సైబరాబాద్‌... ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ ఇలా వేటికవే మినీ నగరాలుగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహా నగర ప్రస్థానంలో మరో మినీ నగరానికి పయనం మొదలైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇతర మెట్రో నగరాలను వెనక్కి నెట్టి దూసుకుపోతున్న తరుణంలో అంతర్జాతీయ కంపెనీలు చూపుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కోకాపేటలో మరో మినీ నగరానికి కసరత్తు షురూవైంది. బహుళ జాతి కంపెనీలు, అంతర్జాతీయస్థాయి డెవలపర్లను ఆకర్షించేలా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఏకంగా 109.40 ఎకరాల్లో భారీ లేఅవుట్‌కు సర్వే ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయి హంగులతో అభివృద్ధి కానున్న ఈ లేఅవుట్‌తో కోకాపేట మరో హబ్‌గా మారనుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.

అంతర్జాతీయ హంగులతో..

అత్యంత సమీపంలో గండిపేట... అర కిలోమీటరు దూరంలోపే అవుటర్‌ రింగు రోడ్డు... చేరువలోనే ఫైనాన్షియల్‌ డిస్టిక్‌... ఇదీ కోకాపేట ప్రత్యేకత. అందుకే ఇక్కడి భూములంటేనే హాట్‌కేకులు. 2006లో ఇదే రుజువు కాగా... ఇప్పుడు ఐటీ రంగంలో హైదరాబాద్‌ మరింత వేగంగా దూసుకుపోతున్న తరుణంలో ఇక్కడి భూములకు మరింత డిమాండు పెరిగిందనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలో కోకాపేటలోని సర్వే నంబరు 239, 240ల్లో అంతర్జాతీయ హంగులతో భారీ లేఅవుట్‌ను రూపొందించేందుకు హెచ్‌ఎండీఏ చాలా రోజులుగా కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవంగా ఈ రెండు సర్వే నంబర్లలోని 513 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. వివిధ అవసరాలు, కేటాయింపులకు పోను సుమారు 202 ఎకరాల్లో భూమి మిగిలి ఉంది. ఇందులో భారీ లే అవుట్‌కు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఐటీ, అనుబంధ రంగాలకు సంబంధించి అంతర్జాతీయ కంపెనీలు, అంతర్జాతీయ స్థాయి డెవలపర్సు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో అందుకు అనుగుణంగా లేఅవుట్‌ను తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించారు. తద్వారా ఈ లేఅవుట్‌లో పదుల సంఖ్యలో అంతస్తులతో కూడిన ఆకాశహర్మ్యాలు వెలిసేలా రహదారుల నిర్మాణం, అంతర్జాతీయ హంగులతో మౌలిక వసతులను ముందుగానే ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 

రూ.280 కోట్లతో...

హెచ్‌ఎండీఏ అధికారులు 202 ఎకరాలను లేఅవుట్‌కు ఎంచుకోగా... రోడ్లు, ఇతర మౌలిక వసతులు పోను పక్కాగా ప్లాట్ల విస్తీర్ణం 109.40 ఎకరాలుగా ఉంది. అయితే ఈ లేఅవుట్‌లోనే కాకుండా రెండు సర్వే నంబర్లలోని 513 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా 45, 36 ఫీట్ల రహదారుల నిర్మాణం, అత్యాధునిక స్థాయిలో భూగర్భ డ్రైనేజీ, అంతర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, సైక్లింగ్‌ ట్రాక్స్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ (పచ్చదనం), ఫుట్‌పాత్‌లు, వాననీరు సాఫీగా వెళ్లిపోయేందుకు స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ వ్యవస్థ వంటి నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందుకు సుమారు రూ.280 కోట్ల వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలపడంతో అధికారులు తాజాగా సర్వే ప్రారంభించారు. మౌలిక వసతుల ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత రెండు దఫాలుగా ప్లాట్లను వేలం వేయనున్నారు. తొలుత 69.95 ఎకరాల్లో తొమ్మిది ప్లాట్లు, రెండో దశలో 39.45 ఎకరాల్లో ఆరు ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించారు.

కోకాపేట లేఅవుట్‌ సంక్షిప్త రూపం ఇలా...

 • సర్వే నంబరు 239, 240ల్లో మొత్తం విస్తీర్ణం - 531.45 కరాలు
 • కేటాయింపులు, వసతులకు పోగా లేఅవుట్‌ విస్తీర్ణం - 202.23 ఎకరాలు
 • లేఅవుట్‌ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులకు కేటాయించినది - 54.61 ఎకరాలు
 • రహదారులకు పోను వేలం వేసే ప్లాట్ల విస్తీర్ణం - 109.40 ఎకరాలు
 • మొదటి దశలో వేలానికి పెట్టే ప్లాట్లు - తొమ్మిది (69.95 ఎకరాలు)
 • రెండో దశలో వేలానికి పెట్టే ప్లాట్లు - ఆరు (39.45 ఎకరాలు)
 • అత్యధిక విస్తీర్ణం ఉన్న ప్లాటు - నెంబరు 5 (11.34 ఎకరాలు)
 • ఐదెకరాలకు మించి విస్తీర్ణం ఉన్న ప్లాట్లు - 13
 • 45 ఫీట్ల రహదారులు - 5.69 కిలోమీటర్లు
 • 36 ఫీట్ల రహదారులు - 4.34 కిలోమీటర్లు 
 • నీటి సరఫరా వ్యవస్థ - 19.34 కిలోమీటర్లు
 • అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ - 20.47 కిలోమీటర్లు 

VIDEOS

logo