బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 01:11:28

గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ

గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో అందరికీ అవసరమైన శానిటైజర్లు, మాస్కులు తయారుచేయడంలో గిరిజన సహకార సంస్థ ముందున్నది. గిరిజన మహిళలను ప్రోత్సహిస్తూ జీసీసీ ఆధ్వర్యంలో సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల ద్వారా శానిటైజర్‌, మాస్కుల తయారీ యూనిట్లు నెలకొల్పి వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో ‘గిరి’ ఉత్పత్తులు మంచి ఆదరణ పొందుతున్నాయి.

70 వేల మాస్కులు తయారు..

లాక్‌డౌన్‌ కాలంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఆ శాఖ కమిషనర్‌, కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తూ చొరవతో గిరిజన మహిళా గ్రూపులు మాస్కుల తయారీకి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల నుంచి ముడిసరుకు తెప్పించి వారికి అందజేయడంతో ఇప్పటికే 70 వేల మాస్కులు తయారు చేసి ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు అందజేశారు. 

ఆయుష్‌ ఫార్ములాతో శానిటైజర్‌ యూనిట్‌

రాజేంద్రనగర్‌లోని గిరిజన సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్‌లో డ్రగ్‌ అండ్‌ లైసెన్స్‌ విభాగం అనుమతించిన ఆయుష్‌ ఫార్ములాతో శానిటైజర్‌ యూనిట్‌ నెలకొల్పారు. ఇందులో 75 శాతం ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, విటమిన్‌-ఇ, డిస్టిలరీ వాటర్‌తో పాటు లెమెన్‌ గ్రాస్‌తో పెర్‌ఫ్యూమ్‌ మిళితం చేస్తూ మార్కెట్లో దొరికే ఉత్పత్తులకంటే నాణ్యంగా ఈ శానిటైజర్‌ను తయారు చేస్తున్నారు. ఈ ‘గిరి’ శానిటైజర్‌, మాస్కులతో పాటు ఇతర ఉత్పత్తులను విరివిగా మార్కెట్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.

పోచంపల్లి మాస్కులకు డిమాండ్‌ 

 కరోనా వ్యాధి సోకకుండా ఉండాలంటే మాస్కు ధరించడం అత్యంత ప్రధానంగా మారింది. తెలంగాణ చేనేత పారిశ్రామిక సహకార సంఘం(టెస్కో) ద్వారా తయారు చేసిన పోచంపల్లి మాస్కులు తిరిగి ఉపయోగించుకునేలా రూపొందించారు. రోజుకు 2 వేల నుంచి 5 వేల మాస్కుల వరకు విక్రయం జరుగుతున్నది. ఇప్పటి వరకు 50 వేలు విక్రయించారు. సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేసే ఈ మాస్కులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వీటి ధర రూ.20 నుంచి 40 వరకు ఉంది. చేనేతను ప్రోత్సహించడంలో భాగంగా పలు ప్రైవేట్‌ ఆర్గనైజేషన్స్‌ విక్రయించడం విశేషం.


logo