శుక్రవారం 27 నవంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 07:20:23

హాల్‌మార్కింగ్‌తో.. అపాయం..

హాల్‌మార్కింగ్‌తో.. అపాయం..

  • ఆభరణాల స్వచ్ఛత తనిఖీకి రసాయనాల వినియోగం
  • పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోకుండా బంగారం స్వచ్ఛతను తెలిపేదే హాల్‌మార్క్‌.  ఈ హాల్‌మార్కింగ్‌ ప్రక్రియ ఇప్పుడు పర్యావరణానికి హాని చేకూరుస్తున్నది. ఈ ప్రక్రియలో రసాయనాలను వినియోగిస్తుండటంతో కాలుష్యం వెలువడుతున్నది. ప్రధానంగా కప్‌లేషన్‌ ప్రక్రియ, యాసిడ్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా విషవాయువులు వెలువడుతున్నాయి. వాయుకాలుష్యంతోపాటు, జల కాలుష్యం, ఘనవ్యర్థాలు సైతం పోగవుతున్నాయి. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బంగారం, వెండి ఆభరణాల స్వచ్ఛతను పరీక్షించి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) హాల్‌మార్కింగ్‌ను జారీ చేస్తారు. ఇందుకోసం హాల్‌మార్కింగ్‌ ల్యాబ్‌లు, సెంటర్లు ఉంటా యి. ఈ హాల్‌మార్కింగ్‌ సెంటర్లన్నీ నివాస ప్రాంతాల్లో, వాణిజ్య సముదాయాల్లో ఉంటున్నాయి. హాల్‌మార్కింగ్‌తోపాటు, ఈ ప్రక్రియలో రసాయనాల వాడకంతో విషవాయువులు వెలువడుతున్నాయి. హాల్‌మార్కింగ్‌ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే కార్మికులు అనారోగ్యం బారినపడుతున్నారు. వీరి రక్తంలో సీలం అధికంగా ఉంటున్నట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కాలుష్య నియంత్రణ మండలి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

కాలుష్యం వెలువడుతున్నదిలా..

బంగారం, ఆభరణాల స్వచ్ఛంగా మార్చేందుకు కప్‌లేషన్‌ ప్రక్రియను అనుసరిస్తారు. అంతేకాకుండా విడిభాగాలుగా చేయడం కోసం యాసిడ్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తారు. ఈ సమయంలో లెడ్‌ ఆక్సైడ్స్‌, నైట్రస్‌ విషవాయువులు వెలువడతాయి. వీటిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్వచ్ఛంగా మార్చే ప్రక్రియలో భాగమవుతున్న కార్మికులు, ఇతర వ్యక్తులు సైతం ఈ విషవాయువుల బారిన పడుతున్నారు.

పరిష్కారం  : 

విషవాయువులను అదుపు చేయడానికి గోల్డ్‌ అస్సేయింగ్‌, హాల్‌మార్కింగ్‌ సెంటర్లలో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను అమర్చుకోవాలి. స్కబ్బర్లను వినియోగించాలి. సక్షన్‌హుడ్‌, లేదంటే డక్ట్‌ల ద్వారా బయటికి పంపాలి. 
వాసనలను అదుపు చేయడానికి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని వెదజల్లాలి. స్కబ్బర్లు, స్ప్రింక్లర్లు వెదజల్లడం ద్వారా పోగైన నీటిని సైతం జాగ్రత్తగా సేకరించాలి.
వాడిన యాసిడ్‌ను నాలాలు, కాల్వల్లో పారబోయకుండా కంటైనర్లలో భద్రపరిచి, ఘన వ్యర్థాల శుద్ధికేంద్రాలకు తరలించాలి. 
లిస్మస్‌ పేపర్‌ ఆధారంగా నీటిలోని పీహెచ్‌ను పరిశీలించి, యాసిడ్‌గా తేలిన జలాలను సైతం శుద్ధికేంద్రాలకు తరలించాలి.
కార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లను అందజేయాలి. విషవాయువులు పీల్చుకోకుండా ఉండేందుకు ఫేస్‌షీల్డ్స్‌, హెల్మెట్లు, యాసిడ్‌ గ్లౌజులు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ సమకూర్చాలి.
కప్‌లేషన్‌కు బదులుగా స్పార్క్‌, ఆర్క్‌, ఓఈఎస్‌ పద్ధతులను అనుసరించాలి.