e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 16, 2021
Advertisement
Home హైదరాబాద్‌ ఎర్రటెండల్లో ఎగిసొచ్చిన గోదావరి

ఎర్రటెండల్లో ఎగిసొచ్చిన గోదావరి

ఎర్రటెండల్లో ఎగిసొచ్చిన గోదావరి
  • రైతుల జలకల సాకారం
  • హల్దీ వాగు, గజ్వేల్‌ కాలువల్లోకి
  • కాళేశ్వర జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌
  • బీడు భూములను ముద్దాడనున్న జలాలు
  • గోదావరి నీటిని చూసి మురిసిన సబ్బండ వర్ణాలు
  • రైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం
  • గంగమ్మకు పూజలు చేసి, పుష్పాలు చల్లిన జనం
  • సంగారెడ్డి కాలువ, గజ్వేల్‌ కెనాల్‌ వెంట అద్భుత దృశ్యాలు

బిందువు..బిందువు సింధువవుతుంది. కానీ బిందువే వట్టిపోయినప్పుడు సింధువే ఎగిసొచ్చి ఆ బిందువులకు ప్రాణం పోస్తే.. ఆ అరుదైన దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం సాకారమై ఒక అద్భుతం చోటు చేసుకున్నది.

ఉపనదులు పయనించి ప్రధాన నదుల్లో కలవడం భౌగోళిక ధర్మం. కానీ ప్రధాన నదులే వెళ్లి ఉపనదుల్లో కలిసేలా చేస్తే అది మానవుడు సాధించిన విజయం. నదీమ తల్లి గోదావరి మండుటెండల్లోనూ తిరుగు ప్రయాణం చేసి ఎగిసొచ్చి తన ఉపనది మంజీరాలో కలిసిన మహత్తర ఘటన మంగళవారం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ నుంచి గోదావరి జలాలు హల్దీ వాగు లోకి ప్రవేశించి అటు నుంచి మంజీరాకు తరలివెళ్తున్నాయి. నీరు పల్లమెరుగు.. కానీ, తెలంగాణలో అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ కృషితో ఎదురెక్కి గోదారి జలాలు బీడుభూములను, ఎండుతున్న పంట పొలాలను ముద్దాడుతున్నాయి.

సృష్టికి ప్రతిసృష్టిని తలపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మ ప్రాజెక్టుకు తెచ్చి, మళ్లీ హల్దీ వాగు, మంజీరా నదుల నుంచి నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా తిరిగి గోదావరిలోకి జలాలను పంపే మహాద్భుతం ఆవిష్కృతమైంది. రైతుల సాగునీటి గోస తీర్చచడమే లక్ష్యంగా గోదావరి జలాలు కాల్వల వెంట పరుగులు తీశాయి. బీడుపడ్డ మాగాణాలు మళ్లీ పసిడి పంటలతో కళకళలాడేలా గోదారమ్మ కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి కాలువ ద్వారా హల్దీవాగులోకి.. గజ్వేల్‌ కెనాల్‌ ద్వారా చెరువుల్లోకి పరుగులు తీశాయి.

మంగళవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నీటి విడుదల చేయగానే గోదారమ్మ జలసవ్వడి చేసింది. కొవిడ్‌ నిబంధనలతో కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించినా, ఈ అద్భుత దృశ్యాలను తిలకించడానికి రైతులు, మహిళలు, చిన్నారులు, నాయకులు ఇలా.. అన్నివర్గాలు తరలివచ్చాయి. మండుటెండల్లో గోదావరి జలాలు ఎండిన చెరువులు, వాగుల్లోకి వెళ్తున్న మహద్భుతాన్ని చూస్తూ రైతులు ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ మురిసిపోయారు. కాల్వలు, చెరువుల వెంట స్థానికులు సంబురాల్లో మునిగితేలారు.

మాకు నీళ్లొస్తున్నాయి..

ఇక్కడ హల్దీవాగులోకి నీళ్లు వదులుతున్నారని తెలిసి సూడనీకి వచ్చిన. కొండపోచమ్మ సాగర్‌ నుంచి హల్దీవాగుకు సీఎం కేసీఆర్‌ నీళ్లు వదిలిండు. ఇక మా బతుకులు మారనున్నాయి. మా పొలాలకు నీళ్లొస్తే మేము కూడా మంచిగ పంట చేసుకుంటం. సీఎం గారికి ధన్యవాదాలు. – నరహరి విఠల్‌, కోరేగావ్‌ గ్రామం, కోడేగిర్‌ మండలం, నిజామాబాద్‌

ఇన్ని నీళ్లు ఎప్పుడూ సూడలె..

మా వర్గల్‌ మండలంలో ఇన్ని నీళ్లు ఎప్పుడూ సూడలేదు. అసలు వస్తాయని కూడా అనుకోలె. నీళ్లు కాల్వలోనికి వదులుతున్నారని తెలిసి మా కుటుంబం అంతా ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు మాదారంలో రెండు ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు మా భూమిలో పంటలు పండిస్తాం. సీఎం కేసీఆర్‌ సార్‌కు ధన్యవాదాలు. – సింగితం చంద్రకళ, గృహిణి , వర్గల్‌ సిద్దిపేట జిల్లా

ఎండ కాలం ఎవుసానికి నీళ్లొచ్చినయ్‌..

ఎండకాలం వస్తే చాలు రైతులు వేసిన పంటలకు నీరు అందక ఎండి పోయేటివి. కానీ, నేడు సీఎం కేసీఆర్‌ రైతులు పాలిట దేవుడిగా మారి ఎండకాలంలో కూడా పంటలకు సాగునీళ్లు అందించి ఆదుకుంటున్నడు. సీఎం కేసీఆర్‌ సార్‌ చేస్తున్న కృషి రైతులు ఎన్నటికీ మరువరు. – కాస కిష్టయ్య రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట

Advertisement
ఎర్రటెండల్లో ఎగిసొచ్చిన గోదావరి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement