ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు ఓ వ్యక్తి కేకు ఇప్పించి..అపహరించాడు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కేనగర్లో ఎస్.కె.ఫరీద్ పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. అతనికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. ఫరీద్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అదే కాలనీకి చెందిన బర్నబాస్ అనే వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటాడు. పనులకు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఫరీద్ రెండో కూతురు ముస్కాన్(8)కు బర్నబాస్ కేకును ఇప్పించి అపహరించాడు. సాయంత్రం వచ్చేసరికి ఇంటి వద్ద కూతురు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులతో కలిసి చుట్టుపక్కల వెతికినా.. ఆచూకీ లభించలేదు. కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా, బర్నబాస్ బాలికను ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు, హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.