బుధవారం 08 జూలై 2020
Hyderabad - May 30, 2020 , 01:46:18

లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ప్రత్యేక కార్యాచరణ

లోతట్టు ప్రాంతాల్లో  నీరు నిల్వకుండా ప్రత్యేక కార్యాచరణ

భారీ వర్షం కురిసినా.. చుక్క నీరు నిల్వనీయమని.. ఏ సమస్యా రానివ్వమని.. ఇందుకోసం రేయింబవళ్లు పనిచేస్తామని.. నగరవాసులకు ఏ కష్టామూ రాకుండా కంటికిరెప్పలా కాపాడుకుంటామని అభయమిస్తున్నది బల్దియా. వర్షాకాలంలో ముంపు ముప్పును తప్పించేందుకు పక్కా కార్యాచరణతో సిద్ధమైంది.  ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. ఎదుర్కొంటామంటున్నది.  ఇందుకోసం రూ. 24. 53 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా 267 బృందాలను ఏర్పాటు చేసింది.  30 చోట్ల నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు సిద్ధం చేసింది.  24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.

హైదరాబాద్  : ముంపు సమస్యను సమర్థవంతంగా అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ రూ. 24.53 కోట్లతో తగిన కార్యప్రణాళికను రూపొందించింది. 24గంటలూ విధుల్లో ఉండేలా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. ముంపు సమస్య తలెత్తే ప్రాంతాల్లో నీటిని తోడిపోసేందుకు మోటార్లను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు.  నగరంలో భారీ వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రూ. 24.53 కోట్లతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.

 నీరు నిలిచి ముంపు సమస్య తలెత్తడంతో పాటు ట్రాఫిక్‌కు ఇబ్బందులు సృష్టించే 157 ప్రాంతాలను గుర్తించి అందులో 127 చోట్ల నీరు నిల్వకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మిగిలిన 30 ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడేందుకు 10హెచ్‌పీ సామర్థ్యంగల మోటార్లను ఏర్పాటు చేశారు. వర్షాకాల అత్యవసర ప్రణాళిక కింద జోనల్‌, సర్కిల్‌ స్థాయిల్లో మొబైల్‌ టీమ్స్‌ను ఏర్పాటుచేశారు. డీసీఎం వాహనాలతో కూడిన 87 మినీ మొబైల్‌ బృందాలు, జేసీబీలతో కూడిన 79 మొబైల్‌ మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందుకోసం 101 స్టాటిక్‌ లేబర్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఇవి పనిచేస్తాయి. 

ముంపు సమస్య తలెత్తే ప్రాంతాలు 

సికింద్రాబాద్‌ ఒలిఫెంట్‌ బ్రిడ్జి, ఆలుగడ్డబావి, లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌, రాజ్‌భవన్‌రోడ్‌ విల్లామేరీ కాలేజీ, పంజాగుట్ట మోడల్‌హౌస్‌, కేసీపీ జంక్షన్‌, బల్కంపేట్‌ ఆర్‌యూబీ, జూబ్లీహిల్స్‌ నీరూస్‌ షోరూమ్‌, జూబ్లీహిల్స్‌ అపోలో క్రెడిల్‌ ఆసుపత్రి వద్ద, రాణిగంజ్‌ క్రాస్‌రోడ్‌, చిక్కడపల్లి తపాడియా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, హిమాయత్‌నగర్‌ మినర్వా హాటల్‌, ఖైరతాబాద్‌ రాజీవ్‌గాంధీ విగ్రహం, లక్డీకాపూల్‌, అత్తాపూర్‌ రేతీబౌలి జంక్షన్‌, టోలీచౌకీ గెలాక్సీ థియేటర్‌, షేక్‌పేట్‌ నాలా, ఎన్‌ఎండీసీ మెడ్‌ విజన్‌ ఐ దవాఖాన, బంజారాహిల్స్‌ 1/12 జంక్షన్‌, నాంపల్లి టీ జంక్షన్‌, బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌ను ముంపు సమస్య తలెత్తే ప్రాంతాలుగా గుర్తించారు. \\

చెరువులు ఉన్నచోట 

ట్రాఫిక్‌ సమస్యలు తప్పవు : జియావుద్దీన్‌

చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ స్పష్టం చేశారు. ఇటువంటివి 30ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోసేందుకు 10 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నీరు తొలగించే వరకు కొంత ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ముంపు సమస్య తలెత్తే ప్రాంతాల్లో మొబైల్‌ మాన్‌సూన్‌ బృందాలు 24 గంటలూ పనిచేస్తాయన్నారు. ఎక్కడ నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు చీఫ్‌ ఇంజినీర్‌ వివరించారు. 


logo