ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 23, 2021 , 06:47:30

20 రోజుల్లో కొలువుదీరనున్న గ్రేటర్‌ నూతన పాలకవర్గం

20 రోజుల్లో కొలువుదీరనున్న గ్రేటర్‌ నూతన పాలకవర్గం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మూడో పాలకవర్గం కొలువుదీరేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. తాజా పాలకవర్గం గడువు వచ్చే నెల పదో తేదీ వరకు ఉన్నది. అయితే గతేడాది డిసెంబర్‌లో బల్దియా ఎన్నికలు జరిగినప్పటికీ ఈ అంశంపై పెద్దగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకోలేదు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం గెలిచిన కార్పొరేటర్ల పేర్లతో గెజిట్‌ జారీ చేసింది. దీంతో నెమ్మదిగా గ్రేటర్‌ రాజకీయాల్లో కదలిక వచ్చింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు తాజాగా శుక్రవారం ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో కొత్త పాలకవర్గం కొలువుదీరడంపై ఆసక్తి మొదలైంది. అయితే టీఆర్‌ఎస్‌కు కార్పొరేటర్లు,  ఎక్స్‌అఫీషియో బలం ఉండటంతో బల్దియా పీఠం గులాబీపరం కావడమనేది లాంఛనమే. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మూడో పాలకవర్గం కొలువు దీరేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. జీహెచ్‌ఎంసీ ఏర్పడిన తర్వాత తొలిసారి 2009లో జరిగిన ఎన్నికలతో తొలి పాలకవర్గం ఏర్పడగా.. తర్వాత 2016లో గ్రేటర్‌ ఎన్నికలు జరిగాయి. తొలి పాలకవర్గంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ  లేనందున కాంగ్రెస్‌-మజ్లిస్‌లు పొత్తుతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాల్ని కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం మేరకు చెరి రెండున్నర సంవత్సరాల పాటు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల్ని పంచుకున్నారు. వచ్చే నెల కొలువుదీరనున్న పాలకవర్గం మూడోది కాగా... నాలుగో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం వచ్చే నెల 11న జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఎన్నికను పరిశీలించేందుకు ఎన్నికల కమిషనర్‌  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి ఉన్న దరిమిలా ఈ జిల్లాల్లో ఒక జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. ఈ అధికారి వచ్చే నెల తొమ్మిదో తేదీ లోపు ఎప్పుడైనా ప్రత్యేక సమావేశ నిర్వహణలో భాగంగా సమావేశానికి హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ప్రారంభం అవుతుంది. హాజరైన సభ్యులతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఆనంతరం 12 గంటల నుంచి మేయర్‌ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. మేయర్‌ ఎన్నికకు నామినేషన్లను స్వీకరించి ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. మొదట మేయర్‌, ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఏదైనా కారణాల వల్ల మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు నిర్వహించనున్నారు. 

 • ఎస్‌ఈసీ మార్గదర్శకాలు ఇలా...

  ప్రత్యేక సమావేశం - (ఫారం-1 ప్రకారం) రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీ, సమయంలో గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎస్‌ఈసీ చేత నియమించిన జిల్లా కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలి. అయితే ఈ ప్రత్యేక సమావేశంపై సభ్యులందరికీ మూడు రోజుల ముందుగా ఫారం-2 నమూనాలో ఎస్‌ఈసీ నియమించిన ప్రత్యేక అధికారి ప్రత్యేక సమావేశం తేదీ, సమయాన్ని సూచిస్తూ నోటీసు ఇస్తారు.

  ఎన్నిక జరిగేదాకా సమావేశాలే...

  ఎస్‌ఈసీ నిర్ణయించిన మేరకు గెలిచిన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారు. అనివార్య కారణాల వల్ల ఎన్నిక జరగనట్లయితే తదుపరి రోజు (పబ్లిక్‌ హాలిడే లేకుంటే) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక చేపడతారు. ఒకవేళ రెండో సమావేశంలోనూ ఎన్నిక జరగనట్లయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతారు. ఆపై ఎస్‌ఈసీ తదుపరి తేదీ, సమయాన్ని నిర్ధారించి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు ఈ ప్రత్యేక సమావేశాల్ని నిర్వహిస్తారు. కాగా .. సమావేశం నిర్వహించాలంటే కచ్చితంగా ఓటు హక్కు ఉన్న సభ్యుల సంఖ్యలో సగంమంది(కోరం) హాజరుకావాల్సి ఉంటుంది.

  టీఆర్‌ఎస్‌కు మెజార్టీ...

  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ పార్టీకే కార్పొరేటర్ల సీట్లు దక్కాయి. 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌కు 56 మంది, బీజేపీకి 48, ఎంఐఎంకు 44 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో లింగోజిగూడ నుండి గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్‌ రమేష్‌ ఇటీవల మృతి చెందారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటింగ్‌ కూడా కీలకంగా మారనుంది. 45 నుండి 50 వరకు ఎక్స్‌అఫిషియో మెంబర్లు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ఉండే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుల సంఖ్యను ఖరారు చేసేందుకు ముందుగా జీహెచ్‌ఎంసీ సీడీపీఎం అధికారులకు ప్రజాప్రతినిధులకు లేఖ రాయనున్నారు. పురపాలక శాఖలో ఓటు హక్కు వినియోగంపై వారి నుంచి స్పష్టత తీసుకోనున్నారు. ఐతే ఎక్స్‌అఫీషియోలో అధికంగా 35 వరకు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉండే అవకాశం ఉంది. దీంతో సమావేశానికి హాజరైన వారిలో సునాయసంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి మెజార్టీ ఉంటుందనేది సుస్పష్టం. ఫలితంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాల్ని గులాబీ దళం కైవసం చేసుకోనుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 

  మేయర్‌ ఎన్నిక ఇలా...

  • మొదట ఒక సభ్యుడు ప్రతిపాదిస్తాడు. దానికి రెండో సభ్యుడు ఆమోదిస్తాడు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేయాలనుకుంటే ఆ పార్టీ అధ్యక్షుడు ధ్రువీకరణతో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌కు ఉదయం 10 గంటల లోపు ఆ పత్రాలను సమర్పించాలి. ఈ పత్రంపై రాష్ట్ర అధ్యక్షుడి అధికారిక ముద్ర తప్పనిసరిగా ఉండాలి.
  • ఆయా ప్రతిపాదిత మేయర్‌ అభ్యర్థికి మొదటి సభ్యుని పేరు, రెండో సభ్యుని పేరును అందులో పొందుపర్చాలి.
  • ఒకే అభ్యర్థిని ప్రదిపాదిస్తే ఎన్నిక ఉండదు. ఆ అభ్యర్థినే మేయర్‌గా ప్రకటిస్తారు. ఒకటికి మించి అభ్యర్థులు ఉంటే ఎన్నికను నిర్వహిస్తారు. ఈ ఎన్నిక విధానంలో సమావేశానికి హాజరైన సభ్యులు తమ చేతులు పైకి ఎత్తాల్సి ఉంటుంది.
  • మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ఒకేసారి నోటిఫికేషన్‌ ఉంటుంది. మేయర్‌ ఎన్నిక పూర్తి అయ్యాక, ప్రిసైడింగ్‌ అధికారి డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వయిస్తారు. సమావేశంలో భాగంగా చేతులు ఎత్తిన సభ్యుల సంఖ్యను ప్రిసైడింగ్‌ ఆధికారి లెక్కిస్తారు. అలా ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో గుర్తించి ప్రకటిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని మేయర్‌ అభ్యర్థిగా ఖరారు చేస్తారు. ఎన్నిక సమయంలో అభ్యర్థికి సమాన ఓట్లు వస్తే ప్రిసైడింగ్‌ అధికారి సభ్యుల సమక్షంలో డ్రా తీసి మేయర్‌ అభ్యర్థిని ప్రకటిస్తారు.

VIDEOS

logo