ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Dec 02, 2020 , 06:29:52

ఊహలు గుసగుసలాడే.. ఎవరి లెక్కలు వారివే..

ఊహలు గుసగుసలాడే.. ఎవరి లెక్కలు వారివే..

  • కూడికలు, తీసివేతల్లో అభ్యర్థుల తలమునకలు
  • అతి తక్కువ పోలింగ్‌పై అంతు చిక్కని ఓటర్‌ నాడి
  • అభివృద్ధి, సంక్షేమం వైపే మొగ్గు చూపారంటున్న గులాబీ శ్రేణులు  

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. అయితే గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ఓటింగ్‌ శాతం నమోదు కావడంతో రాజకీయ పార్టీలను ఒకింత అవాక్కయ్యేలా చేసింది. పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తూ ఏ డివిజన్‌లో ఏ అభ్యర్థి గెలిచే అవకాశముందన్న అంచనాలపై నాయకులు గుసగుసలాడుతూ కనిపించారు. ఓటు వేసేందుకు ప్రధానంగా 

35 సంవత్సరాల వయస్సు పైబడిన వారే ఆసక్తి చూపడంతో అభివృద్ధి, సంక్షేమాన్ని ఓటర్లు దీవించారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్ల సందడి లేక బూత్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదు కావడంతో నేతలకు ఓటర్‌ నాడి అంతుచిక్కడం లేదు.ఈ క్రమంలోనే ఎక్కడ ప్రతికూలం, అనుకూలమనే అంశాలపై ఆరా తీస్తున్నారు. యువత, మేధావి వర్గాలు, తదితర ఉన్నత వర్గాలు ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటరు నాడిని ఒడిసిపట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. గెలుపుతీరాలకు చేరగలమో, లేదోనన్న ఆందోళనలో తేలియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీల అభ్యర్థులంతా కూడికలు తీసివేతల్లో తలమునకలయ్యారు. పోలైన ఓటింగ్‌ శాతంలో ప్రతిపక్ష పార్టీల కంటే తమకే అనుకూలంగా ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం వైపే ఓటర్లు మొగ్గు చూపారని, జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

ఎక్కువగా అపార్ట్‌మెంట్ల వాసులు, యువత ఓటింగ్‌కు అనాసక్తి కనబర్చారు. ప్రధానంగా 35 సంవత్సరాల లోపు వారంతా ఓటింగ్‌లో పాల్గొనని పరిస్థితులు కనిపించాయి. ఈ వయసు వారంతా ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో ప్రతిపక్ష పార్టీల అంచనాలు తప్పాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే పోలింగ్‌ బూత్‌లలో ఆ సందడి వేరేలా కనబడేదని, కానీ ఓటింగ్‌కు వచ్చిన వారంతా హైదరాబాద్‌ ప్రశాంతతను తిరిగి కోరుకున్నట్టుగానే కనబడిందని విశ్లేషిస్తున్నారు. ఓటింగ్‌లో వృద్ధులు, మహిళలు, బస్తీల వాసులంతా పెద్ద ఎత్తున పాల్గొనడాన్ని చూస్తే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందినట్లుగానే భావించాల్సి వస్తుందని అంటున్నారు. 

ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లతోపాటు ఆరోగ్య శ్రీ లాంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన కుటుంబాలు ఓటింగ్‌లో పాల్గొని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు మొగ్గు చూపాయని పేర్కొంటున్నారు. సుస్థిరమైన పాలనకు పట్టం కట్టారని, అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల మాదిరిగా దూసుకుపోతున్న ప్రభుత్వాన్నే మరోసారి ఓటర్లు దీవించారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు ఎలాంటి చెక్కు చెదరలేదని, ఒంటరిగానే మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


logo