గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Nov 21, 2020 , 07:12:53

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

  • సైబరాబాద్‌ పరిధిలో మూడంచెల భద్రత
  • వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సైబరాబాద్‌ పోలీసులు అన్ని చర్యలూ చేపట్టినట్టు సీపీ సజ్జనార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో బందోబస్తు వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలోగల 38 డివిజన్లలో 13,500 మంది సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రౌడీ షీటర్లు, కమ్యూనల్‌ హిస్టరీ షీటర్స్‌, ఆందోళనకారులపై పటిష్ట నిఘా పెట్టినట్టు చెప్పారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక బృందాలు దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. 38 డివిజన్లలో సమస్యాత్మక, సున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను చేపట్టినట్టు వివరించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై  డయల్‌ 100 లేదా సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 94906 17444 కు సమాచారం అందించాలని సీపీ కోరారు.  ఈ సమావేశంలో శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, డీసీపీ క్రైమ్స్‌ రోహిణీ ప్రియదర్శిని, బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి, మాదాపూర్‌ ఇంచార్జి డీసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

  • మొత్తం పోలింగ్‌ స్టేషన్‌లు -2569  
  • సమస్యాత్మకం 243.. అత్యంత సున్నితమైనవి 770
  • బందోబస్తు కోసం 179 రూట్‌ మొబైల్స్‌  
  • ప్రతి పోలింగ్‌ ప్రాంతానికి ఇద్దరు లొకేషన్‌ ఆఫీసర్లు 
  • కౌంటింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్సుల డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల వద్ద సాయుధ సిబ్బంది గస్తీ
  • 10,500 సివిల్‌ పోలీసు, 3000 సాయుధ సిబ్బందితో బందోబస్త్‌
  • మద్యం, నగదు తరలింపులను అడ్డుకునేందుకు 15 చెక్‌పోస్టులు
  • సోషల్‌ మీడియా పోస్టుల పరిశీలనకు 3 బృందాలు

జోన్లవారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులకు ఆయా జోన్ల బ్యాధతను అప్పగిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలే మిగిలి ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు ప్రచారంలోకి దిగడంతో శాంతి భద్రతల సమస్యలకు తావులేకుండా హైదరాబాద్‌ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అదనపు కమిషనర్లు, జాయింట్‌ కమిషనర్లను ఆయా జోన్లకు ఇంచార్జులుగా నియమించారు.

జోన్‌                           అధికారి పేరు 

ఈస్ట్‌జోన్‌                    శిఖాగోయెల్‌(అదనపు సీపీ)

వెస్ట్‌జోన్‌                     అనిల్‌కుమార్‌(అదనపు సీపీ)

సౌత్‌ జోన్‌                  డీఎస్‌ చౌహాన్‌( అదనపు సీపీ)

సెంట్రల్‌ జోన్‌              డాక్టర్‌ తరుణ్‌జోషి (జాయింట్‌ సీపీ)

నార్త్‌జోన్‌                   అవినాష్‌ మహంతి(జాయింట్‌ సీపీ)