శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Nov 01, 2020 , 06:00:04

బల్దియా ఎన్నికలకు కసరత్తు షురు

బల్దియా ఎన్నికలకు కసరత్తు షురు

  • ప్రక్రియ ముమ్మరం
  • వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాకు వెలువడిన షెడ్యూల్‌ 
  • కొవిడ్‌ నిబంధనల అనుసరణ.. మార్గదర్శకాల విడుదల  
  • గర్భిణులు, వృద్ధులకు నేరుగా ఓటింగ్‌కు అవకాశం 
  • 1000 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం
  • అందుబాటులో హెల్ప్‌డెస్క్‌లు, శానిటైజర్లు 

బల్దియా ఎన్నికలకు  కసరత్తు ముమ్మరమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి శనివారం మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ముగుస్తుండటంతో జనవరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా రూపకల్పనకు షెడ్యూల్‌ వెలువడింది. కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ.. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తుండగా, గర్భిణులు, వృద్ధులకు నేరుగా ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. హెల్ప్‌డెస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు. 

అంబర్‌పేట: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు అంబర్‌పేట సర్కిల్‌ పరిధిలోని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ల్లో మార్పులు, చేర్పులపై దృష్టిని సారించారు. గతంలో ఉన్న కొన్ని పోలింగ్‌ బూత్‌లు ప్రస్తుతం లేకపోవడం, కొన్ని భవనాలు కూలిపోవడం, మరికొన్ని అధ్వాన్నస్థితిలో ఉండడంతో వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంబర్‌పేట సర్కిల్‌ పరిధిలో హిమాయత్‌నగర్‌, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట  ఉన్నా యి. ఈ డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం ఎన్ని పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిని పెంచాలా? తగ్గించాలా? గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడెక్కడ పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు? వంటి అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రతి డివిజన్‌కు రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటుపై దృష్టి సారించారు. 

డివిజన్‌కు 50 నుంచి 60 బూత్‌ల ఏర్పాటు

సర్కిల్‌ పరిధిలో ఉన్న ఆరు డివిజన్లలో ఒక్కో డివిజన్‌లో 50 నుంచి 60 బూత్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పాత  పోలింగ్‌ బూత్‌లు ఎలా ఉన్నాయని పరిశీలిస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో గతంలో 1200 నుంచి 1500 వందల ఓట్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను 800లకు కుదించారు. బ్యాలెట్‌ బాక్సుల ద్వారా ఎన్నికలు జరుగుతుండడంతో పోలింగ్‌ బూత్‌ల సంఖ్య కూ డా పెంచేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. 

డీఆర్‌సీ సెంటర్‌ ఏర్పాటు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి అంబర్‌పేట సర్కిల్‌ అధికారులు ఇప్పటికే డీఆర్‌సీ(డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ రిసెప్షన్‌ ) సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకుగాను ఉస్మానియా యూనివర్శిటీలోని డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను గుర్తించారు. గత 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కూడా ఇక్కడే సెంటర్‌ను నెలకొల్పారు. ఇక్కడ నుంచే అధికారులు పోలింగ్‌ బూత్‌లకు సిబ్బందిని, బ్యాలెట్‌ బాక్సులను తరలించి ఇక్కడే భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు కూ డా ఇక్కడే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

 డివిజన్‌ల రిటర్నింగ్‌ అధికారుల నియామకం 

 చార్మినార్‌, అక్టోబర్‌ 31: ఎన్నికల నిర్వహణలో భాగంగా జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌లోని వివిధ నియోజకవర్గాల్లోని డివిజన్‌లకు ఎన్నికల సంఘం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను ఖరారు చేసింది. గ్రేటర్‌ హైద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ల ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలు పూర్తికావస్తున్న ప్రస్తుత తరుణంలో ఆలోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తిచేయనుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకంగా మారనుంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా డివిజన్‌లలోని ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్లు, స్థానిక శాంతి భద్రతలతోపాటు వివిధ అంశాలను రిటర్నింగ్‌ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల సమన్వయంతో ఎన్నికల నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది. పాతనగరంలోని యాకుత్‌పురా, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌ నియోజకవర్గాల్లోని డివిజన్‌ల వారిగా ఎన్నికల సంఘం రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను కెటాయించారు.సోమవారం నుండి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తూ ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌ తెలిపారు.