గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 03, 2020 , 23:45:17

ఆకలి తీర్చాలనుకుంటున్నారా..

ఆకలి తీర్చాలనుకుంటున్నారా..

ఎవరికి వారే పంపిణీ చేస్తే గుమిగూడుతున్నారు   

ఏదైనా సరే పంపిణీ చేయాలనుకుంటే సంప్రదించండి  :  మేయర్‌ బొంతు రామ్మోహన్‌ 

సిటీబ్యూరో : దాతలు నేరుగా ఆహార పదార్థాలు, బియ్యం పంపిణీ చేయరాదని, జీహెచ్‌ఎంసీ సెంట్రలైజ్డ్‌ సెల్‌కు సమాచారం అందిస్తే అధికారులే ఆ సామాగ్రిని పంపిణీ చేస్తారని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విజ్ఞప్తిచేశారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు,కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహార ప్యాకెట్లు, బియ్యం పంపిణీ చేస్తున్నారని, వారి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పంపిణీ సందర్భంగా ప్రజలు గుమిగూడడంవల్ల లాక్‌డౌన్‌ ఉద్దేశం నీరుగారే అవకాశం ఉందని మేయర్‌ చెప్పారు. ఈ పరిస్థితిని నివారించేందుకు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ ప్రియాంక ఆధ్వర్యంలో ప్రత్యేక సెంట్రలైజ్డ్‌ వింగ్‌ను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. పది మొబైల్‌ వాహనాల ద్వారా దాతలనుంచి ఆహార పదార్థాలు, బియ్యాన్ని సేకరించి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే వాటిని పంపిణీచేస్తామని చెప్పారు. ఎవరికి వారే పంపిణీ చేయడంవల్ల ప్రజలు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా గుమిగూడుతున్నారని పేర్కొన్నారు. దాతలు 9493120244, 7093906449 ఫోన్‌చేయాలని, లేనిపక్షంలో [email protected] PDUCD_ GHMC ట్విట్టర్‌ ఖాతాకు సమాచారం అందించవచ్చని తెలిపారు. బియ్యం, ఆహార సామాగ్రే కాకుండా జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన తాత్కాలిక షెల్టర్‌ హోమ్‌లలో ఉన్న వలస కార్మికులు, నిరాశ్రయులు, అనాథలకు మాస్క్‌లు, ఇతర వస్తువులు పంపిణీచేయాలన్నా ఈ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. 

పేదలకోసం రైస్‌ మిల్లర్స్‌  9 టన్నుల సన్నబియ్యం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పునరావాస కేంద్రాలు, భవన నిర్మాణ కార్మికులు, పోలీస్‌ షెల్టర్‌లలో ఉన్నవారు, కిందిస్థాయి పోలీసు సిబ్బంది తదితరులకు తెలంగాణ రైస్‌ మిల్టర్స్‌ అసోసియేషన్‌ తొమ్మిది టన్నుల సన్న బియ్యాన్ని అందించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతా దృక్పథంతో వలస కార్మికులు, పేదలకు ఉచితంగా 12కిలోల చొప్పున బియ్యాన్ని అందజేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదే క్రమంలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ బియ్యం పంపిణీకి ముందుకు రావడం అభినందనీయమని, ఇతర సంస్థలు, దాతలు కూడా ముందుకొచ్చి తమవంతు సహాయం అందించాలని ఆయన కోరారు.


logo