e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home హైదరాబాద్‌ ఆపరేషన్‌ లంగ్‌స్పేస్‌

ఆపరేషన్‌ లంగ్‌స్పేస్‌

  • లే అవుట్లలోని ఖాళీ స్థలాల పరిరక్షణకు సర్కారు ఆదేశం
  • నగరం చుట్టూ ఉన్న స్థానిక సంస్థల పరిధిలో లెక్కలు తీసిన అధికారులు
  • రంగారెడ్డి జిల్లాలోని 16 కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో 1397 లేఅవుట్లు
  • 746.24 ఎకరాల్లో 1808 చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తింపు
  • ఓపెన్‌ స్పేస్‌ విలువ బహిరంగ మార్కెట్లో రూ.11-15వేల కోట్ల వరకు అంచనా
  • పరిరక్షణకు అన్నిచోట్లా బోర్డులు ఏర్పాటు చేస్తున్న యంత్రాంగం

ప్రాణ వాయివు ఆక్సిజన్‌ పరిమాణం తగ్గితే.. ప్రైవేటుగా ఆక్సిజన్‌ క్లబ్‌లు ఏర్పాటు కావడంతో పాటు ప్రకృతి వరప్రసాదంగా అందాల్సిన ప్రాణ వాయువును కాసులిచ్చి పొందాల్సిన విచిత్ర పరిస్థితులు నెలకొంటాయి. పచ్చదనం కనుమరుగై దేశ రాజధానిలో తరచూ ఇలాంటి పరిస్థితులే తలెత్తడం మనకు తెలిసిందే. అందుకే తెలంగాణలో భవిష్యత్తులోనైనా అలాంటి దుస్థితి రావద్దని సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ఏటా హరితహారాన్ని చేపడుతున్నారు.

హైదరాబాద్‌ మహా నగరంలోనూ హరితహారం కింద ఏడు సంవత్సరాలుగా దాదాపు 12 కోట్లకు పైగా మొక్కలు నాటారు. భావి తరాలకు స్వచ్ఛమైన ప్రాణ వాయువు అందించాలంటే ఇంకా ఇది సరిపోదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం నగరం చుట్టూ ‘ఆపరేషన్‌ లంగ్‌స్పేస్‌’ చేపట్టింది. భారీ ఎత్తున వెలిసిన నివాస యోగ్యాల మధ్య లే అవుట్లలోని ఓపెన్‌ స్పేస్‌ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది.

- Advertisement -

ఇందులో భాగంగా గ్రేటర్‌ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని 16 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ఓపెన్‌ స్పేస్‌ లెక్కల్ని తీసి.. వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు అధికారుల అన్వేషణలో ఏకంగా 746.24 ఎకరాల ఓపెన్‌ స్పేస్‌ ఉన్నట్లుగా వెల్లడైంది. మరి ప్రజా ప్రయోజనాల నిర్మాణాలకు కొంత స్థలం మినహాయించినా ఇంత భారీ విస్తీర్ణంలో మొక్కలు నాటితే ఆ పచ్చని చెట్లు మనకే కాదు! భావి తరాలకు సైతం ప్రాణ వాయువును అందిస్తూ శ్రీరామరక్షగా నిలువడం ఖాయం.

పట్టణీకరణతో నగర శివారుల్లో భూమి విలువ గణనీయంగా పెరిగినందున లేఅవుట్లలోని ఓపెన్‌ స్పేస్‌లే పచ్చదనం పెంపునకు సరైన వేదికలుగా ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో నగరం చుట్టూ ఉన్న స్థానిక సంస్థల్లోని లే అవుట్లలోని ఓపెన్‌ స్పేస్‌ల పరిరక్షణలో భాగంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని బండ్లగూడ జాగీర్‌, బడంగ్‌పేట, మీర్‌పేట, జల్‌పల్లి కార్పొరేషన్లు.. మణికొండ, నార్సింగి, తుర్కయాంజల్‌, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, శంషాబాద్‌, షాద్‌నగర్‌, ఆమనగల్లు, ఆదిబట్ల, తుక్కుగూడ, పెద్ద అంబర్‌పేట, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఓపెన్‌ స్పేస్‌లపై దృష్టి సారించిన అధికారులు ఎట్టకేలకు సమగ్ర వివరాల్ని రూపొందించారు.

16 స్థానిక సంస్థల్లో 1397 లేఅవుట్లు ఉండగా ఇందులో అనుమతి పొందినవి కేవలం 380 మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ఎంతోకొంత ఓపెన్‌స్పేస్‌ వదిలారు. అయితే భూమి విలువ గణనీయంగా పెరగడంతో గతంలో వదిలిన స్థలాలను తిరిగి ప్లాట్లుగా చేయడం, కొందరు ఈ ఓపెన్‌ స్పేస్‌లపై కన్నేసి కబ్జా చేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశానుసారం అప్రమత్తమైన అధికార యంత్రాంగం లే అవుట్లలోని ఓపెన్‌ స్పేస్‌లను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని అందులో బోర్డులు పాతుతున్నది.

ఇలా తాజాగా జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన సమాచారం మేరకు అనుమతి పొందిన, పొందని లేఅవుట్లలో ఏకంగా 1808 చోట్ల ఓపెన్‌ స్పేస్‌లు ఉన్నట్లుగా అధికారిక నివేదికల్లో పొందుపరిచారు. ఒక్కో చోట వంద గజాలు మొదలు రెండు వేల గజాల వరకు ఈ ఓపెన్‌ స్పేస్‌లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం ఏకంగా 746.24 ఎకరాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. శివారు ప్రాంతాల్లో గజం ధర కనీసంగా రూ.30-40 వేలు వేసుకున్నా ఈ భూముల విలువ కనీసంగా రూ.11-15 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

పచ్చదనానికే ప్రాధాన్యం..

లేఅవుట్లలో గుర్తించిన ఈ ఓపెన్‌ స్పేస్‌లను చాలాచోట్ల స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఇప్పటికే పలు నిర్మాణాలు వెలిసినందున న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలుగా తేల్చి అధికారులు కూల్చివేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా ఉన్నందున ఓపెన్‌ స్పేస్‌ల పరిరక్షణకు అధికారులు రంగంలోకి దిగడంతో వందలాది కాలనీలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా ఈ ఖాళీ స్థలాల్లో పచ్చదనం పెంపొందించి, పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక స్థలాలు ఉన్న చోట ఫెన్సింగ్‌, ప్రహరీ నిర్మాణం ద్వారా కబ్జాల నుంచి రక్షించవచ్చని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో హరితహారం కింద మరిన్ని కోట్ల మొక్కలు నాటేందుకు నగరం చుట్టూ వందలాది ఎకరాల భూములు సిద్ధంగా ఉండనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement