e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home హైదరాబాద్‌ శివారు మురుగు.. జలమండలికే

శివారు మురుగు.. జలమండలికే


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో ఇక నుంచి మురుగు నీటి నిర్వహణను జలమండలి చూడనున్నది. ప్రస్తుతం తాగునీటి వ్యవస్థను మాత్రమే బోర్డు నిర్వహిస్తుండగా… మురుగునీటి నిర్వహణ జీహెచ్‌ఎంసీ చూస్తుంది. కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో ఇక నుంచి జలమండలి గ్రేటర్‌ శివారు (జీహెచ్‌ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలు)ల్లో తాగునీటి వ్యవస్థతో పాటు మురుగునీటి వ్యవస్థ నిర్వహణను కూడా చూడనున్నది. పురపాలక శాఖ ఆదేశానుసారం మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమావేశమైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించి, కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి శివారులోని 12 మున్సిపాలిటీలు విలీనం అయ్యాయి.

ఈ క్రమంలో గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 66 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 3,600 కిలోమీటర్ల మేర మురుగునీటి వ్యవస్థ ఉంది. ఇదే పరిధిలో తాగునీటి వ్యవస్థ నిర్వహణకుగాను జలమండలి ఎనిమిది డివిజన్లు, 73 సెక్షన్లు ఏర్పాటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మురుగునీటి వ్యవస్థను జీహెచ్‌ఎంసీ చూస్తుండగా… పురపాలక శాఖ ఆదేశానుసారం వచ్చే నెల ఒకటి నుంచి జలమండలి చేపట్టనుంది. ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌ ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు.

- Advertisement -

రెండు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఒకటో తేదీ నుంచి మురుగు నీటి నిర్వహణ జలమండలి పరిధిలోకి తీసుకురావాలనే కీలక నిర్ణయం జరిగింది. జీహెచ్‌ఎంసీ నుంచి సిబ్బంది, వాహనాలు, ఎయిర్‌టెక్‌ యంత్రాలు, ఇతర సామగ్రి, పరికరాలను జలమండలికి అప్పగించడం, రెండు విభాగాల మధ్య ఉండాల్సిన సమన్వయం, ఫిర్యాదులను పరిష్కరించే విధానం వంటి ప్రధాన అంశాలపై చర్చించారు. సిబ్బంది కొరత, యంత్రాలు, వాహనాల కొరత లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ దానకిషోర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఇంకా సమగ్రమైన వివరాలకు జలమండలి ఆపరేషన్స్‌ డైరెక్టర్‌-2, సీజీఎంలు, జీఎంలు, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, ఎస్‌ఈలతో కలిసి చర్చించాలని సూచించారు. ప్రధానంగా మురుగు నీటి నిర్వహణలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, జలమండలి సీజీఎంలు, జీఎంలు సమన్వయంగా వ్యవహరించాలని ఎండీ తెలిపారు. ప్రతి వార్డు కార్యాలయాల్లో ఫిర్యాదుల నమోదుకు రిజిష్టర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు జలమండలి కస్టమర్‌ కేర్‌ నెంబరు (155313)తో పాటు ప్రత్యేకంగా మరో ఫోన్‌ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ సత్యనారాయణ, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శివారు మురుగునీటి వ్యవస్థ తీరు ఇలా..

గ్రేటర్‌ పరిధిలోని శివారుల్లో ఉన్న డివిజన్లు 66
మురుగునీటి వ్యవస్థ 3600 కిలోమీటర్లు
మ్యాన్‌హోళ్లు 3.26 లక్షలు
అవసరమయ్యే సిబ్బంది దాదాపు 650 మంది
జలమండలికి అప్పగించే యంత్రాలు 24 ఎయిర్‌టెక్‌, 66 మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాలు
జలమండలికి ఇచ్చే నిర్వహణ ఖర్చులు నెలకు రూ.12 కోట్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement