రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షంనీటి కాలువలలో పూడికతీత పనులు మొదలయ్యాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన నాలాలతో పాటు కాలనీలు, బస్తీలలోని అంతర్గత వర్షంనీటి కాలువలన్నింటిలో పూడికతీత పనులను ప్రారంభించారు. పూడికతీత పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ యేడాది పాటు ఆయా ప్రాంతాల్లోని వర్షంనీటి కాలువలలో పూడికను తొలగించాల్సి ఉంటుంది. వర్షాకాలానికి ముందు వేసవి కాలంలోనే పూడికను తీయాలి. తర్వాత వర్షాలు కురిసినప్పుడు ఎక్కడైనా నీటి ప్రవాహానికి ఆటంకాలు కలిగితే ఆ ప్రాంతంలో వెంటనే వ్యర్థాలను తొలగించాలి. చివరగా వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా వర్షంనీటి కాలువలలో చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించే బాధ్యత అతనిపై ఉంటుంది. పకడ్బందీ నిబంధనలతో పూడికతీత పనులు పారదర్శకంగా కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
నాలాపూడికతీత పనులను మనుషులతో పాటు యంత్రాలను ఉపయోగించి చేస్తున్నారు. చెరువునుంచి మరో చెరువుకు వర్షంనీరు వెళ్లే ప్రధాన కాలువలలో యంత్రాలను ఉపయోగిస్తుండగా కాలనీలు, బస్తీలలోని అంతర్గతంగా ఉన్న చిన్న కాలువలలో మనుషుల సహాయంతో పూడికతీత పనులు సాగుతున్నాయి. కాలువల నుంచి తొలగించిన మట్టిని గట్టుపైన వేసిన తర్వాత ఆ మట్టిని, వ్యర్థాలను వాహనాల సహాయంతో నగర శివారు ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. నేటినుంచి డిసెంబర్ వరకు సంబంధిత నాలాలలో ఎప్పుడు వ్యర్థాలు పేరుకపోయినా, నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడ్డా ఆ మట్టిని తొలగించాల్సిన బాధ్యత సదరు కాంట్రాక్టర్పైనే ఉంటుంది. పనులు అసంపూర్తిగా చేసినా… నిబంధనల ప్రకారం వ్యర్థాలను తొలగించకున్నా కాంట్రాక్టర్కు బిల్లు చెల్లింపులు ఆగిపోతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో రూ.575.18 లక్షల వ్యయంతో 107.20 కి.మీ. దూరం వర్షంనీటి కాలువలలో పూడికను తొలగించనున్నారు. కాలనీలు, బస్తీలలోని ప్రధాన కాలువల వెడల్పును దృష్టిలో పెట్టుకుని పెద్ద కాలువలలో యంత్రాలతో, చిన్న కాలువలలో మనుషులతో పూడికతీత పనులు చేస్తున్నారు. కూకట్పల్లి జోన్లోని ఐదు సర్కిళ్లలో 45 పూడికతీత పనులకు గాను 22 మ్యాన్వల్గా, 23 యంత్రాల సహాయంతో పూడికను తీస్తారు. మనుషులతో పూడిక తీసే పనులకు రూ.192.50 లక్షలు కేటాయించగా యంత్రాలతో పూడికను తొలగించే పనులకు రూ.382.68 లక్షల నిధులు మంజూరయ్యాయి. మనుషుల సహాయంతో 50.56 కి.మీ, యంత్రాల సహాయంతో 56.63 కి.మీ. దూరం పూడికను తొలగించనున్నారు. ఇప్పటి వరకు జోన్ పరిధిలో 38.77 కి.మీ. దూరం పూడికతీత పనులు పూర్తయ్యాయి. నెలాఖరులోగా పూడికతీత పనులన్నీ పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
పూడికతీత పనులు నెలరోజుల్లో పూర్తవుతాయి. ప్రధాన నాలాలతో పాటు అంతర్గత కాలనీలలో నాలాలన్నింటినీ గుర్తించి వ్యర్థాలు, మట్టిని తొలగించే పనులు చేస్తున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులలో 40 శాతం పూర్తయ్యాయి. ఆ నాలాలో తిరిగి మట్టి, వ్యర్థాలు చేరి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడితే సదరు కాంట్రాక్టర్ మళ్లీ వాటిని తొలగించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూడికతీత పనులు సాగుతున్నాయి. – వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి