గురువారం 01 అక్టోబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 23:53:59

గణపయ్యా.. మా కష్టాలు తీర్చవయ్యా..

గణపయ్యా.. మా కష్టాలు తీర్చవయ్యా..

అప్పులు చేసి ప్రతిమలు తయారీ

పండుగ సమీపిస్తున్నాకనిపించని బుకింగులు

వినాయక విగ్రహాల కళాకారులపై కరోనా ప్రభావం 

మార్చికి ముందే సిద్ధమైన భారీ గణనాథులు

సొంతూర్లకు వెళ్లిపోయిన కళాకారులు

అమ్మకాలు లేక ఆందోళనలో కార్మికులు

చితికిపోయిన ధూల్‌పేట్‌

రొటీన్‌గా సాగిపోయే నగర జీవితంలో గణపతి నవరాత్రులు ఒక్కసారిగా వేయివోల్టుల ఉత్సాహాన్ని రగిలిస్తాయి. పది రోజుల పాటు వీధివీధినా ఆబాలగోపాలంతో ఆధ్యాత్మిక సందడి చేయిస్తాయి. రంగురంగుల అలంకరణల మండపాలతో, పరవశింపజేసే భక్తి పాటలతో, కిలోమీటర్ల పొడవైన వీడ్కోలు యాత్రలతో యావత్‌ భాగ్యనగరాన్ని ఉర్రూతలూగిస్తాయి. ఇంత పెద్ద ఉత్సవానికి మూలాధారం... భిన్న ఆకృతులతో కొలువుదీరే గణనాథులే. మట్టిని మహాగణపతులుగా మలిచి సంబురాలకు వన్నెలద్దేది మాత్రం వీటిని తయారుచేసే కళాకారులే. ఏడాది పాటు ఇంటిల్లిపాది అహరహం శ్రమిస్తే కానీ వారికి పూట గడవదు. అలాంటి ఆ కార్మికులు ఈ సారి కష్టాల వలయంలో చిక్కుకున్నారు. కరోనా వారిపైనా ముప్పు వల విసిరింది. ప్రతి ఏడాది లాగా ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగే అవకాశం లేకపోవడంతో విగ్రహాల తయారీదారులకు ఈ సారి ఆర్డర్లు రావడం లేదు. లాక్‌డౌన్‌ కంటే ముందుగా తయారుచేసి ఉంచిన విగ్రహాలు కొనేవారూ లేరు.

 దీంతో ముందుగానే అప్పులు చేసి లక్షలు తెచ్చి ప్రతిమలు సిద్ధం చేసిన తయారీ దారుల భవితవ్యం అంధకారంలో పడింది.

ఆబిడ్స్‌/హయత్‌నగర్‌, ఆగస్టు 10: కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వైరస్‌ విజృంభణతో వ్యాధి బారిన పడ్డ కష్టం కంటే ఆర్థికంగా చేసిన నష్టమే ఎక్కువ. వినాయక ఉత్సవాలకు నగరంలో ప్రతి ఏటా కొన్ని వేల సంఖ్యలో ప్రతిమలు అమ్ముడవుతాయి. జిల్లాలకు కూడా అవసరమైన విగ్రహాలు ఇక్కడే తయారవుతాయి. వీటి కోసం ఆరేడు నెలల ముందే అంటే మార్చి నెలలోనే తయారీ ప్రక్రియ మొదలవుతుంది. కరోనా మహమ్మారి విస్తరిస్తుందని తెలియని కళాకారులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక ప్రతిమల పనులను చేపట్టి మార్చి 22 వరకు కొనసాగించారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నగరంలో ధూల్‌పేట్‌, హయత్‌నగర్‌, మియాపూర్‌ వంటి పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో తయారీ దారులు ఉన్నారు. వినాయక చవితి సమీపిస్తుండగానే వివిధ కాలనీ సంఘాలు ముందే ఆర్డర్లు ఇస్తారు. తమకు నచ్చిన రీతిలో వినాయకుల్ని తయారు చేయించుకుంటారు. ఏటా నగరంలో సుమారు లక్షకు పైగా చిన్నా పెద్ద గణపతి మూర్తులు అమ్ముడవుతాయి. కానీ ఈ సారి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. పండుగకు మరో పదిరోజులే ఉన్నప్పటికీ అడ్వాన్సు బుకింగులు లేక షెడ్లు వెలవెలబోతున్నాయి. 

ఖైరతాబాద్‌ వినాయకుడు ఈ సారి తొమ్మిదడుగులే

ఆరు దశాబ్దాల నుంచి ఒక్క అడుగుతో మొదలై 62 అడుగుల ఎత్తు వరకు ఎదిగిన ఖైరతాబాద్‌ వినాయకుడు ఈ సారి 9 అడుగుల ఎత్తులోనే దర్శనం ఇవ్వనున్నాడు. ఈ మహాగణపతికీ కరోనా ప్రభావం తప్పలేదు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా తక్కువ ఎత్తులోనే గణనాథుడిని  ప్రతిష్టించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కరోనా విపత్తును తొలగించే చిహ్నంగా ఈ సారి ధన్వంతరి నారాయణుడిగా దర్శనమివ్వనున్న ఈ గణపయ్యను కోల్‌కతాలోని గంగానది ఒడ్డు నుంచి బంకమట్టిని తీసుకొచ్చి తయారు చేస్తున్నారు. - ఖైరతాబాద్‌

బంగారం కుదువ పెట్టి మెటీరియల్‌ తెచ్చినం 

రాజస్థాన్‌లోని మా సొంతూర్లో ఇంటోళ్ల ఒంటిపై ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి 20 లక్షలు అప్పు తెచ్చినం. విగ్రహాలు తయారుచేసేందుకు మెటీరియల్‌ తీసుకొచ్చినం. పోయిన ఏడాది 30 లక్షల రూపాయలతో 400 పెద్ద విగ్రహాలను తయారుచేసినం. ఈ సారి రూ.20 లక్షలతో 3 నుంచి 4 ఫీట్ల ఎత్తు వరకు 600 విగ్రహలు చేసినం. కరోనా ప్రభావంతో గణపతి విగ్రహాలను ఎవ్వరూ కొంటలేరు. విగ్రహాల తయారీ పైనే ఆధార పడి బతుకుతున్నం. కరోనా మా పొట్టలు కొట్టింది. ఇప్పటికే తయారైన విగ్రహాలు అమ్ముడుపోతే తప్ప మా అప్పులు తీరే పరిస్థితి లేదు. 

-బాటి పింకీ, విగ్రహ తయారీదారురాలు

400 కుటుంబాలు..10వేల విగ్రహాలు

రాజస్థాన్‌కు చెందిన సుమారు 400 కుటుంబాలు 20 ఏండ్ల క్రితం నగరానికి వలస వచ్చాయి. వీరంతా.. ఎల్బీనగర్‌ చౌరస్తా నుంచి విజయవాడ వెళ్లే హైవేపై భాగ్యలతనగర్‌, సూర్య నగర్‌, రేడియో స్టేషన్‌ వద్ద గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే గణేశ్‌ విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. కరోనా లాక్‌డౌన్‌ విధించే సమయానికే (మార్చి 22 నాటికి) సుమారు 50 షెడ్లలో ఇప్పటికే 10 వేల విగ్రహాల(చిన్న పెద్దవి కలిపి)ను తయారుచేసి ఉంచారు.  ఇప్పుడవి అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. భారీ గణనాథుల అమ్మకాలు నిలిచిపోతే కార్మికులు మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. సంవత్సరంలో పది నెలలు విగ్రహాల తయారీలోనే శ్రమించే ఈ కార్మికులకు విగ్రహాల తయారీ ఎత్తు పెద్ద సమస్యగా మారింది. పెద్ద విగ్రహాలు అమ్ముడు పోకపోతే తెచ్చిన అప్పులు ఎలా కట్టాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

భారీగా దెబ్బతిన్న ధూల్‌పేట్‌

వినాయక చవితి అనగానే ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాలలో సందడి కనిపించేది. కళాకారులు తయారు చేసి రకరకాల రూపాల వినాయక ప్రతిమలను చూసేందుకు ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చేవారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, జిల్లాలకు చెందిన వారు ధూల్‌పేట్‌కు చేరుకుని తమకు నచ్చిన ఆకృతులను ఎంచుకునేవారు. నెలరోజుల ముందే ఆర్డరిచ్చి వారం ముందే విగ్రహాలను తమ మండపాలకు తరలించేవారు. ఏటా ధూల్‌పేట్‌లో కనీసం లక్ష చిన్నా పెద్ద విగ్రహాల విక్రయం జరిగేది. లాక్‌డౌన్‌తో ధూల్‌పేట్‌ ప్రాంతంలో వినాయక ప్రతిమల తయారీకి సహాయంగా ఉండే కళాకారులు తమ సొంత గ్రామాలకు వెళ్లి పోయారు. ధూల్‌పేట్‌ ప్రాంతంలో దాదాపు 200 షెడ్డుల నిర్వహణ జరుగుతూ ఉండేది. బీహార్‌, మహారాష్ట్రకు చెందిన కళాకారులే ఎక్కువగా పనిలో నిమగ్నమవుతారు. లాక్‌డౌన్‌తో పనులు లేక అందరూ సొంతూర్లకు వెళ్లి పోవడంతో కళాకారులు తమ కుటుంబ సభ్యుల సహకారంతో వినాయక ప్రతిమలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

భారీగా నష్టపోతున్నాం

కరోనాతో భారీగా నష్ట పోతున్నాం. గత నాలుగు నెలలుగా వినాయక ప్రతిమల తయారీ నిలిచి పోయింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మూడు వందలకు పైగా వినాయక ప్రతిమలను తయారు చేసేందుకు సాంచలు చేశాం. ప్రతిమలను తయారు చేశాం. కరోనా మహమ్మారి రావడంతో తయారు చేసిన విగ్రహాలను అలాగే వదిలేయడంతో నష్టాల పాలయ్యాం. దాదాపు 2 కోట్లకు పైగా ముడి సరుకు, విగ్రహాల తయారీకి కార్మికులకు చెల్లించాం. పనులు లేక కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లి పోయారు. ఏమీ చేయలేని స్థితిలో ఉండి పోయాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం.

-సుందర్‌ కళాకార్‌, ప్రముఖ కళాకారుడు

మూడడుగుల ప్రతిమలు చేస్తున్నాం

వినాయక చవితి పండుగ వస్తుందంటే చాలు. మా షెడ్డులో కళాకారులు, కార్మికులతో వందలాది విగ్రహాలను తయారు చేసేవాళ్లం. పది అడుగుల కంటే ఎైత్తెన వినాయకులను వందకు పైగా తయారు చేసి విక్రయించే వాళ్లం. ఈ ఏడాది కరోనా దెబ్బకు సందిగ్ధంలో పడి కేవలం మూడడుగుల వినాయక ప్రతిమలను మాత్రమే తయారు చేస్తున్నాం. కేవలం 50 ప్రతిమలను మాత్రమే తయారు చేయగలిగాం. లాక్‌డౌన్‌కు ముందు తయారు చేసిన వినాయక ప్రతిమలు కూడా అలాగే ఉండిపోయాయి. ఎవరూ కొనుక్కోవడం లేదు.        -కైలాశ్‌ సింగ్‌ హజారీ, కళాకారుడు.

20 లక్షలు అప్పు తెచ్చినం

సొంతూరు నుంచి 20 లక్షల రూపాయలు తెచ్చినం. పొద్దున రాత్రి కష్టపడ్డం. ఇంటిల్లిపాది కలిసి విగ్రహాలు తయారుచేసినం. ఇప్పుడు మేం ఉంటున్న షెడ్డుకు సాలుకు 4 లక్షలు కట్టాలె. పోయిన ఏడాది 400 విగ్రహాలు చేసినం. కానీ ఈసారి 225 మాత్రమే చేయగలిగినం. ఇప్పటివరకు ఒక్క అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా రాలేదు. ఇప్పుడొక్కటి కూడా అమ్ముడుపోకపోతే ఈ విగ్రహాలను ఏం చేయాల్నో అర్థమైత లేదు. అప్పులెట్ల తీరుతయో తెలుస్తలేదు. 

-బాబులాల్‌, విగ్రహ తయారీదారుడు

38 లక్షలు పెట్టి 600 విగ్రహాలు చేసిన 

విగ్రహాలు తయారు చేయడమే మాకు బతుకుదెరువు. విగ్రహాల తయారీకి ఈ సంవత్సరం 38 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టివన. 600 మూర్తులను తయారు చేసిన. అప్పులు తెచ్చి చేసినం. ఈ విగ్రహాలు అమ్ముడు పోకపోతే మా బతుకు చీకటైతది. పండుగకు పదిరోజులే మిగిలి ఉంది. ఇప్పటికి ఒక్కరు కూడా కొనుక్కుపోవడానికి రాలేదు. ప్రభుత్వం మాకేమైనా సాయం చేస్తే బాగుండు

-రూప్‌సింగ్‌ సోలంకి, విగ్రహ తయారీదారుడు

8 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను అనుమతించాలె

విగ్రహాల అమ్మకాల్లో 8 అడుగుల ఎత్త వరకు అనుమతిస్తే కార్మికులకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది. ఇప్పటికే తయారైన విగ్రహాలను నగరాల నుంచి పట్టణాలకు తరలించి అమ్ముకుంటే కొంచమైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చు. హయత్‌నగర్‌లో వినాయక విగ్రహ తయారీ దారుల కష్టాలు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ దృష్టికి తీసుకెళ్తా. అప్పులు తెచ్చి విగ్రహాలు తయారు చేసిన కార్మికులను ప్రభుత్వం ఏదో ఒక మార్గంలో ఆదుకునే ప్రయత్నం చేయాలి. 

-సామ తిరుమలరెడ్డి, కార్పొరేటర్‌

ఈ సారి సాదాసీదాగానే ఉత్సవాలు

కరోనా లాక్‌డౌన్‌తో మార్కెట్‌ డౌనైంది. దాంతో ఈ సారి పెద్ద పెద్ద మండపాలు ఉండవు. అలంకరణలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. పోయిన ఏడాదంత గొప్పగ చేయలేం. మూడు నాలుగు ఫీట్ల వినాయకుడిని కొనుక్కొని పూజలు నిర్వహించి ఆడంబరం లేకుండా పూజలు చేద్దామనుకుంటున్నాం. వినాయకులకు పూజల పేరుతో జనం ఒక దగ్గర్నే జమైతే కష్టమైతది. 

- శేఖర్‌ పెద్ది, కొనుగోలుదారుడు- ఎన్జీఓస్‌ కాలనీ


logo