సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:46:39

నేటి నుంచి కోహెడకు పండ్ల మార్కెట్‌

నేటి నుంచి కోహెడకు పండ్ల మార్కెట్‌

తరలించేందుకు సర్వం సిద్ధం చేశామంటున్న అధికారులు

ససేమిరా అంటున్న వ్యాపారులు

నేటి నుంచి గడ్డి అన్నారం మార్కెట్‌ బంద్‌

 ఎల్బీనగర్‌ : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ సోమవారం నుంచి మరోసారి బంద్‌ కానుంది. కరోనా నేపథ్యంలో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో వ్యాపార లావాదేవీలను పూర్తిగా బంద్‌ చేసి.. కోహెడలో నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ యార్డుకు తరలించేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు.  ఏప్రిల్‌ చివరి వారంలో వచ్చిన మామిడి సీజన్‌ సమయంలోనే మార్కెట్‌ను కోహెడకు  తాత్కాలికంగా తరలించారు. అప్పట్లో వచ్చిన గాలీ వాన.. బీభత్సంతో షెడ్లు కూలిపోయి పలువురు గాయాలకు గురి కావడంతో పాటుగా ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటన తర్వాత గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లోనే వ్యాపారాలు నిర్వహించారు. తాజాగా మరోమారు కోహెడకు మార్కెట్‌ మార్చేందుకు రెడీ అయ్యారు. గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా షెడ్ల నిర్మాణం చేసి వ్యాపారానికి సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. వ్యాపారులు మాత్రం..  గత అనుభవం నేపథ్యంలో కోహెడ మార్కెట్‌లో శాశ్వతంగా అన్ని సౌకర్యాలుఏర్పాటు చేస్తేనే వెళుతామని.. లేకుంటే వ్యాపారాలు ఆపేస్తామంటూ తేల్చి చెబుతున్నారు.

మరో మారు తాత్కాలిక షెడ్లతో..

 మే నెలలో గాలివానకు షెడ్లు పడిపోయిన ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు.. తాజాగా మరోమారు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. సుమారు రూ. 1.50 కోట్ల వ్యయంతో.. ఒక లక్ష 8వేల ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఏబీసీలుగా మూడు బిడ్డింగ్‌ షెడ్లను ఏర్పాటు చేశారు. నాలుగు టాయిలెట్‌ బ్లాక్‌లతో పాటుగా వాటర్‌ ప్లాంట్‌, ఫైర్‌ స్టేషన్‌, వే బ్రిడ్జి, విద్యుత్‌ ఏర్పాట్లు, జనరేటర్‌, సర్వీస్‌ రోడ్డు వరకు ప్రధాన రోడ్డు, లైట్లు ఏర్పాటు చేశారు. తాజాగా ఆర్‌కే ఏజెన్సీ వారితో అద్దెపై తాత్కాలిక షెడ్లు నిర్మించారు. ప్రస్తుతం మూడు షెడ్లలో ఒక్కో దాంట్లో మోసంబీ, అనార్‌, ఆపిల్‌ వ్యాపారాలను నిర్వహిస్తారని, బొప్పాయ తదితర ఇతర పండ్ల లావాదేవీలు ఓపెన్‌ స్థలంలో చేస్తారన్నారు.

కోహెడలోని 178 ఎకరాల్లో మార్కెట్‌..

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డుతో ట్రాఫిక్‌ చిక్కులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాగానే గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డును కోహెడకు తరలించాలన్న సంకల్పంతో ముందడుగు వేశారు. గడ్డిఅన్నారంలో ఎదురవుతున్న పరిస్థితులు.. కరోనా నేపథ్యంలో  కోహెడలో తాత్కాలిక షెడ్లను నిర్మించి అందులోకి మార్చారు. మొత్తం 178 ఎకరాల మార్కెట్‌ స్థలంలో నుంచి.. 30 ఎకరాలను రూ. మూడు కోట్లతో చదును చేసి మార్కెట్‌ కోసం అభివృద్ధి చేసి.. ఏప్రిల్‌ 27న పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో మే 4వ తేదీన భారీగా వీచిన గాలి వానకు కోహెడ మార్కెట్‌లో వేసిన షెడ్లు నేలమట్టమై..  పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధికారులు.. వెంటనే మార్కెట్‌ యార్డును తిరిగి గడ్డిఅన్నారానికి తరలించి వ్యాపార లావాదేవీలు కొనసాగించారు. కాగా కరోనా నేపథ్యంలో మార్కెట్‌ యార్డులో భౌతికదూరం పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని పలుమార్లు ఫిర్యాదులు రావడంతో కొన్ని రోజులు మార్కెట్‌ను పూర్తిగా బంద్‌చేశారు. రైతున్నల శ్రేయస్సు దృష్ట్యా మరలా గడ్డిఅన్నారం మార్కెట్‌లో వ్యాపారాలు ప్రారంభించారు. 

గడ్డిఅన్నారం మార్కెట్‌ చరిత్ర..

 నగరంలోని మోజంజాహి మార్కెట్‌ నుంచి 1986లో పండ్ల మార్కెట్‌ను గడ్డిఅన్నారం ప్రాంతానికి తరలించారు. ఇక్కడ 22 ఎకరాల స్థలంలో ఏటైపు 51, బీ టైపు 29, సీ టైపు 17, డీ టైపు 41 షాపులను నిర్మాణం చేసి కేటాయించారు. అనంతరం మరో 77 షాపులను కూడా బిడ్డింగ్‌ యార్డులపై నిర్మించి కేటాయించారు. మార్కెట్‌ యార్డులో మొత్తం 345 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. సీజన్‌ సమయంలో మార్కెట్‌ యార్డుకు నిత్యం 20 వేల మంది వరకు వస్తుంటారు. అన్‌ సీజన్‌లో 5 వేల మంది వరకు వ్యాపారులు లావాదేవీల్లో పాల్గొంటారు. 2019-20 సంవత్సరంలో గడ్డిఅన్నారం మార్కెట్‌ ఆదాయం రూ. 11. 35 కోట్లు ఉండగా, కరోనా నేపథ్యంలో తాజా ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌లో కేవలం రూ. 3 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ యార్డుల్లో ఒకటైన గడ్డిఅన్నారంలో అన్ని రకాల పండ్లతో పాటుగా దేశ, విదేశాలకు చెందిన పండ్లు కూడా ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. 

నేటి నుంచి కోహెడలోనే..

 గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో పండ్ల వ్యాపార లావాదేవీలు ఆదివారం సాయంత్రం నుంచి బంద్‌ చేస్తున్నామని, సోమవారం నుంచి కోహెడలోనే వ్యాపారాలు చేయాలంటూ మార్కెటింగ్‌ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసి.. బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. కోహెడ ప్రాంతంలో మార్కెట్‌ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. తాజాగా గడ్డిఅన్నారం మార్కెట్‌ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పోలీసుల సహకారాన్ని కూడా మార్కెటింగ్‌ శాఖ అధికారులు తీసుకుంటున్నారు. ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ ఎస్‌జీఎస్‌ వెంకటేశం, కోహెడ మార్కెట్‌ ఇన్‌చార్జి నర్సింహారెడ్డి, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

కోహెడ మార్కెట్‌కు వెళ్లేది లేదు 

22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గడ్డిఅన్నారం నుంచి.. కేవలం 5 ఎకరాల్లో తాత్కాలికంగా వేసిన షెడ్లలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా వ్యాపారాలు ఎలా చేస్తామంటూ వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. సౌకర్యాలు లేని కోహెడ పండ్ల మార్కెట్‌కు తాము వెళ్లేది లేదంటూ పండ్ల మార్కెట్‌ కమీషన్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ జేఏసీ ప్రతినిధులు క్రాంతిరెడ్డి, జిన్నం వెంకటేశ్వర్లు, అశోక్‌కుమార్‌, అఫ్సర్‌, జ్ఞానేశ్వర్‌ తదితరులు పేర్కొంటున్నారు. కరోనాతో అతలాకుతలం అయిన తమ వ్యాపారాలు.. మార్కెట్‌ అటూ ఇటూ  తరలింపుతో మరింత ఇబ్బందులు పడుతున్నామన్నారు. కోహెడలో పూర్తిస్థాయి సౌకర్యాలు ఉంటే తప్ప.. తాము కోహెడ వెళ్లేది లేదని పేర్కొన్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి సమస్యలు విన్నవించామని వారు తెలిపారు.


logo