బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Aug 22, 2020 , 00:05:37

పదేండ్లుగా లైంగిక దాడులు

పదేండ్లుగా లైంగిక దాడులు

139 మందిపై..వంద పేజీలతో ఫిర్యాదు చేసిన బాధితురాలు

కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు

సిటీబ్యూరో/ఖైరతాబాద్‌, నమస్తే తెలంగాణ: తనపై పలువురు 10 ఏండ్లుగా లైంగికదాడికి పాల్పడటంతో పాటు బెదిరింపులు, కులం పేరుతో దూషించడం, హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారంటూ ఓ యువతి శుక్రవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులపై లైంగికదాడి, బెదిరింపులు, కులం పేరుతో దూషణలు తదితర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పదేండ్లుగా  తనను వేధిస్తున్నారని, ఇదే నా మరణ వాంగ్మూలం కావచ్చని, పూర్తి వివరాలు ఒక ఫౌండేషన్‌కు అందించానంటూ బాధితురాలు 139 మందిపై ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. బాధితురా లు వంద పేజీలతో ఫిర్యాదు చేయడం.. వారిపై  పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేయడం  దేశంలోనే మొదటిదై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

    పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి  వివరాల ప్రకారం... సోమాజిగూడ రాజ్‌భవన్‌ రోడ్‌లోని అమృతవల్లి అపార్టుమెంట్స్‌లో నివాసం ఉండే యువతి (25)ది నల్గొండ జిల్లా , మిర్యాలగూడ, వేములపల్లి మండలం, శెట్టిపాలెం గ్రామం. 2009 జూన్‌ 12న మిర్యాలగూడ హౌజింగ్‌ బోర్డు ప్రాంతానికి చెందిన కొండ్‌రెడ్డి రమేశ్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగిన మూడు నెలలకే భర్త బంధువులు  శారీరకంగా, మానసికంగా వేధించడంతో 2010లో భర్తతో తెగతెంపులు చేసుకుంది. అనంతరం చదువు కోసం ఓ కళాశాలలో చేరానని, అప్పుడు  ఓ విద్యార్థి సంఘం నాయకులు, వారి అనుచరులు, స్నేహితులు అత్యంత కిరాతకంగా ప్రవర్తించి లైంగిక దాడులకు పాల్పడటం, బెదిరింపులు, కులం పేరుతో దూషణలు చేశారని ఆరోపించింది. వారంతా తనపై చాలా సార్లు లైంగిక దాడి చేసి హింసించారని ఆరోపించింది. అనంతరం పలువురు డ్రగ్స్‌, గంజాయి, మద్యం, వయాగ్రా మందులు వేసుకొని లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొంది. వేలాది సార్లు నగ్న, లైంగిక దాడి వీడియోలు, ఫొటోలు చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసింది.  కత్తులు, తుపాకులతో బెదిరించి మరీ పైశాచికత్వానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులో తెలిపింది. ఎవరికైనా చెబితే పెట్రోల్‌, యాసిడ్‌ పోసి చంపుతామని బెదిరింపులకు దిగారని, తన చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా లాక్కొన్నారంటూ ఆరోపించింది. నా ఫేస్‌బుక్‌, ఈమెయిల్‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారని,  కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారని వివరించింది. తనపై లైంగిక దాడి చేసిన వారు.. చాలా  మంది మహిళలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపించింది. తనకు సోమాజిగూడలోని గాడ్‌పవర్‌ ఫౌండేషన్‌ సహాయం చేసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా.. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పదేండ్ల తరువాత ఫిర్యాదు చేయడంలో మతలబు ఏంటీ? అనే విషయంలో ఆరా తీస్తున్నారు, అయితే నిందితులు బెదిరింపులకు దిగడంతోనే తాను ఫిర్యాదు ఇవ్వలేకపోయానంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు బాధితురాలిని పంజాగుట్ట పోలీసులు భరోసా కేంద్రానికి తరలించి, ఆమె వద్ద నుంచి పూర్తి వివరాలు సేకరిస్తూ ఆమెకు భరోసా తరపున కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు.