వాళ్లంతా చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్న అభాగ్యులు. అడుగడుగునా అవమానాలు, అవహేళనలు. వారి వికృత రూపం అంటే సమాజంలో చిన్నచూపు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని దుస్థితి వాళ్లది. రెక్కాడితేగాని డొక్కాడని వారి జీవితాల్లో పండు వెన్నెలను పంచుతూ ఈశ్వర్ చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆశాదీపంగా మారింది.కాలిన గాయాలు, గ్రహణ మొర్రికి ప్రేమతో ఉచిత సేవలు చేస్తూ.. చందమామ లాంటి రూపునిస్తూ వారిలో ఆత్మైస్థెర్యం కల్పించి సమాజంలో సగర్వంగా జీవించేలా చేస్తున్నది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : కాలిన గాయాలు.. గ్రహణ మొర్రి సమస్యలతో నిత్యం సతమతమవుతున్న బాధితులకు మేము న్నామంటూ ఈశ్వర్ చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆశాదీపంగా నిలిచింది. ఎటూ పాలుపోని జీవితాల్లో వెలుగులునింపుతూ పేదలకు వైద్యు సేవలందిస్తూ.. తన సేవా తత్పరతను కొనసాగిస్తున్నది. పైసా ఖర్చులేకుండా శస్త్రచికిత్సలను నిర్వహించి బాధితుల జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నది.
కాగా మంగళవారం ట్రస్ట ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేశారు. వైద్యులు రోగులకు పలు విలువైన సలహాలు, సూచనలు చేశారు. 23 ఏండ్లుగా ప్రతిఏటా 10 రోజులు ఉచిత మెగా శస్త్రచికిత్స మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఈశ్వర్ చంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ విద్యాభూషణ్ వివరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, సేవా భారతి, బీఎస్ఎంఎస్ ట్రస్టు, మెర్సీ మిషన్ సంయుక్తాధ్వర్యంలో గతనెల 23 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 10 రోజుల పాటు మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంపు నిర్వహించారు.
పాత మల్లేపల్లి డివిజన్ సీతారాంబాగ్‌లోని ఈశ్వర్‌చంద్ర చారిటబుల్ ట్రస్ట్ దవాఖాన ఆధ్వర్యంలోలో 38 మందికి పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందుకు దేశంలోని పలుప్రాంతాలతో పాటు నేపాల్, ఏపీ, తదితర రాష్ర్టాల నుంచి కూడా రోగులు రావడం విశేషం. క్యాంపులో గ్రహణ మొర్రి, గొంతు అతుక్కొని పోయిన, చేతి వేళ్లు అతుక్కుపోయినా, శరీర భాగాలలో కాలిన గాయాలు అయిన వారికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించి మంచి జీవితాన్ని అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గులాబ్‌రాణి, విద్యాభూషణ్, లక్ష్మీకుమారి, సేవా భారతి సభ్యులు రాంమూర్తి, బీఎస్ఎంఎస్ ట్రస్టు సభ్యులు నిహారితోపాటు పలువురు పాల్గొన్నారు.
ఆత్మైస్థెర్యం కోల్పోకూడదనే..
ప్రజలకు వివిధ రకాల సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో నిరుద్యోగ యువతకు పోలీసు శాఖలో ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రీ రిక్రూట్మెంట్ శిక్షణను ఉచితంగా అందజేశాం. లయన్స్ క్లబ్, గ్రీన్ ల్యాండ్స్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకున్నది. లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించుకోలేని పేదలకు ఇలాంటి క్యాంపులు వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతాయి.
జీవితాంతం ఇట్లనే ఉంటదనుకున్నా..
జీవితాంతం తన సమస్య ఇట్లనే ఉంటదనుకున్నా. పెద్దసార్లు ఎంతో ఓపికతో పైసా ఖర్చులేకుండా ఆపరేషన్ పూర్తిచేశారు. నేపాల్ నుంచి ఇక్కడికి కొన్నేండ్ల క్రితం నగరానికి పొట్టచేతబట్టుకొని బతకడానికి వచ్చాం. తనకున్న సమస్యపై ఏంచేయాలో మాకు తోచలేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. డాక్టర్లకు కృతజ్ఞతలు.
– లక్ష్మి, నేపాల్
డాక్టర్ల రుణం తీర్చుకోలేనిది..
శరీరమంతా కాలిన గాయాలతో అందవికారంగా ఉండేది. బయటి దవాఖానల్లో ఈ వైద్యానికి లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉచితంగానే సార్లు శస్త్రచికిత్స ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఇప్పుడు ఎంతో నయంగా ఉంది. డాక్టర్లు నాకు పునర్జన్మనిచ్చిన దేవుండ్ల లెక్కనే కొలుస్త. ఏమిచ్చినా డాక్టర్ల రుణం తీర్చుకోలేను. చేతులెత్తి దండం పెడుతున్న. సుదర్శన్‌రెడ్డి, భవానిప్రసాద్లు చికిత్స చేశారు.
– లక్ష్మణచారి, హైదరాబాద్
పేదలకు సేవ చేయడంలోనే ఆనందం
పేదలకు సేవ చేయడంలోనే ఆనందం ఉంది. సమాజ సేవ చేయలానే సంకల్పంతోనే పలు కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రతిమనిషి తన జీవితంలో ఎంతోకొంత ఇతరులకు సాయం చేయాల్సిన సందర్భం వస్తుంది. రావాలి కూడా. పేదల సంతోషాన్ని పట్టించుకుంటేనే సమాజం బాగుంటుంది.
– డాక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్లాస్టిక్ సర్జన్