శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 00:43:19

ఆన్‌లైన్‌లో ఉచిత సంగీత శిక్షణ

ఆన్‌లైన్‌లో ఉచిత సంగీత శిక్షణ

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండే పరిస్థితి ఏర్పడడంతో సంగీతం అంటే మక్కువ ఉన్న వారికి రామంతాపూర్‌లోని హృదయ భారతి సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ మక్కపాటి మంగళ ఆన్‌లైన్‌ సంగీతంలో ఉచిత శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘పాడాలని ఉందా’ అనే కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా నిర్వహిస్తుంది. దీనికి మనదేశ ప్రజల నుంచి కాకుండా, విదేశాల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నట్లు ఆమె తెలిపారు. సంగీత స్వరాలతో రాగయుక్తంగా ఏ పాటనైనా పాడే విధంగా నిష్ణాతులైన సంగీత గురువులతో శిక్షణ ఇస్తున్నారు. 

ఇందులో దేశభక్తి, కీర్తనలు, పెళ్లి పాటలు, లలిత గీతాలు నేర్చుకుంటున్నారు. అమెరికా, దుబాయి, కెనడా, మలేషియా తో పాటు ఇతర దేశాలకు చెందిన 150 మంది శిక్షణ తీసుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో సంగీత శిక్షణ, పాటలు నేర్చుకునే మంచి అవకాశం కల్పించడం అభినందనీయమని  శిక్షణ తీసుకునే పలు దేశాల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య మసన చెన్నప్ప,  బుర్రా వెంకటేశం డాక్టర్‌ పద్మజ వంటి వారు మంగళను ఫోన్‌ ద్వారా అభినందించారు.

ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన

లాక్‌డౌన్‌ సమయంలో సంగీత ప్రియుల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఈ కార్యక్రమానికి దేశ,విదేశాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇవే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులతో బొమ్మలు, ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు, యోగా, ఆనందానికి మంచి సంస్కారాలు తదితర కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రముఖ కర్నాటక సంగీత విధ్వాంసురాలు రమాప్రభ సహకారంతో ఈ శిక్షణా కార్యక్రామాలు నిర్వహిస్తున్నాం. -డాక్టర్‌ మక్కపాటి మంగళ


logo