ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు

- అల్ట్రా సౌండ్ నుంచి సిటి స్కాన్ వరకు
- రిపోర్టులు సైతం ఆన్లైన్లో..
- పేదలకు తప్పనున్న ‘ప్రైవేటు’ భారం
- ఎనిమిది డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించిన మంత్రులు
ఎక్స్‌రే, ఈసీజీ, సిటి స్కాన్, అల్ట్రాసౌండ్ ఒక్కటేమిటి మొత్తం 108 పరీక్షలు పూర్తి ఉచితంగానే.. రిపోర్టులు సైతం ఆన్లైన్లోనే.. ఇలా ‘ప్రైవేటు’కు దీటుగా ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. శ్రీరాంనగర్, లాలాపేట, సీతాఫల్మండి, అంబర్‌పేట, బార్కాస్, పానిపురా, పురానాపూల్, జంగంమ్మెట్లో మొత్తం ఎనిమిది చోట్ల ఈ మినీహబ్లను మంత్రులు కేటీఆర్, ఈటల, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు. బస్తీ దవాఖానలతో వైద్యాన్ని ముంగిట్లోకి తెచ్చిన ప్రభుత్వం.. ఖరీదైన టెస్టులనూ ఇప్పుడు చేరువ చేసింది.
ప్రజారోగ్యాన్ని కాపాడటంలో బస్తీ దవాఖానలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సమీపంలోనే పేద ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పుడు ఖరీదైన టెస్టులూ అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటులో వ్యాధి నిర్ధారణ పరీక్షలు భారంగా మారడంతో ప్రభుత్వమే డయాగ్నోస్టిక్ సెంటర్లను
ఏర్పాటు చేసింది. 108 టెస్టులను ఉచితంగా అందించే ఎనిమిది మినీ హబ్‌లను శుక్రవారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు,మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. పేదలకు ప్రభుత్వం అండగాఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు.
10 నుంచి 15 ఆరోగ్య కేంద్రాలకు..
గత పాలనలో నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షే. ఖరీదైన చికిత్స కోసం అప్పుల పాలు కావడం, ఆస్తులు అమ్ముకోవడం వంటి దుస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో పేదలకు ఆరోగ్య భరోసా దొరికింది. దశల వారీగా వైద్యరంగాన్ని కొత్త పుంతలు తొక్కించిందీ తెలంగాణ సర్కారు. ‘ఆరోగ్యమే మహా భాగ్యం’....ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమనే సీఎం కేసీఆర్ సంకల్పంతో నేడు మహానగరంలో ప్రజల వద్దకే వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. బస్తీ దవాఖానలు పేదలకు సంజీవనిగా మారాయి. స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతుండటంతో ఉస్మానియా, గాంధీ వంటి పెద్ద దవాఖానల వద్ద నిరీక్షణ తప్పింది. ఇప్పుడు 10 నుంచి 15 ఆరోగ్య కేంద్రాలకు ఒకటి చొప్పున నగర వ్యాప్తంగా ఎనిమిది డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటయ్యాయి.
పేదలకు అండగా ఉంటాం.. మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ ):పట్టణ పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ శ్రీరాంనగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవల్లోదేశానికే ఆదర్శం: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
గోల్నాక, జనవరి 22: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా నిరుపేదలకు ఖరీదైన నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ.. రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబర్‌పేట మున్సిపల్ దవాఖానలో డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరు పేదలకు ఉత్తమ వైద్యసేవలను అందించడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. ఆయన ఆలోచనలు అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పులిజగన్, నూతన కార్పొరేటర్ విజయ్‌కుమార్, తహసీల్దార్ వేణుగోపాల్, డీఎంసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బార్కోడ్ ద్వారా..
యూపీహెచ్‌సీలు, బస్తీదవాఖానలు, ఇతర ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానల్లో రోగులకు అవసరమైన వైద్యపరీక్షలను అక్కడి వైద్యులు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్‌కు రిఫర్ చేస్తే.. ప్రిస్కిప్షప్పై బార్కోడ్ వేస్తారు. రోగులు ఆ ప్రిస్కిప్షన్ తీసుకుని సంబంధిత డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెల్లగానే అక్కడి సెంటర్ మేనేజర్ ఆ బార్‌కోడ్‌ను స్కాన్ చేయగానే.. వెంటనే వారికి రోగికి సంబంధించిన వివరాలు కంప్యూటర్లోకి వచ్చేస్తాయి. దీంతో వారికి వైద్యులు సూచించిన పరీక్షలు నిర్వహించి రిపోర్టులను ఆన్లైన్ ద్వారా రిఫర్ చేసిన ఆరోగ్య కేంద్రానికి పంపుతారు. దీని వల్ల రోగులు రిపోర్టుల కోసం తిరగాల్సిన పనిలేదు.
సికింద్రాబాద్, జనవరి 22: నగరవ్యాప్తంగా 319 బస్తీ దవాఖానలు దశల వారీగా ఏర్పాటు చేశామని, దీనికితోడు ఏకంగా 108 వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా అందించేందుకు మినీ హబ్‌లను ప్రారంభించినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగంమ్మెట్, సీతాఫల్‌మండిలోని కుట్టి వెల్లోడి దవాఖాన ప్రాంగణంలో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమ, తీగుళ్ల రామేశ్వర్‌గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు.
తప్పనున్న ఆర్థిక భారం..
నగరంలో అందుబాటులోకి వచ్చిన ఎనిమిది డయాగ్నోస్టిటిక్ సెంటర్లతో ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ కావడంతో పాటు ముఖ్యంగా ఆర్థిక భారం తగ్గనుంది. 108రకాల వైద్యపరీక్షలు ఈ మినీ హబ్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులు ముందుగా మెడికల్ టెస్టులు రాస్తారు. వైద్య ఖర్చుల్లో సింహభాగం పరీక్షలకే పోతుంది. టెస్టులు చేస్తేగాని రోగమేంటో తెలియదు. అందుకని పరీక్షలు తప్పనిసరి. ప్రైవేటులో చేయించుకోవాలంటే పేదలకు మోయలేని భారం. దీనిని దృష్టిలో పెట్టుకుని సర్కారు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
గర్భిణులకు ప్రాధాన్యం..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్కానింగ్ అందుబాటులోకి వచ్చింది. గర్భిణులకు ప్రస్తుతం ప్రతి బుధవారం స్కానింగ్ చేస్తాం. వెంటనే రిపోర్టులు అందజేస్తున్నాం. తొలి రోజు 16 మంది గర్భిణులకు స్కానింగ్ నిర్వహించాం.- డాక్టర్ మాధవి, రేడియాలజిస్ట్, అంబర్‌పేట
జాప్యం లేకుండా వెనువెంటనే చికిత్సలు: హోం మంత్రి మహమూద్ అలీ
చార్మినార్/కార్వాన్, జనవరి 22 : పేదలకు మెరుగైన చికిత్స అందించేందుకు స్థానికంగానే బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెచ్చిందని, డయాగోస్టిక్ సెంటర్ల ద్వారా జాప్యం లేకుండా వెనువెంటనే చికిత్సలు అందించే వీలు కలుగుతుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పేదల సంక్షేమానికి నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారన్నారు. పురానాపూల్, బార్కస్, కార్వాన్‌లోని పానిపూరా ప్రభుత్వ వైద్యశాలల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల చెంతకే కార్పొరేట్ వైద్యాన్ని అందించేందకు ప్రాంతీయ వైద్యశాలల్లో ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. బార్కస్ ప్రాంతీయ వైద్యశాలకు ఎమ్మెల్సీ నిధుల నుంచి మార్చిలో అంబులెన్స్‌ను అందించనున్నామని వెల్లడించారు. ఆస్పత్రి అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సూపరింటెండెంట్ నిసార్, ఎస్పీహెచ్వో జ్యోతి, వైద్యాధికారి డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్ సమీనా, డాక్టర్ సంతోష్, రేడియాలజిస్ట్ డాక్టర్ మాధవి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికీ కార్పొరేట్ వైద్యం
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 22: రాష్ట్రంలో పేదలందరికీ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని సర్కారు ముందుకు సాగుతున్నదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బస్తీ దవాఖానలతో వైద్యాన్ని బస్తీ వాసుల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం పెద్దాసుపత్రులకే పరిమితమైన వైద్య పరీక్షలను ప్రజలకు మినీ హబ్‌లతో మరింత చేరువ చేశాయని చెప్పారు. లాలాపేటలోని యూపీ
హెచ్సీలో డయాగోస్టిక్ సెంటర్‌ను ఈటల రాజేందర్ ప్రారంభించారు. నగరంలో ఎనిమిది మినీ హబ్‌లను ప్రారంభించామని, మరో ఎనిమిదింటిని త్వరలోనే సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆన్లైన్లో రిపోర్టులను సైతం అందిస్తారన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎనిమిది అధునాతన ఆపరేషన్ థియేటర్లతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు సైతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవీందర్‌గౌడ్, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
స్కానింగ్ కోసం ప్రైవేటులో ప్రతి సారి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మాలాంటి పేదోళ్లకు ఇది భారమే. సర్కారు డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచితంగానే స్కానింగ్ చేసి వెంటనే రిపోర్టు కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటా. -హాసిని, గర్భిణి, అంబర్‌పేట
తాజావార్తలు
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్‌రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’