పారిస్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. రోలాండ్ గారోస్‌లో జొకో ప్రిక్వార్టర్స్‌కు చేరడం వరుసగా ఇది 12వ సారి కావడం విశేషం. గతంలో 2005 నుంచి 2015 మధ్య నాదల్, ఫెదరర్ వరుసగా 11 సార్లు ప్రిక్వార్టర్స్‌కు చేరారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జొకోవిచ్ 6-1, 6-4, 6-1తో రికార్డస్ బెరాంకిస్ (లిత్వేనియా)ను చిత్తు చేశాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్‌కు బెరాంకిస్ కనీస పోటీనివ్వలేకపోయాడు. ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి.. ఫెదరర్, నాదల్ (20)కు చేరువైన జొకో 19వ టైటిల్ వేటలో వడివడిగా అడుగులు వేస్తున్నాడు. గంటా 32 నిమిషాల్లో ముగిసిన పోరులో 5 ఏస్‌లు కొట్టిన జొకో.. 30 విన్నర్లు సంధించాడు. మరోవైపు 36 అనవసర తప్పిదాలు చేసిన బెరాంకిస్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో 19 ఏండ్ల లొరెన్జో ముసెట్టి (ఇటలీ)తో జొకో తలపడనున్నాడు.
పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో హాట్ ఫేవరెట్ రఫేల్ నాదల్ (స్పెయిన్) సునాయాసంగా గెలుపొందాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కామెరాన్ నోరీతో జరిగిన పోరులో నాదల్ 6-3,6-3, 6-3తో నెగ్గాడు. రెండు గంటల 7 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 3 ఏస్‌లు, 35 విన్నర్స్ సంధించిన నాదల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో జానిక్ సిన్నెర్ (ఇటలీ)తో నాదల్ తలపడనున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిన్నెర్ 6-1, 7-5, 6-3తో ఇమెర్ (స్వీడన్)పై గెలుపొందాడు. రెండోసీడ్ మెద్వెదెవ్, ఐదో సీడ్ సిట్సిపాస్, జ్వెరెవ్, నిషికోరి, స్వార్ట్మన్ కూడా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు.
సోఫియా కెనిన్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శనివారం మూడో రౌండ్లో అమెరికాకే చెందిన పెగులాతో పోరులో కెనిన్ 4-6, 6-1, 6-4తో గెలిచింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7-6 (7/4)తో ఆనెట్ కాంటవీట్ (ఎస్తోనియా)పై నెగ్గగా.. మార్టా కొస్ట్యుక్ (ఉక్రెయిన్) 6-1, 6-2తో వార్వరా గ్రాచెవా (రష్యా)పై గెలిచింది.