బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 24, 2020 , 02:00:26

కేబీసీ తగిలిందని.. రూ.94 వేలు టోకరా

కేబీసీ తగిలిందని.. రూ.94 వేలు టోకరా

హైదరాబాద్ : కేబీసీ లాటరీ తగిలిందంటూ సెల్‌ఫోన్‌కు వచ్చిన మేసేజ్‌ చూసిన ఓ వ్యక్తి సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి రూ.94 వేలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన తలాబ్‌కట్టలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తలాబ్‌కట్టకు చెందిన మహబూబ్‌ ఫోన్‌కు ఓ మేసేజ్‌ వచ్చింది. రూ.25 లక్షల విలువైన కేబీసీ లాటరీ తగిలిందని ఈ కింది నంబర్లకు ఫోన్‌ చేయండంటూ ఎస్‌ఎంఎస్‌ రాగా ఆయన స్పందించాడు. ఫోన్‌ చేయగానే శుభాకాంక్షలు చెబుతూ.. కేబీసీ(కౌన్‌ బనేగా కరోడ్‌పతి) టీమ్‌తో మాట్లాడుతారా అంటూ ఒకరిద్దరితో మాట్లాడించారు. ఆ తరువాత పాకిస్తాన్‌ కోడ్‌తో వచ్చిన ఫోన్‌ నంబర్లతో మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు వచ్చిన లాటరీ డబ్బు తీసుకోవాలంటే ఇన్‌ కం ట్యాక్స్‌, జీఎస్టీ, ప్రాసెసింగ్‌ ఛార్జీలంటూ చెబుతూ దఫదఫాలుగా రూ.94 వేలు వసూలు చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గుర్తించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 గోల్కొండకు చెందిన అబ్దుల్‌ భారీకి పే పాయింట్‌ ఇండియా నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేశారు. సీఎస్‌పీ(కస్టమర్‌ సర్వీస్‌ పోర్టల్‌)లో సభ్యత్వం ఇస్తామంటూ నమ్మించారు. జన్‌ధన్‌ ఖాతాలో డబ్బు పడ్డ వారు తమ బయోమెట్రిక్‌ ద్వారా సీఎస్‌పీల నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశముంది. ఇక్కడ ఖాతాదారుల చేతిముద్రల ఆధారంగా ఖాతాను తెరిచి ఆ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వడంతో ఈ సెంటర్‌ నిర్వాహకుడికి కొంత కమీషన్‌ వస్తుంది. అలాంటి ఖాతా ఒకటి ఇస్తామంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు రిజిస్ట్రేషన్‌ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ రూ.65 వేలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. అనంతరం సీఎస్‌పీకి సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పంపించారు. సీఎస్‌పీ వెబ్‌సైట్లకు వెళ్లి సైబర్‌ నేరగాళ్లు పంపిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను తనిఖీ చేయగా నకిలీవని తేలడంతో బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo