సోమవారం 26 అక్టోబర్ 2020
Hyderabad - Jun 10, 2020 , 02:04:38

ఉద్యోగం కోసం యత్నించి.. మోసపోయిన యువతి

 ఉద్యోగం కోసం యత్నించి..  మోసపోయిన యువతి

హైదరాబాద్‌ : ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని తన బయోడేటాను నౌకరి.కామ్‌లో అప్‌లోడ్‌ చేసి.. సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి.. రూ.1.17లక్షలను పోగొట్టుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని... లాక్‌డౌన్‌కు ముందు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా తన బయోడేటాను నౌకరి.కామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. అయితే డబ్బులు చెల్లిస్తే.. ఎక్కువగా అవకాశాలు ఉండడంతో..   రూ.5 వేలు చెల్లించింది. ఆమె బయోడేటాను గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు (సైబర్‌ నేరగాళ్లు )..  నౌకరి.కామ్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ ఆ విద్యార్థినికి ఫోన్‌ చేశారు..

లాక్‌డౌన్‌, కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు మీకు సరైన ఉద్యోగం చూపెట్టలేకపోతున్నాం.. మీరు చెల్లించిన రూ.5వేలను తిరిగి చెల్లిస్తాం.. కరోనా తగ్గిన తర్వాత మంచి ఉద్యో గం ఇప్పిస్తామని నమ్మించారు.  మీ బ్యాంకు ఖాతా నంబర్‌, డెబిట్‌ కార్డు వివరాలు చెబితే డబ్బులు పంపిస్తామని చెప్పి.. ఆ వివరాలు ఫోన్‌లోనే తీసుకున్నారు.  మాట్లాడుతుండగానే ఆమెకు ఓటీపీలు రాగా.. ఆ  నంబర్లు కూడా చెప్పేసింది. వెంటనే ఆమె ఖాతా నుంచి ఐదుసార్లు రూ. 1.17 లక్షలను బదిలీ చేసుకున్నారు. దీంతో  బాధిత యువతి మంగళవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

   అలాగే.. మరో ఘటనలో ఓఎల్‌ఎక్స్‌లో వాహనాల ప్రకటనలు చూసి... కొనేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను సైబర్‌నేరగాళ్లు మోసం చేసి..  రూ. 1.5 లక్షలు కాజేశారు.  


logo