బుధవారం 21 అక్టోబర్ 2020
Hyderabad - Jun 21, 2020 , 23:56:12

రుణాలు ఇప్పిస్తామంటూ మోసం

రుణాలు ఇప్పిస్తామంటూ మోసం

  • ప్రాసెసింగ్‌ ఫీజుల పేరిట రూ.1.44 కోట్లు వసూలు
  • బాధితుల ఫిర్యాదు... సీసీఎస్‌లో కేసు నమోదు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వ్యాపారాలకు సంబంధించి  రూ.77 కోట్ల రుణాలిప్పిస్తామంటూ నమ్మించి... ప్రాసెసింగ్‌ ఫీజుల పేరిట ఓ ముఠా రూ. 1.44 కోట్లు మోసం చేసిందంటూ ఓ బిజినెస్‌ కన్సల్టెంట్‌ సంస్థ ప్రతినిధి సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల వివరాల  ప్రకారం... హబ్సిగూడలో నివాసముండే పవన్‌కిశోర్‌ కేఎన్‌డీయూజెడ్‌ బిజినెస్‌ కన్సల్టెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే.. తన కస్టమర్లు అయిన కొందరు వ్యాపారులు.. వ్యాపార విస్తరణకు సంబంధించి రుణాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌కిశోర్‌కు బషీర్‌బాగ్‌లో కోహినూర్‌ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ అండ్‌ లీజ్‌ కార్ప్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సలీం గఫర్‌ షేక్‌ తెలిసిన వారి ద్వారా 2018లో పరిచయం అయ్యాడు.  అనంతరం వ్యాపారాలు, రుణాల గురించి చర్చించుకుంటుండగా... తమ కంపెనీలో రాజ్‌విందర్‌ మెహ్ర, శ్యాం సుందర్‌ అగర్వాల్‌ అలియాస్‌ జిందల్‌లు పెట్టుబడులు పెట్టారని వారిని పవన్‌కిశోర్‌కు పరిచయం చేశాడు.  రుణాల విషయం చర్చించుకున్న తరువాత  రూ. 77 కోట్ల రుణాలు ఇప్పిస్తామని సలీమ్‌, అతని పెట్టుబడుదారులు చెప్పారు.

 ఈ రుణాన్ని మంజూరు చేయాలంటే ప్రాసెసింగ్‌ ఫీజులు, లీగల్‌ ఫీజులు, ఇతర ఖర్చులు ఉంటాయని, దానికి సంబంధించిన మొత్తాన్ని ముందే ఇవ్వాలంటూ సలీం కోరాడు. దీనికి ఏడుగురు బాధితులు అంగీకరించి... ఒక్కొక్కరు వారు తీసుకునే రుణాలను బట్టి ఆయా ఫీజుల నిమిత్తం రూ. 1.44 కోట్లు సలీమ్‌ గ్యాంగ్‌ కు చెల్లించారు. ఆ తరువాత సలీమ్‌ గ్యాంగ్‌ తిరిగి ఫోన్లు చేయడం, కార్యాలయానికి పిలిపించి ఇంకా ప్రాసెసింగ్‌తో పాటు ప్రయాణాలు, బోర్డింగ్‌, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం డబ్బులు కావాలంటూ ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. ఒప్పందం మేరకు డబ్బులు ఇచ్చినా... నిర్ణీత సమయం లో రుణాలు మంజూరు కాకపోవడంతో పాటు ఇంకా డబ్బు అడుగుతుండటంతో బాధితులకు అనుమానం వచ్చింది. వెంటనే అసలు సలీమ్‌ గ్యాంగ్‌ రుణాలిప్పిస్తుందా? లేదా? అనే విషయంపై ఆరా తీశారు. ఇందులో భాగంగా సలీం, రాజ్‌విందర్‌, శ్యాంసుందర్‌ అగర్వాల్‌ ముఠా... ఇలా చాలా మందిని మోసం చేసిందని తెలుసుకున్నారు. దీంతో వ్యాపారుల తరపున బిజినెస్‌ కన్సల్టెంట్‌ పవన్‌ కిశోర్‌ నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సలీమ్‌ గ్యాంగ్‌ గతంలో ఎక్కడెక్కడ మోసాలు చేసిందనే విషయంపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.


logo