శనివారం 23 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 06:17:53

ట్రేడింగ్‌ పేరుతో మోసం

ట్రేడింగ్‌ పేరుతో మోసం

  • 10 శాతం వడ్డీ ఆశచూపి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు టోకరా.. ఇద్దరు అరెస్ట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టండి.. 10 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మించి..టోకరా వేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆర్థిక సలహాదారుడిని, అతడికి సహకరించిన మరో మహిళను  సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కథనం ప్రకారం.. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఫైనాన్స్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్న కౌసిక్‌ బెనర్జీ ట్రేడింగ్‌ వ్యాపారం చేసేవాడు.

రెండేండ్ల క్రితం అదే సంస్థలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వాళ్లకు తెలిసినవారికి.. తాను చేసే ట్రేడింగ్‌ వ్యాపారంలో పెట్టుబడి పెడితే.. అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపాడు.  దీనికి రేఖజాదవ్‌ అనే మహళ సహకారం అందించింది. దీంతో పలువురు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారు. మొదట్లో అందరికి ఇచ్చిన హామీ మేరకు 10 శాతం వడ్డీ ఇస్తూ వెళ్లాడు. ఇతడిపై నమ్మకం కుదరడంతో మరికొంత మంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ట్రేడింగ్‌లో నష్టాలు వస్తున్నా, వచ్చే పెట్టుబడుల్లో నుంచి వడ్డీలు చెల్లిస్తూ వెళ్లాడు. 

సుమారు 850 మంది నుంచి రూ. 34 కోట్ల వరకు వసూలు చేసి, అందులో కొంతమందికి తిరిగి డబ్బు చెల్లించాడు. మరికొంత మందికి ఇవ్వకుండానే హైదరాబాద్‌ వదిలి పరారయ్యాడు. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో మిగతా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పుణేలో బెనర్జీతో పాటు రేఖజాదవ్‌ను ఉన్నట్లు గుర్తించి మూడు రోజుల క్రితం వారిని అరెస్ట్‌ చేసి.. నగరానికి తీసుకొచ్చారు. విచారణలో పుణేలో కూడా ఇదే పద్ధతిలో ట్రేడింగ్‌ చేసేందుకు అధిక వడ్డీల ఆశ చూపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, ఆ తరువాత కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని ఏసీపీ వివరించారు.


logo