ఆదివారం 25 అక్టోబర్ 2020
Hyderabad - Sep 12, 2020 , 04:11:27

ఉద్యోగాల పేరుతో దోచేశారు..

ఉద్యోగాల పేరుతో దోచేశారు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వేర్వేరు ఘటనల్లో ఐదుగురికి సైబర్‌నేరగాళ్లు టోకరా వేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, ఏటీఎం కార్డు బ్లాక్‌ అవుతుందని, కేవైసీ అప్‌డేట్‌ పేరుతో పలువురిని బురిడీ కొట్టించి... మొత్తం రూ.5.76లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..  

సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు నౌకరి.కామ్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాడు. అయితే.. కొన్ని రోజుల తరువాత తాము నౌకరి.కామ్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించిన గుర్తు తెలియని వ్యక్తులు (సైబర్‌నేరగాళ్లు) ఫోన్‌ చేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగం ఇప్పించలేకపోతున్నాం, మీ డబ్బు వాపస్‌ కావాలంటే.. మీ బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే డిపాజిట్‌ చేస్తామని నమ్మించారు. ఇలా.. నౌకరి.కామ్‌ పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను బాధితుడికి పంపించి, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని, అందులో నుంచి రూ. 96 వేలు కాజేశారు. 

తలాబ్‌కట్టకు చెందిన ఖదీర్‌ క్వికర్‌లో జాబ్‌ ప్రకటన చూసి.. అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. తనతో పాటు మరికొందరికి ఉద్యోగం కావాలని చెప్పాడు. అవతలి నుంచి ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు రిజిస్ట్రేషన్‌, స్రాసెసింగ్‌ ఫీజులంటూ రూ. 2 లక్షలు వసూలు చేసి, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. 

పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ యూసుఫ్‌గూడకు చెందిన ముస్తాబాఖాన్‌ అనే వ్యక్తి వద్ద నుంచి లక్ష రూపాయలు కాజేశారు. 

అంబర్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తికి తాము ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామని, మీ కార్డు బాక్ల్‌ అవుతుందంటూ అతని కార్డు వివరాలు తీసుకొని... అతడి ఖాతా నుంచి రూ. 80 వేలు దోచేశారు. 

టోలీచౌక్‌కు చెందిన సలీముద్దీన్‌ అనే వ్యక్తికి చెందిన ఏటీఎం కార్డును గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీలోని ఏటీఎం కేంద్రంలో ఉపయోగించి లక్ష రూపాయలు డ్రా చేశారు. ఆయా ఘటనలపై బాధితులు శుక్రవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


logo