బంజారాహిల్స్, జూలై 3: క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్స్ వచ్చాయంటూ నమ్మించి రూ.60 వేల మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని మిథిలానగర్‌లో నివాసం ఉంటున్న ఓ యువతి కాల్రెన్ కేర్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ట్రైనీగా పని చేస్తున్నది. గత నెల 28న ఆమెకు కిషన్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ైస్లెస్ క్రెడిట్ కార్డ్ బెంగళూరు హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ గెలుచుకున్నారంటూ ప్రవళ్లికను నమ్మించాడు.
రివార్డు పాయింట్లను మార్చుకునేందుకు ఒక ఓటీపీ నెంబర్‌ను పంపిస్తామని, ఓటీపీ వచ్చిన తర్వాత తమకు చెప్పాలంటూ సూచించాడు. ఓటీపీ చెప్పగానే ఆమె క్రెడిట్ కార్డులో నుంచి రూ.60వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా తమకు అతడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ మేరకు బాధితురాలు శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలానగర్, జూన్ 3: సైబర్ నేరస్తుడి చేతిలో ఓ ఇంటి యజమాని మోసపోయాడు. ఇంట్లో అద్దెకుంటానని చెప్పి లక్ష రూపాయలు కొట్టేసిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ సాయినగర్‌లో నివాసముండే గన్ను తిరుపతయ్య గుప్తా తన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి WWW. NO BROKER .COMలో ప్రకటన ఇచ్చాడు. ఇది గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి 82602557024 నంబర్ ద్వారా ఫోన్ చేసి ఇంటిని అద్దెకు తీసుకుంటానన్నాడు. ఇందుకు గాను నెలకు రూ.15 వేల చొప్పున మూడు నెలలు రూ.45 వేలు అడ్డాన్స్ చెల్లించాలని తిరుపతయ్య అతడికి సూచించాడు. వెంటనే సైబర్ నేరస్తుడు గూగుల్ పే నంబర్ ఇస్తే నగదు పంపిస్తానని తెలిపాడు.
ఇది నమ్మిన తిరుపతయ్య గూగుల్ నంబర్‌తో పాటు అకౌంట్ వివరాలు పంపాడు. ‘మీ అకౌంట్లోకి నగదు రావడం లేదు.. మీరు రూ.45 వేలు ఎంటర్ చేయండి.. దానిని చూసి మీకు నగదు పంపుతానని సూచించగా’ ఇది నమ్మిన తిరుపతయ్య రూ. 45 వేలు ఎంటర్ చేయగా వెంటనే డెబిట్ అయ్యాయి. వెంటనే తన ఖాతా నుంచి నగదు పోయిందని తిరుపతయ్య సైబర్ నేరస్తుడికి తెలుపగా ‘అవునా అలా జరిగిందా.. నాకు రాలేదు.. మరోసారి పంపమని’ చెప్పాడు. ఇలా పలు దఫాలుగా లక్ష రూపాయలు డెబిట్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గుర్తించిన తిరుపతయ్య బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.