మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 13, 2020 , 07:06:08

మౌలాలి-ఘట్‌కేసర్‌ మధ్య నాలుగు లైన్ల ట్రాక్‌ సిద్ధం

మౌలాలి-ఘట్‌కేసర్‌ మధ్య నాలుగు లైన్ల ట్రాక్‌ సిద్ధం

హైదరాబాద్  : దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటి సారిగా నాలుగు లైన్ల రైల్వేట్రాక్‌ను రాకపోకలకు సిద్ధం చేశారు. మౌలాలి-ఘట్‌కేసర్‌ మధ్య 12.2 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు ట్రాక్‌లతో సిద్ధం చేశారు. ఈ మార్గంలో ఆపరేషన్స్‌కు సంబంధించిన తనిఖీలు చేసి అనుమతులివ్వడంతో గురువారం రాకపోకలకు అవకాశం కలిగింది. మౌలాలి-ఘట్‌కేసర్‌కు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న డబుల్‌లైన్‌కు అదనంగా నూతనంగా నిర్మించిన పొడవుగల డబుల్‌లైన్‌ విద్యుదీకరణ, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థతోపాటు నిర్మాణం పూర్తయి రైళ్లను నడుపడానికి సిద్ధమైంది. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌2లో భాగమైన నాలుగు వరుసల రైలు మార్గం నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చుపెట్టి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అత్యంత చవకైన రవాణా సంస్థగా పేరు పొందిన మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు ఫేజ్‌-2 భాగమైన నాలుగు వరుసల రైలు మార్గాన్ని పూర్తిస్థాయి ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థతోపాటు విద్యుదీకరణ పనులను పూర్తిచేసి రైళ్లు నడుపడానికి సిద్ధం చేశారు. నగరంలో ఎంఎంటీఎస్‌ ప్రతీరోజు 121 రైళ్ల సర్వీసులతో జంటనగరాలలో ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌-హైదరాబాద్‌-లింగంపల్లి-రాంచంద్రాపురం మధ్య దక్షిణమధ్య రైల్వే సేవలందిస్తున్నది.


విస్తరణలో భాగంగా అభివృద్ధి

 నగర రవాణా వ్యవస్థ విస్తరణలో భాగంగా 84 కిలోమీటర్ల  ఎంఎంటీఎస్‌ ఫేజ్‌2ను అభివృద్ధి పరిచారు. దీని  పరిధిలో ఇప్పటివరకు చాలా అభివృద్ధి పనులు చేపట్టారు. రైలు వికాస్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ ఎల్‌) ఆధ్వర్యంలో దశలవారీగా చాలా పనులు చేపట్టారు. తెల్లాపూర్‌-రామచంద్రాపురం కొత్త రైల్వేలైనుతోపాటు బొల్లారం-మేడ్చల్‌ మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ పూర్తి చేశారు. గూడ్స్‌ రైళ్లతో అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్‌, కాజీపేట్‌, నడికుడి(గుంటూరు), సనత్‌నగర్‌(బైపాస్‌ కార్డ్‌లైన్‌)లను అనుసంధానిస్తుంది. ఈ సెక్షన్‌లో రద్దీని తగ్గించేందుకు, సబర్బన్‌ రైళ్లను నిర్వహించడానికి 2 లైన్ల మార్గాన్ని 4 లైన్ల మార్గంగా మార్చారు. మొత్తం 4 లైన్ల మార్గాన్ని మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ కోసం మరో రెండు లైన్ల మార్గాన్ని ఘట్‌కేసర్‌ నుంచి మౌలాలికి  రైలు సర్వీసులను ఒకే సమయంలో నడుపడానికి ఉపయోగపడుతాయి. ఆటోమేటిక్‌ విధానం అందుబాటులోకి రావడం వల్ల అంతకుముందు కంటే అధిక సంఖ్యలో రైళ్లను నిర్వహించడానికి దోహదం చేస్తున్నది.  దీనికోసం చర్లపల్లి స్టేషన్లలో  రెండు, ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్లలో రెండు అదనపు ప్లాట్‌ఫారాలను నిర్మించడం  జరిగింది. అంతేగాకుండా మౌలాలి సీక్యాబిన్‌, చర్లపల్లి, ఘట్‌కేసర్‌ స్టేషన్ల వద్ద నూతనంగా స్టేషన్‌ భవనాలను కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్టు జంటనగరాల తూర్పు ప్రాంతం నుంచి హైటెక్‌సిటీ-లింగంపల్లి, పటాన్‌చెరువు, ఫలక్‌నుమా వంటి ఇతర ప్రదేశాలకు చేరుకోవడానికి వీలవుతుంది. నాలుగు లైన్ల  రైలు మార్గాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య  రైలు వికాస్‌ నిగం లిమిటెడ్‌ను అభినందించారు.


ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2లో చేపట్టిన పనులు 

*   నగరం పడమటి వైపున తెల్లాపూర్‌-రామచంద్రాపురం మధ్య నూతన రైలు మార్గం నిర్మాణం

*   నగరం ఉత్తరం వైపున బొల్లారం, మేడ్చల్‌ మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ

*   ప్రస్తుతం ఘట్‌కేసర్‌-మౌలాలి మధ్య అందుబాటులో ఉన్న డబుల్‌లైనుకు అదనంగా నూతనంగా ఉన్న మరో రెండు లైన్ల మార్గం విద్యుదీకరణ, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ పూర్తి చేయడం.

*   నగరం తూర్పు , పడమరలను అనుసంధానిస్తూ సికింద్రాబాద్‌ బైపాస్‌ స్టేషన్‌గా 

*   మౌలాలి-సనత్‌నగర్‌ మధ్య 5 స్టేషన్లతో డబ్లింగ్‌, విద్యుదీకరణ

*   నగరం దక్షిణం వైపు ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ. 


logo
>>>>>>