ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 24, 2021 , 04:44:04

మృత్యు శకటాలు

మృత్యు శకటాలు

  • అదుపుతప్పి సెల్లార్‌ గుంతలోకి కంటైనర్‌
  • తప్పించుకున్న పలువురు కార్మికులు.. మరో ఇద్దరు దాని కింద
  • ఒకరు అక్కడికక్కడే మృతి.. మరొకరు దవాఖానలో.. 

కుత్బుల్లాపూర్‌, ఫిబ్రవరి 23 : భారీ వాహనాల అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతివేగానికి అమాయకులు బలవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడంలేదు. ఫలితంగా జరుగుతున్న ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఆదివారం రాత్రి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న దంపతులు టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి బలైయిన ఘటన మరువకముందే.. మంగళవారం మరో ఘటన చోటుచేసుకున్నది.. సెల్లార్‌ గుంతలో పనిచేస్తున్న కార్మికులపై కంటైనర్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు దవాఖానలో మృతి చెందాడు.  ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ రమేశ్‌, స్థానికుల వివరాల ప్రకారం...కొంపల్లిలోని ఎన్‌హెచ్‌-44 రహదారికి పక్కన ఫైర్‌ఫీల్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో నిర్మాణాలు జరుగుతున్నాయి. లోతైన సెల్లార్‌ గుంతలో సుమారు 15 మంది కార్మికులు భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నిర్మాణానికి కావాల్సిన ఇనుప చువ్వల లోడ్‌తో కంటైనర్‌ లారీ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్తున్న ది. ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి గుంతలో పనిచేస్తున్న కార్మికులపై పడిపోయింది. గమనించిన కొందరు కార్మికులు తప్పించుకోగా.. మరో ఇద్దరు దాని కింద చిక్కుకున్నారు. ఒడిశాకు చెందిన ఉపేందర్‌(21) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కార్మికుడు మనోహర్‌ చికిత్స పొందుతూ దవాఖానలో మృతి చెందాడు..  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని   దర్యాప్తు చేస్తున్నారు.

ముందే చెప్పినా పట్టించుకోలేదు..

బహుళ అంతస్తుల భవన నిర్మాణదారులు కార్మికులకు కావాల్సిన కనీస భద్రత చర్యలను తీసుకోకపోవడం మూలంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. లోతైన గుంతలో పనులు నడుస్తుండగా.. దానికి ఆనుకొని ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని, కంటైనర్‌ లారీ లోడుతో ఒకేసారి లోనికి రావడం, డ్రైవర్‌ అదుపు చేసేందుకు ప్రయత్నించినా విఫలమైంది. దీంతో డ్రైవర్‌ ఒకేసారి కిందకు దూకడంతో.. లారీ అమాంతం కార్మికులు పని చేస్తున్న గుంతలో పడిపోయింది. కనీస భద్రత చర్యలు లేకుండా నిర్వాహకులు తమతో పని చేయించుకుంటున్నారని, ప్రమాదం జరుగుతుందని.. తాము ముందే చెప్పినప్పటికీ వినకుండా పనులు చేయించుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిప్పర్‌ బీభత్సం

అబ్దుల్లాపూర్‌మెట్‌, ఫిబ్రవరి 23: నగర శివారులో ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకువచ్చి ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం, పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన ఎండీ మహమ్మద్‌(60), బద్దుల జంగయ్య(50)లు టీవీఎస్‌ ఎక్సెల్‌ (ఏపీ 29బీఏ1039)పై పిల్లాయిపల్లి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వైపునకు పని మాట్లాడుకునేందుకు  వస్తున్నారు. బండరావిరాలలోని ఉదయ్‌ క్రషర్‌ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. వెనక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్‌ వారిని ఢీకొట్టింది. దాంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న మృతుల గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. రోడ్డుపై టెంట్‌ వేసుకొని బైఠాయించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సీఐ స్వామి సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకొని ఆందోళనను విరమింపజేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎంపీపీ బుర్ర రేఖమహేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ దాస్‌గౌడ్‌, సర్పంచ్‌ కవాడి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ  అనితామహేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

VIDEOS

logo