గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 08:34:04

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్యకేసులో నలుగురు అరెస్ట్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్యకేసులో నలుగురు అరెస్ట్‌

 వెంగళరావునగర్‌ : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో ఎస్సార్‌ నగర్‌ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఈ నెల 11వ తేదీన అమీర్‌పేట ధరంకరం రోడ్డులో కేశన చంద్రశేఖర్‌ రాజు హత్యకు గురైన విషయం విదితమే. ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం..  గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన చంద్రశేఖర్‌రాజు నగరంలోని క్యాబ్సిన్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. ఇతడికి మచిలీపట్నంకు చెందిన లక్ష్మీగౌరి (22)తో 2019 ఫిబ్రవరి 23వ తేదీన వివాహం జరిగింది. వీరు నగరంలోని ఆల్విన్‌కాలనీలో నివాసం ఉండేవారు. కాగా .. లక్ష్మీగౌరి ఈ సంవత్సరం జూన్‌ 1న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. ఈ కేసులో భర్త చంద్రశేఖర్‌రాజుతో పాటు అతడి తల్లిదండ్రులపై జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన చంద్రశేఖర్‌రాజు బెయిల్‌పై విడుదలై అమీర్‌పేట ధరంకరం రోడ్డులో నివాసం ఉండే మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌రాజు ఈ నెల 11న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు మృతుడి భార్య లక్ష్మీగౌరి బంధువులుగా అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన అపార్టుమెంట్‌ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో హంతకుల దృశ్యాలు నమోదయ్యాయి. వీటి ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. లక్ష్మీగౌరి సమీప బంధువులైన మొత్తం 12 మందిని నిందితులుగా తేల్చారు. ఈ క్రమంలో మచిలీపట్నంలో ఉన్న నిందితులు ఉప్పల శ్రీనివాసరావు (34),ఉప్పల రమేశ్‌(53), నవీన్‌, రత్నయ్యలను అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా 8 మంది నిందితులను పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.