బుధవారం 23 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 09, 2020 , 23:11:44

కరోనాతో మాజీ ఐఏఎస్‌ కన్నుమూత

కరోనాతో మాజీ ఐఏఎస్‌ కన్నుమూత

బంజారాహిల్స్‌: మాజీ ఐఏఎస్‌, గిరిజన అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్‌ దేవర సుబ్బారావు (80) కరోనా బారిన పడి కన్నుమూశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఆయన కొన్ని రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో మెడికవర్‌ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు నిర్వహించిన దేవర సుబ్బారావు దళిత, బహుజనులకు అండగా నిలబడ్డారు. వారి సంక్షేమానికి పలు పథకాలు రూపొందించి అమలు చేయడంలో విశేష కృషి చేశారు. దేవర సుబ్బారావుకు ముగ్గురు కుమారులున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేవర సుబ్బారావు మృతిపై పలువురు ఐఏఎస్‌ అధికారులు సంతాపం ప్రకటించారు. 

  నేరేడ్‌మెట్‌లో ఒకరు..  

నేరేడ్‌మెట్‌: నేరేడ్‌మెట్‌ ఓల్డ్‌ సఫిల్‌గూడ దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన (71) ఓ  వ్యక్తి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆగస్టు 3న అతడికి తీవ్ర జ్వరం రావడంతో గాంధీకి తరలించారు. దీంతో వైద్యులు పరీక్షలు జరిపి పాజిటివ్‌గా నిర్ధారించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. 

 ఆగని కరోనా కేసులు.. 

-బషీర్‌బాగ్‌: ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, బైబిల్‌హౌస్‌ యూపీహెచ్‌సీల పరిధిలో మొత్తం 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 10 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు యూపీహెచ్‌సీ వైద్యాధికారి కృష్ణమోహన్‌రావు ఆదివారం తెలిపారు. వీరందరిని హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు. 

- కాప్రా: కాప్రా సర్కిల్‌ పరిధిలోని నాచారం డివిజన్‌లో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్కిల్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 447కు చేరింది. ఇందులో 340 మంది డిశ్చార్జి కాగా, 8 మంది మృతిచెందారు. ప్రస్తుతం 99 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ మైత్రేయి తెలిపారు.

నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

అహ్మద్‌నగర్‌: నగరంలో కేంద్ర బృందం పర్యటించనునున్నది. కొవిడ్‌-19 నేపథ్యంలో నగరంలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో చేసిన ఏర్పాట్లను సోమవారం పరిశీలించనున్నది.అంతేకాక యూపీహెచ్‌సీలలో ఏర్పాటు చేసిన యాంటీజెన్‌ పరీక్షా కేంద్రాల్లో చేస్తున్న కరోనా పరీక్షలు, రోగులకు అందుతున్న సేవలపై క్షేత్రస్థాయిలో తిరిగి  పరిస్థితులను తెలుసుకోనున్నది. మరోవైపు కంటైన్మెంట్‌ జోన్లలోనూ కరోనా రోగులకు అందుతున్న వైద్యంపై అధ్యయనం చేయనున్నది. logo