బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Sep 22, 2020 , 01:03:38

ఏడు రోజులుగా.. సమ్మె బాట

ఏడు రోజులుగా.. సమ్మె బాట

స్విగ్గీ యాజమాన్యం తీరుపై బాయ్స్‌ ఆందోళన

కమీషన్లు, ఇన్సెంటివ్స్‌కు కంపెనీ ఎగనామం

రవాణా బాధ్యతలు థర్డ్‌ పార్టీకి అప్పగించిన యాజమాన్యం

కొనసాగుతున్న న్యాయ పోరాటం..!

  సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్విగ్గీ కంపెనీ బాయ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నది. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ గత మంగళవారం నుంచి నగర వ్యాప్తంగా స్విగ్గీ బాయ్స్‌ నిరహార దీక్షలు చేస్తున్నారు. స్విగ్గీ కంపెనీలో నగర వ్యాప్తంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ పార్టనర్స్‌తో కలిపి 20,000 వేల మంది పని చేస్తున్నారు. వీరికి గతంలో నాలుగు కిలో మీటర్ల పరిధిలోపు ఒక డెలివరీ ఐటమ్‌కు రూ.35కమీషన్‌ ఇచ్చే స్విగ్గీ యాజమాన్యం, ప్రస్తుతం ఒక కిలోమీటర్‌ పరిధిలోపు డెలివరీ చేస్తే.. కేవలం రూ.6 మాత్రమే ఇస్తుందని బాయ్స్‌ ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు ఇన్సెంటివ్స్‌, ఇతరత్రా అలవెన్స్‌లకు సైతం ఎగనామం పెట్టింది. బాయ్స్‌ ఆందోళనపై యాజమాన్యం అం దుబాటులోకి రాలేదు. ఈ కంపెనీలో పని చేసేవారంతా గతంలో ప్రతి నెల రూ.15,000ల నుంచి రూ.20,000ల వరకు సంపాదించుకునే వాళ్లు. ప్రస్తుతం రూ.10,000లు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడినా రూ.400లు కంటే ఎక్కువ వస్తలేదని, ఇందులో రూ.200ల వరకు పెట్రోల్‌కే ఖర్చవుతుందని బాయ్స్‌ చెబుతున్నారు. ఇక ఇంటి అద్దెలు, పిల్లల చదువు లు, పెరిగిన ధరలకు ఆ డబ్బులు ఎలా సరిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..  

 అందరికీ ఒకే కమీషన్‌ అందాలి..

 అందరికీ ఒకేలా కమీషన్‌ చెల్లించాలని, తమ డిమాండ్స్‌ను పరిష్కరించాలంటూ ఏడు రోజులుగా సమ్మెబాట పట్టిన బాయ్స్‌ మంత్రి కేటీఆర్‌కు తమ ఆందోళన గురించి ట్వీట్‌ చేసినట్టు డెలివరీ బాయ్స్‌ చెప్పారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో బాయ్స్‌ తమ ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు.

థర్డ్‌ పార్టీ మా పొట్ట గొడుతోంది

     స్విగ్గీ యాజమాన్యం థర్డ్‌ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతుందని బాయ్స్‌ గగ్గోలు పెడుతున్నారు. థర్డ్‌ పార్టీకీ ఎక్కువ కమీషన్‌ ఇస్తూ... తమకు తక్కువ కమీషన్‌ ఇస్తుందన్నా రు. తమను మోసం చేస్తున్న  కంపెనీపై కార్మిక చట్టం ప్రకా రం, చర్యలు తీసుకోవాలని ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌కు వినతి పత్రం  సమర్పించినట్టు తెలిపారు.  


డెలివరీ బాయ్స్‌ డిమాండ్స్‌...

మినిమమ్‌ ఆర్డర్‌ బిల్స్‌ మీద రూ.35లు చెల్లించాలి.

బ్యాచ్‌ ఆర్డర్‌ బిల్స్‌ మీద రూ.20 లు చెల్లించాలి. 

ఒక కి.మీ.లోపు కిలోమీటర్‌కు రూ.10లు చెల్లించాలి. 

ఆరు కిలో మీటర్ల నుంచి 8 కిలోమీటర్ల లోపు వరకు రూ.25లు చెల్లించాలి. 

ఎనిమిది కిలోమీటర్ల పైన ఉంటే కి.మీ.కు రూ.35లు చెల్లించాలి.

రెస్టారెంట్‌ వెయిటింగ్‌ మినిమమ్‌ రూ.5ల నుంచి రూ.25 వరకు చెల్లించాలి. 

థర్డ్‌ పార్టీ వారి షాడోఫాక్స్‌ , రాపిడోలను తీసివేయాలి.

రోజువారి ప్రోత్సహకాలు కింది విధంగా ఉండాలి...

లేట్‌నైట్‌ చార్జెస్‌ రూ.20/-లు చెల్లించాలి. 

రోజుకు రూ.200లు సంపాదించలేకపోతున్నాం..

 తాజాగా కోతలతో రోజుకు రూ.200లు కూడా సంపాదించలేని పరిస్థితి ఎదురైంది. స్విగ్గీ కంపెనీ యాజమాన్యం థర్డ్‌ పార్టీని పెట్టి తమకు కమీషన్‌ తక్కువ వచ్చేలా చేస్తోంది. థర్డ్‌ పార్టీకి ఎక్కువ కమీషన్‌ ఇస్తూ మాకు తక్కువగా చెల్లిస్తోంది. ఈ కంపెనీలో పని చేసే ప్రతి ఉద్యోగి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కంపెనీ మా కడుపు కొడుతుంది. మాకు న్యాయం చేయాలి. 

- చాణిక్య, స్విగ్గీ బాయ్‌