గురువారం 22 అక్టోబర్ 2020
Hyderabad - Jul 17, 2020 , 23:23:20

సమస్యల పరిష్కారం కోసం

సమస్యల పరిష్కారం కోసం

అందుకే టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

బాలానగర్‌ కార్పొరేటర్‌, అధికారులు, సంక్షేమ సంఘాల నాయకులతో సంభాషణ

కూకట్‌పల్లి, జూలై 17 : ప్రజా సమస్యలను ఎప్పటికప్పు డు తెలుసుకొని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అందుకే కూకట్‌పల్లి నియోజకవర్గలోని డివిజన్ల వారిగా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలానగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌, అధికారులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో ఎమ్మెల్యే శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్‌ పరిధిలోని చరబండరాజు కాలనీ, అంబేద్కర్‌నగర్‌, సాయినగర్‌, చిత్తారమ్మ బస్తీకాలనీల సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీల్లో కరోనా కేసుల కారణంగా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యేతో విన్నవించారు. కొన్ని కాలనీల్లో తాగునీటి సరఫరాలో సమస్య ఉంద ని, కొన్నిచోట్ల డ్రైనేజీ పైపులైన్‌ అవసరమని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే స్పందించారు. సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులకు సంబంధించిన నివేదికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. చరబండరాజు కాలనీలో కమ్యూనిటీహాల్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. హనుమాన్‌ ఆలయం వద్ద రాత్రుళ్లు కొందరు ఆకతాయిలు కూర్చొని మద్యం సేవిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పోలీసు పెట్రోలింగ్‌ నిర్వహించి ఆకతాయిల ఆటలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలానగర్‌ పరిసర ప్రాంతాలకు నీటి సరఫరాను పెంచడానికి ఇంకా 130 మీటర్ల పాటు పైపులైన్‌ పనులను చేపట్టాల్సి ఉండగా స్థల వివాదం కోర్టులో ఉందన్నారు. 15 రోజుల్లో సమస్యను పరిష్కరించి పైపులైన్‌ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. టెలీకాన్ఫ్‌రెన్స్‌లో బాలానగర్‌ కార్పొరేటర్‌ కాండూరి నరేంద్రాచార్యా, డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంతి, వైద్యాధికారి చంద్రశేఖర్‌గౌడ్‌, ఇంజినీరింగ్‌ విభాగం డీఈ గోవర్ధన్‌గౌడ్‌, ఏఈ రషీద్‌, జలమండలి జీఎం వినోద్‌ భార్గవ్‌, మేనేజర్‌ సుప్రజ పాల్గొన్నారు.

కాగా నేడు కూకట్‌పల్లి డివిజన్‌ సమస్యలపై ఉదయం 8 నుంచి 9 గంటల వరకు టెలీకాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే కృష్ణారా వు మాట్లాడుతారని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ సతీశ్‌ అరోరా తెలిపారు.


logo