శనివారం 08 ఆగస్టు 2020
Hyderabad - Aug 02, 2020 , 00:26:34

సర్కారు బడులకు.. ఆధునిక హంగులు

సర్కారు బడులకు.. ఆధునిక హంగులు

తొలిదశలో 20 పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ నిర్ణయం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాజ్‌భవన్‌ స్కూల్లో ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య 500లోపే. పురాతన భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో అధునాతన భవనాన్ని నిర్మించిన తర్వాత విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 1100కు పెరిగింది. సీట్ల కోసం పైరవీలు.. సిఫార్సులు సైతం షురూ అయ్యాయి. ఇంతగా పాఠశాల ప్రసిద్ధికెక్కడానికి మౌళిక వసతుల కల్పనే ప్రధాన కారణం. అలాగే గతంలో సీపీఎల్‌ అంబర్‌పేట స్కూలు విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. దీంతో చాలామంది ప్రైవేట్‌ బాట పట్టారు. ఇప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చొరవ ఫలితంగా కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు విద్యార్థులంతా ఈ పాఠశాలకు క్యూ కడుతున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలకు అధునాతన హంగులద్దేందుకు జిల్లా విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. పాఠశాలల రూపురేఖలను మార్చడం ద్వారా అడ్మిషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. దీంట్లో భాగంగా 20 పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.

మంత్రి తలసాని చొరవ..

ఇటీవలే జిల్లాకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్ల బలోపేతంపై దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. మౌళిక వసతులు కల్పించడం ద్వారా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఐదుగురు డిప్యూటీ ఈవోలతో కమిటీ వేసి నివేదిక రూపొందించాలని, విద్యార్థులంతా ప్రభుత్వ స్కూళ్లకు తిరిగి వచ్చేలా ఉండాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. తొలివిడుతలో భాగంగా 20 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చనున్నారు. శిథిల భవనాలను కూల్చివేయడం, కొత్తవాటిని నిర్మించడం, ఆకట్టుకునేలా రంగులు, పెయింటింగ్స్‌ వేయడంతోపాటు మౌళిక వసతులను కల్పించనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పిల్లలకు వినోదం పంచేలా బొమ్మలు, అక్షరమాలికలు, ఉన్నత పాఠశాలల్లో బోధనోపకరణాలను గోడలపై చిత్రీకరించనున్నారు.

వసతుల కల్పన.. 

రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనన్ని ప్రభుత్వ స్కూళ్లు ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయి. మొత్తంగా 680కి పైగా నడుస్తున్నాయి. సుమారుగా 2.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపోయేలా వసతులు లేవు. చాలాచోట్ల తాగునీరుంటే వాడుకోవడానికి, వాడుకోవడానికుంటే తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితులున్నాయి. సరిపడా గదులు లేవు. దీంతో చాలామంది ప్రైవేట్‌బాట పడుతున్నారు. శిక్షణపొందిన, నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా విద్యార్థులు లేక కొన్ని పాఠశాలలు డీలాపడిపోతున్నాయి. దీనికి పరిష్కారంగా అధికారులు వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), దాతలు, ప్రజాప్రతినిధుల ద్వారా నిధులు రాబట్టి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలి విడుత ప్రయత్నాలు సఫలీకృతమైతే రెండో విడుతలో మరికొన్నింటిని చేపట్టాలని యోచిస్తున్నారు.


logo