సోమవారం 28 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 23:42:53

వాణిజ్య అనుమతులపై దృష్టి

వాణిజ్య అనుమతులపై  దృష్టి

జంట సర్కిళ్లలో 7,996 ట్రేడ్‌ లైసెన్సులు

వార్షిక  లక్ష్యం రూ.4.94 కోట్లు.. వసూలైనవి రూ. 2.58కోట్లు

మొండి బకాయిలపై ప్రత్యేక ఫోకస్‌

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 11 : వాణిజ్య అనుమతులపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను, వాణిజ్య పన్నుల చెల్లింపునకు మూడు నెలల పొడగింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదనపు గడువు ముగిసిన తర్వాత పన్నులు చెల్లించని వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది పన్నులు చెల్లించిన వారిది.. ఇప్పటి వరకు ట్రేడ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ చేసుకోని వారి జాబితాలను సిద్ధం చేశారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన దుకాణాలకు లైసెన్స్‌ తీసుకున్నారా లేదా? అన్న అంశాలపై దృష్టిని సారించారు. 

వార్షిక లక్ష్యం సాధించేలా..

కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో వాణిజ్య పన్ను ల వసూలు వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా వాణిజ్య అనుమతులపై అధికారులు దృష్టి పెట్టారు. జంట సర్కిళ్లలో 7,996 ట్రేడ్‌ లైసెన్స్‌ ఉండగా, మూసాపేట సర్కిల్‌లో 4006, కూకట్‌పల్లి సర్కిల్‌లో 3990 ట్రేడ్‌ లైసెన్స్‌లు ఉన్నాయి. వార్షిక ఏడాది వసూళ్ల లక్ష్యం మూసాపేట సర్కిల్‌కు రూ. 2.96కోట్లు ఉండగా, కూకట్‌పల్లి సర్కిల్‌ లక్ష్యం రూ. 1. 98 కోట్లు ఉంది. ఇప్పటి వరకు మూసాపేట సర్కిల్‌లో 1335 ట్రేడ్‌ లైసెన్స్‌లు రిన్యువల్‌ చేసుకోగా రూ. 1. 52కోట్లు వసూళ్లలయ్యాయి. కూకట్‌పల్లి సర్కిల్‌లో 1258 ట్రేడ్‌ లైసెన్స్‌లు రిన్యువల్‌ చేసుకోగా రూ.1.06 కోట్లు వసూళ్లయ్యాయి. జంట సర్కిళ్లలో రూ. 2.58కోట్లు వసూళ్లు కాగా రూ. 1.34 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలన్నింటిని వసూళ్లు చేయడంపై అధికారులు దృష్టి సారించారు.

కొత్తగా 485 ట్రేడ్‌ లైసెన్స్‌లు..

జంట సర్కిళ్లలో కొత్తగా 485 ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకున్నారు. మూసాపేటలో 175, కూకట్‌పల్లిలో 310 లైసెన్స్‌లు కొత్తగా పొందారు. గతంలో పొందిన చిన్నచిన్న దుకాణాలు ఖాళీ చేయడం, వ్యాపారాలు జరుగక.. కరోనా కారణంగా షాపులను మూసివేసిన వారు కూడా ఉన్నారు. అలాగే కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసుకుని ట్రేడ్‌ లైసెన్స్‌ పొందనివారు కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ, కొత్త ట్రేడ్‌ లైసెన్స్‌ జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాలనీలు, బస్తీల్లోని అంతర్గత రోడ్లలో ఏర్పాటు చేసిన షాపులకు చెందిన ట్రేడ్‌ లైసెన్స్‌ను పరిశీలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ట్రేడ్‌ లైసెన్స్‌ పునరుద్ధరించు కోవాలి

దుకాణాలు యజమానులు ట్రేడ్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించు కోవాలి. మూడు నెలలు పొడగింపు ఇచ్చాం. పునరుద్ధరించుకోని వారంతా వెంటనే చేసుకోవాలి. కరోనా కారణంగా సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు మూతపడడంతో ట్రేడ్‌ లైసెన్స్‌ వసూళ్లపై ప్రభావం పడింది. వందశాతం లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. పన్ను చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. 

- కె.రవికుమార్‌, ఉప కమిషనర్‌, మూసాపేట


logo