e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home హైదరాబాద్‌ పూల బజార్‌.. కరోనాతో బేజార్‌

పూల బజార్‌.. కరోనాతో బేజార్‌

పూల బజార్‌.. కరోనాతో బేజార్‌
  • వెలవెలబోతున్న ఫ్లవర్‌ మార్కెట్లు
  • పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఆగిపోవడంతోడీలా
  • లాక్‌డౌన్‌తో విపరీతంగా తగ్గిన గిరాకీ
  • లబోదిబోమంటున్న పూల రైతులు
  • దిగుబడి ఉన్నా ఆదాయం లేక సతమతం

కరోనా మహమ్మారి పూల రైతును ఆగం చేసింది. ఎన్నో ఆశలతో సాగు చేస్తే చివరకు గిట్టుబాటు ధర రావడం లేదు. మార్కెట్లకు తీసుకొస్తున్న సరుకు అమ్ముడుపోకపోవడంతో చివరకు ఏం చేయాలో తోచక చెత్త పాల్జేస్తున్నారు. గతేడాది మొదటి దశ కరోనా తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా రెండో దశ నట్టేట ముంచిందని రైతులు వాపోతున్నారు. నగరంలో గుడిమల్కాపూర్‌, ఎల్‌బీనగర్‌ పూలమార్కెట్లు పెద్దవి. ఇక్కడికి రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీల నుంచి రైతులు పూలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కావడం, నాలుగుగంటలు సడలింపు ఉన్నా కొనేందుకు ఎక్కువమంది ముందుకు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో శుభకార్యాలు అధికం. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహప్రవేశాలు ఈ రెండు నెలల్లో జరుగుతుంటాయి. కరోనా రెండోదశ తీవ్రమవ్వడం, లాక్‌డౌన్‌ ప్రభావంతో అన్ని శుభకార్యాలు నిలిచిపోయాయి. ఫలితంగా పూల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.

మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడ. ఎకరంన్నరలో బంతి, అరెకరంలో జర్పరా పూలను సాగు చేసిన. గతంలో బంతి కిలో రూ.40 నుంచి రూ.50 అమ్ముడుపోయేది. ఇప్పుడు కిలో రూ.5 నుంచి రూ.10 అడుగుతున్నారు. పెట్టిన పెట్టుబడి రావడం లేదు. మార్కెట్‌కు తీసుకపోతే కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. బొక్క పరుశురాంరెడ్డి, పూల రైతు

కరోనా ప్రభావం పూల వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. అసలే శుభకార్యాలు జరగక, ఓ వేళ జరిగినా హంగూ ఆర్భాటానికి దూరంగా ఉంటుండటంతో పూలను కొనేవారు కరువయ్యారు. ఒకప్పుడు లక్షల్లో జరిగే వ్యాపారం ప్రస్తుతం వేలల్లోకి పడిపోయింది. కొందరు వ్యాపారులైతే దుకాణాలే తెరవడం లేదు.. మరికొందరు తీసుకొస్తున్న పూలల్లో 60 శాతం కూడా అమ్ముడుపోవడం లేదు. దీంతో వందల కేజీల పూలు చెత్త కుప్పల పాలవుతున్నాయి. అష్టకష్టాలు పడి మార్కెట్‌కు తీసుకొస్తే కొనేవారు లేక టన్నుల కొద్ది పూలను పారబోయాల్సి వస్తున్నదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ, బస్సు చార్జీలు కూడా రావడం లేదంటున్నారు. గతేడాది ఉన్న పరిస్థితి.. ఇప్పుడూ కొనసాగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు వ్యాపారాలు చేపడుతున్నా ఆదరణ కనిపించడం లేదని.. ఇందుకు శుభకార్యాలు, లాక్‌డౌన్‌ ప్రభావమేనని చెబుతున్నారు.

కళ తప్పిన పూల వ్యాపారం..

గుడిమల్కాపూర్‌లోని పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్‌ నగరంలో ప్రముఖ పూల మార్కెట్‌లలో ఒకటి . నగరంలో జరిగే పండుగలు, పెండ్లిండ్లు, ఇతర వేడుకల కోసం నగరవాసులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఈ మార్కెట్‌కు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ప్రతిరోజూ దాదాపు 20 రకాల పూలు 500 క్వింటాళ్ల వరకు దిగుమతి అవుతాయి. అయితే గడిచిన వారం రోజులుగా కేవలం 300 క్వింటాళ్ల వరకు మాత్రమే వస్తున్నాయి. వాటిలో 60 శాతం కూడా అమ్ముడవడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధింపుతో హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాల నుంచి కొన్ని రకాల పూలు మాత్రమే వస్తున్నాయని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ గ్రేడ్‌ -2 సెక్రటరీ నరేందర్‌ తెలిపారు.

శుభకార్యాలు లేకపోకవడమే ..

సాధారణంగా మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలు శుభకార్యాలకు అనువైనవి. నిరుడు కరోనా మొదలైనప్పడు మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఎక్కడా వివాహాలు జరిగిన దాఖలాలు లేవు. అయినా గతేడాది మేలో ఇదే సమయానికి గుడి మల్కాపూర్‌ పూల మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 70 క్వింటాళ్ల పూలు దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో మార్కెట్‌కు 300 క్వింటాళ్ల పూలు వస్తున్నాయని మార్కెట్‌ అధికారులు తెలిపారు. ఇందులో 200 క్వింటాళ్లు కూడా అమ్ముడు పోవడం లేదని వారు అంటున్నారు. ఇందుకు కారణం శుభకార్యాలు లేకపోవడమేనని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు.

బొకేలకు తగ్గిన గిరాకీ..

పుట్టిన రోజులు, శుభకార్యాలు, పదవీ విరమణలు , సన్మానాలు, గృహ ప్రవేశాలు ఇలా కార్యం ఏదైనా బొకేలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ వ్యాపారంపై లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా చూపుతున్నది. శుభకార్యాలు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఒక్కో దుకాణంలో 50 నుంచి 70 బొకేలు అమ్ముడుపోయేవని, ఇప్పుడు 5 -10 అమ్మడమే గగనమైందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది వరకు ఒక్కో దుకాణం నుంచి ఐదుగురు వరకు ఉపాధి పొందేవారని, ఇప్పుడు ఉపాధి కోల్పోయి సొంతూర్లకు వెళ్లిపోయారని వివరిస్తున్నారు. బొకేలకు అవసరమైన ఆకులు, బుట్టలు, సరైన సమయంలో రావడం లేదని, దీంతో ఖర్చు పెరిగిందని పేర్కొంటున్నారు.

కరోనా తెచ్చిన పరేషాన్‌

పూల రైతులకు కరోనా శాపంగా మారింది. శుభకార్యాలు లేకపోవడంతో పాటు సరైన ధర రాకపోవడంతో మార్కెట్‌కు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వస్తున్నారు. ముఖ్యంగా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ, జైత్వారం, నేదునూరు తదితర గ్రామాల రైతులు ఎక్కువగా చామంతి, గులాబీ, మల్లె, జర్‌బరా లాంటి పూలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. వేసవిలో ఈ పూలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో ఇక్కడ పండించిన పూలను రైతులు గుడిమల్కాపూర్‌, మోజంజాహి మార్కెట్‌కు తీసుకు వెళ్లి అమ్ముతుంటారు. గతేడాది కరోనాతో రైతులకు పెట్టుబడి రాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో పూలకు సరైన డిమాండ్‌ లేక ఆర్థికంగా నష్టపోతున్నారు.

తగ్గిన వ్యాపారం

గుడిమల్కాపూర్‌ పూలమార్కెట్‌లో ప్రస్తుతం పూలవ్యాపారం బాగా తగ్గింది. శుభకార్యాలు లేకపోవడం, కరోనా కేసులు పెరగడంతో వ్యాపారం పడిపోయింది. వ్యాపారాలు లేక ఇటు రైతులు.. అటు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. -నరేందర్‌(గ్రేడ్‌-2 సెక్రటరీ)

వ్యాపారం నడుస్తలేదు

కరోనా కారణంగా నిరుడు పూర్తిగా నష్టపోయినం. ఈ సారి కూడా అంతే ఇబ్బందులు పడుతున్నం. మామూలు రోజులతో పోలిస్తే ఇప్పుడు పైసలకు మస్తు ఇబ్బందైతున్నది. ఈ పూల వ్యాపారం నడుస్తలేదు. పెట్టిన ఖర్చులు కూడ వస్తేలవు. చేతుల ఏం మిగుల్తలేవు. -కృష్ణగౌడ్‌, పూలవ్యాపారి

అక్కడే వదిలేస్తున్నాం..

పూల రైతులకు పెట్టిన పెట్టుబడి వస్తలేదు. మునుపు కిలో బంతి పూలు రూ.50 నుంచి రూ. 60లు పలికేవి. ప్రస్తుతం కిలోకు రూ.5 నుంచి రూ.8లే అడుగుతున్నరు. పండిన పూలను గుడిమల్కాపూర్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు. దీంతో అక్కడ్నే వదిలేసి వస్తున్నం. -ఎర్రబైరు వెంకట్‌రెడ్డి, జైత్వారం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పూల బజార్‌.. కరోనాతో బేజార్‌

ట్రెండింగ్‌

Advertisement