బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 07:11:52

దేవుడిలా మా జీవితాలను సీఎం కేసీఆర్‌ కాపాడారు...

 దేవుడిలా మా జీవితాలను సీఎం కేసీఆర్‌ కాపాడారు...

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ :  ‘మూడురోజులు బంగ్ల మీదున్నం. పానాలుంటయో పోతయో అనుకున్నం. పిల్లల్ని దగ్గరికి తీసుకున్నం. నిల్చున్నోళ్లం నిల్చున్నట్టే ఉన్నాం. అర్ధరాత్రి దొంగోడొచ్చినట్టే వచ్చింది వాన. కరెంటు పోయింది. ఎటుపోవాలన్నా కష్టమే... తిప్పలు పడి బంగ్లా మీదకు పోయినం. మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు రెండు రోజులు తిండిపెట్టిండ్రు’. అని బేగంపేట వడ్డెరబస్తీకి చెందిన వరికప్పుల సుధాకర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘బతుకుతమో లేదో అనుకున్నం. ఇంట్ల సామానంతా కొట్టుకుపోయింది. దేవుడిలా మా జీవితాలను సీఎం కేసీఆర్‌ కాపాడారు. ఆయన సహాయమెలా మరిచిపోతం’ అంటూ చేతులెత్తి మొక్కారు. ఆనాటి జలవిలయాన్ని ‘నమస్తేతెలంగాణ’కు కండ్లకు కట్టినట్లు చెప్పిన ముంపు బాధితులు.. మంత్రి కేటీఆర్‌ వచ్చాకా.. పానం నిమ్మలమైందని , సర్కారుకు రుణపడి ఉంటామన్నారు.

ఆ దేవుని రూపంలో..

ఈనెల 13 నుంచి భారీ వర్షాలు, పోటెత్తుతున్న వరదలతో  నగరం అతలాకుతలమైంది. పేద, ధనిక అనే తేడాలేకుండా వరదలతో జన జీవనం స్తంభించిపోయింది. జల విలయంలో చిక్కి బిక్కుబిక్కుమంటూ ఏ దేవుడు ఎదురొచ్చి సాయం చేస్తారో అని ఆశగా చూస్తుంటే.. ముఖ్యమంత్రి  కేసీఆరే ఆ దేవుని రూపంలో వచ్చి తమను ఆదుకున్నారని ఇచ్చర్ల సత్తెమ్మ చెప్పారు. రూ.10 వేల సాయాన్ని పొందిన ముంపు ప్రాంతాల ప్రజలు.. ప్రభుత్వం చేసిన మేలును మర్చిపోలేమంటున్నారు. తమను తక్షణం ఆదుకోకపోతే  పండుగ దినాల్లో పస్తులుండాల్సి వచ్చేదని....ఆ ఆవేదన భరిత పరిస్థితి నుంచి సర్కారు గట్టెక్కించిందని  ఆనందభాష్పాలు రాల్చారు. మంత్రి కేటీఆర్‌ స్వయంగా కాలనీల్లో తిరిగి సమస్యలు సత్వరమే పరిష్కరించడంతో తమ కష్టాలు తీరాయన్నారు. 

రాత్రి వానతోనే వస్తువులకు నష్టం 

ఉదయం కురిసిన వాన కంటే నాడు రాత్రి కురిసిన వర్షం వల్లే తీవ్రంగా నష్టపోయామని బేగంపేట ప్రాంతంలోని బ్రాహ్మణవాడ, వడ్డెరబస్తీ,  టీవీ టవర్‌కాలనీ, మయూర్‌మార్గ్‌ కాలనీ వాసులు చెబుతున్నారు. నిత్యావసర సరుకులు మొత్తం నీళ్లల్లో నానిపోయాయని, ఖరీదైన వస్తువులు పూర్తిగా పాడైపోయాయని వారు ఆవేదన చెందారు. ‘ఆ వరదకు బతుకుతామో లేదో అనుకున్నం.. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం.. అటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడద’ని నాటి భయానక పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. 

సల్లగుండాలె.. 

ఆపదలో ఉన్నవాళ్లను  పలకరించిపోవుడే ఇవ్వాళ రేపు కష్టంగా ఉన్నది. అటువంటిది మంత్రి కేటీఆర్‌ స్వయంగా ఇంటికి వచ్చి ఏం కావాలో అడిగి....‘మీరు ధైర్యంగా ఉండండి..మిమ్మల్ని అదుకుంటాం’ అని భరోసా ఇచ్చి.. రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కష్టకాలంలో దేవుడిలా ఆదుకున్న  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు సల్లంగుండాలె. -ఇచ్చర్ల సత్తెమ్మ,  బేగంపేట బస్తీ 

మనసున్న మారాజు..

నేను ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తా. డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి భోజనం చేశా. ఒక్కసారిగా మొదలైన వాన. నాలుగైదు గంటల పాటు పడ్తనే ఉన్నది. మా కాలనీలో వందకు పైనే ఇండ్లు ఉన్నయి. అన్నీ చిన్న చిన్న ఇండ్లే. చూస్తుండగానే మా రూంలోకి నీళ్లోచ్చాయి. కరెంట్‌ కూడా పోయింది. నడుము లోతు నీళ్లు రాగానే అప్పటికప్పుడు బతికితే చాలనుకొని బంగ్లా మీదికి పోయాం. మూడు రోజుల తరువాత కిందకు దిగాం. ఇంకా ఇంట్లో నీరు తగ్గలేదు. అలాంటి సమయంలో సర్కారు తక్షణ సాయంగా రూ. 10వేలు అందించింది. బాధల్లో ఉన్నప్పుడు అందరూ వచ్చి  అయ్యో పాపం అని పోతారు... కానీ మా కష్టాలు చూడలేక నేరుగా ఇంటికి ఆర్థిక సాయాన్ని పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనసు ఎంతో గొప్పది. -వరికప్పుల సుధాకర్‌, వడ్డెరబస్తీ 

స్వయంగా వచ్చి..

మా ప్రాంతంలో నష్టపోయిన వారందరికీ ఆర్థిక సాయం అందుతున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కార్పొరేటర్‌, మున్సిపల్‌ అధికారులు స్వయంగా నగదు సాయం చేస్తున్నారు. కొందరి వివరాలు రాసుకొని పోయి తరువాత మళ్లీ వచ్చి ఇస్తున్నారు. వివరాలు సేకరించే క్రమంలో.... డబ్బులిచ్చేటప్పుడు ఎవరూ ఒక్క రూపాయి అడగటం లేదు. ఇంత తొందరగా ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని  అనుకోలేదు. దేవుడిలా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదుకుంటున్నారు.  -పి. రామలక్ష్మి, జీ. రూతు

పునరుద్ధరణ పనులు వేగవంతం

భారీ వర్షాలు, వరదలతో  ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు,  కాలనీల్లో వరద నీటిని తొలగించేందుకు జలమండలి పనులను వేగవంతం చేసింది. జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ సిబ్బంది కాలనీల్లో పేరుకుపోయిన బురదను, చెత్తను తొలగిస్తూ బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు మురుగు కాల్వల్లో పేరుకుపోయిన ఇసుక మేటల్ని తొలగిస్తున్నారు.  అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అర్హులైన అందరికీ చేరేలా వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వివరాలు సేకరిస్తూ బాధితులకు నగదు సాయాన్ని అందజేస్తున్నారు. 

కేటీఆర్‌ స్వయంగా రావడంతో కొండంత ధైర్యం..

వరదల్లో చిక్కుకున్న  తమ పరిస్థితిని తెలుసుకొని మంత్రి కేటీఆర్‌ స్వయంగా తమ కాలనీకి వచ్చారని, ఆయన రావడంతో తమకు కొండంత ధైర్యం వచ్చిందని బాధితులు చెప్పారు. మోకాలు లోతు నీళ్లు ఉన్నా అందులో నుంచే నడుచుకుంటూ వచ్చిన కేటీఆర్‌.. తమ బాగోగులు అడిగి తెలుసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ‘మేమిక్కడ చాలా ఏండ్ల నుంచి ఉంటున్నాం. గతంలో కూడా వరదలొచ్చాయి.  అయితే ఇంత ఎక్కువగా రాలేదు. అప్పుడు ఏ నాయకుడు రాలేదు. ఇప్పుడు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌, మున్సిపాలిటీ అధికారులు అందరూ వచ్చి సహాయం చేస్తున్నారు’ అని సంతోషపడ్డారు.