సోమవారం 25 జనవరి 2021
Hyderabad - Oct 31, 2020 , 08:04:29

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ముంపు సమస్యకు చరమగీతం

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ముంపు సమస్యకు చరమగీతం

ఎల్బీనగర్‌ : భారీ వర్షాలు, వరదల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే , ఎంఆర్‌డీసీ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల వర్షం, వరదతో ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురై రోడ్లు, ముంపు ప్రాంతాల వాసులకు తీవ్ర నష్టం జరిగింది. ఈ సమస్య మరోసారి రాకుండా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు నియోజకవర్గం వ్యాప్తంగా ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ రూపిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, మూడు సర్కిళ్ల ఇంజనీర్లు, కన్సల్టెంట్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. రాత్రి పది గంటలకు ఎల్బీనగర్‌ జోనల్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే దిశానిర్ధేశం చేశారు. ఇకపై  ప్రణాళికాబద్దంగా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అనంతరం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు వరద ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  పర్యటించి గూగుల్‌లో అన్ని ప్రాంతాల లేవల్స్‌ తీసుకుని వరదముంపు లేకుండా డ్రైయిన్స్‌ ఎలా చేపట్టాలని, లేవల్స్‌ సరిపోతాయా అన్న దానిపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ట్రాఫిక్‌ చిక్కులు, ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిశీలన చేసేందుకు అవకాశం ఉంటుందనే రాత్రి సమయంలో పర్యటించామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. 

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో భవిష్యత్తులో వరదముంపు సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం డ్రైయిన్ల నిర్మాణం చేస్తున్నామని ఎల్బీనగర్‌ నియోజకవర్గం శాసనసభ్యుడు, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం అర్థరాత్రి అధికారులతో క్షేత్రస్థాయిలో వరదముంపు ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గం వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారన్నారు. భవిష్యత్తులో ఎంతటి భారీ వర్షాలు వచ్చినా వరద ముంపు లేకుండా చేసేందు కు, శాశ్వత పరిష్కారం కోసం మూడు నాలుగు పర్యాయాలు కన్సెల్టెన్సీలతో సమావేశమై ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఈ ప్రణాళికలను అమలు పర్చడంలో భాగంగానే అధికారులతో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించామన్నారు. చంద్రా గార్డెన్‌, మెఘా ఫంక్షన్‌ హాల్‌ కాలనీల నుంచి తపోవన్‌ కాలనీ వద్ద సరూర్‌నగర్‌ చెరువులో వరద నీరు కలువకుండా కాలనీలు ముంపు నకు గురి కాకుండా ప్రియదర్శినీ పార్కు నుంచి సరూర్‌నగర్‌ చెరువు దిగువ కాలనీలు కోదండరాంనగర్‌, పీఅండ్‌టీకాలనీ, వివేకానందనగర్‌, కమలానగర్‌ల మీదుగా చైతన్యపురి నాలాకు అనుసందానం చేస్తూ పైప్‌లైన్‌ వేయలని ప్రణాళికలు చేశామని పేర్కొన్నారు. మన్సూరాబాద్‌ పెద్ద చెరువు నుంచి సరస్వతినగర్‌, చిన్న చెరువు, బండ్లగూడ చెరువు, నాగోలు చెరువు ప్రాంతాల్లోని కాలనీలు ముంపునకు గురి కాకుండా మరో డ్రైయిన్‌ నిర్మాణం చేసి మూసీలో కలిసే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.  కప్రాయి చెరువు పరిధిలోని ముంపు కాలనీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా మరో డ్రైయిన్‌ ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో చంద్రా గార్డెన్స్‌ నుంచి నాగోలు మూసీ వరకు ఇరువైపులా వరదనీటి నాలాలను పునరుద్ధరించనున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట జోనల్‌ కమిషనర్‌తో పాటుగా మూడు సర్కిళ్ల ఈఈ లు రాజయ్య, అశోక్‌రెడ్డి, ఈ. రాజయ్య, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీలు ఇర్షాద్‌, శ్యామ్యూల్స్‌, కన్సల్టెంట్‌ సుభానీ, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

 • రాత్రి పదిన్నర గంటల సమయంలో జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి కార్యాలయంలో ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగం వారితో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత ప్రణాళికలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చర్చించారు. 
 • రాత్రి 10.45  గంటలకు గడ్డిఅన్నారం డివిజన్‌లో పాణణీయ డెంటల్‌ కాలేజీ ప్రాంతాల  రోడ్డుతో పాటుగా పరిసర ప్రాంతాలను సందర్శించారు. 
 • రాత్రి 11 గంటలకు సరూర్‌నగర్‌ చెరువు కట్ట ప్రాంతాన్ని, శారదా థియేటర్‌ ముందు నుంచి కోదండరాంనగర్‌, సీసల బస్తీ ముంపు ప్రాంతాలను సందర్శించి ముంపు తీవ్రత సమస్యలను పరిశీలించి అనంతరం సరూర్‌నగర్‌ చౌడీ ప్రాంతంలో సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సరూర్‌నగర్‌ ప్రియదర్శినీ పార్కు ప్రాంతాన్ని, సరూర్‌నగర్‌ చెరువు బండ్‌ పరిస్థితిని పరిశీలించారు. 
 • రాత్రి 11.30 గంటలకు సరూర్‌నగర్‌ నుంచి కర్మన్‌ఘాట్‌ వెళ్లే రహదారిని పరిశీలించి వడ్డెర బస్తీ వద్ద నాలాను పరిశీలించారు. 
 • రాత్రి 11.45 నుంచి రాత్రి 12.25 గంటల వరకు చంపాపేట డివిజన్‌లోని శివసాయికాలనీ, సింగిరెడ్డి శివారెడ్డిగార్డెన్స్‌ ప్రాం తం, మెఘా ఫంక్షన్‌ హాల్‌ వెనుక ప్రాంతం, ఉదయ్‌నగర్‌, ఎంఆర్‌ఆర్‌ కాలనీ, పద్మానగర్‌ కాలనీల్లో పర్యటించారు. 
 • రాత్రి 12.30 గంటలకు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో కర్మన్‌ఘాట్‌ గాయత్రినగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట ఫిసల్‌బండ దారిలో గతంలో నిర్మించిన కల్వర్టులను పరిశీలించారు. అలేఖ్యా టవర్స్‌ ఎదురుగా ఉన్న హస్తినాపురం డివిజన్‌లోని రెడ్డీ కాలనీ, సాగర్‌ ఎన్‌క్లెవ్‌ కాలనీలు, బైరామల్‌గూడ చెరువు ప్రాంతాన్ని సందర్శించి ముంపునకు గురైన బాధితులతో మాట్లాడారు. అనంతరం అపెక్స్‌ దవాఖాన వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.
 • రాత్రి 1.15 నుంచి 2.15 గంటల వరకు బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని కప్పర చెరువు ప్రాంతం, ముంపు కాలనీలు సత్య సాయినగర్‌, అఖిలాండేశ్వరి కాలనీ, పీవీఆర్‌కాలనీ, అనంత కృష్ణవేణి నగర్‌ పరిసర కాలనీలను సందర్శించి పరిశీలించారు. 
 • రాత్రి 2.30 గంటలకు హయత్‌నగర్‌ డివిజన్‌లోని సామ నగర్‌తో పాటుగా కాలనీ నుంచి జాతీయ రహదారి వరకు పరిస్థి తులను పరిశీలించారు. విజయవాడ జాతీయ రహదారిపై భాగ్య లత వద్ద డ్రైనేజీ అవుట్‌లెన్‌ను పరిశీలించారు. 
 • తెల్లవారుజామున 3 గంటలకు బంజారాకాలనీలో స్థానిక కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డితో కలిసి పర్యటించి వరద ముంపు పరిస్థితులను పరిశీలించారు. 
 • తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మన్సూరాబాద్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి సరస్వతి కాలనీ వద్ద పెద్ద చెరువు, బెతెస్టా చర్చీ వద్ద ఉన్న నాలాను పరిశీలించారు. 
 • వేకువజామున 3.40 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు నాగోలు డివిజన్‌లోని ఎరుకల నాంచారమ్మనగర్‌ పరిసర ప్రాంతాలు, ఉదయం నాలుగు గంటలకు బండ్లగూడ చెరువు, నాగోలు చెరువు ప్రాంతాలను సందర్శించి అనంతరం సాయిబాబా కాలనీ, వెంకటరమణ కాలనీ, నాగోలు ప్రధాన రహదారులను పరిశీలించారు. 


logo