ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 13, 2020 , 07:17:32

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేయాలి

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేయాలి

ఎల్బీనగర్  : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ అన్నారు.  చైతన్యపురిలోని రుషిత చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ సతీశ్‌ ఆధ్వర్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెట్రోలింగ్‌ వాహనాలకు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ను అందజేశారు. ఈ కిట్స్‌ను సీపీ మహేశ్‌భగవత్‌ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిత్యం రోడ్డు ప్రమాదాల బారినపడి అనేక మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. రోజుకు సగటున 700మంది రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులు అవుతున్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేది పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలేనని, ఈ పెట్రోలింగ్‌ వాహనాలకు మెడికల్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాచకొండలోని పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలకు ఫస్ట్‌ ఎయిడ్‌ మెడికల్‌ కిట్స్‌ను అందజేస్తున్న రుషిత చారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధులను ఆయన అభినందించారు. 


మాటలతో కాకుండా చేతలతో సమాజ సేవలో రుషిత చారిటబుల్‌ ట్రస్టు వారు ముందుంటున్నారని కొనియాడారు. పెట్రోలింగ్‌ వాహనాల్లో మెడికల్‌ కిట్స్‌ ఉండటం ద్వారా ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రుషిత చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ సతీశ్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరే పోలీసుల వద్ద మెడికల్‌ కిట్స్‌ ఉంటే ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే ప్రథమ చికిత్స అంది వారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుందన్నారు. అందుకోసమే తమ సంస్థ ద్వారా పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలకు మెడికల్‌ కిట్స్‌ను అందజేస్తున్నామన్నారు. పోలీస్‌ సిబ్బందికి ప్రథమ చికిత్స ఎలా చేయాలి? ఎలా వైద్యం అందించాలనే అంశాలపై తాము అనునిత్యం శిక్షణ కూడా అందిస్తామన్నారు. అదే విధంగా ప్రస్తుతం తాము పోలీసులకు అందిస్తున్న మెడికల్‌ కిట్స్‌ నిర్వహణ బాధ్యతను కూడా తమ ట్రస్టు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రుషిత చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు ప్రసన్న, ప్రతీక్‌, పారమిత దవాఖాన వైద్యులు డాక్టర్‌ ధన్‌రాజ్‌, శ్రీనివాస్‌ ముర్కి, రాచకొండ పోలీస్‌ ఉన్నతాధికారులు దివ్యచరణ్‌రావు, పృద్వీధర్‌రావు, చైతన్యపురి సీఐ జానకీరాంరెడ్డి, డిటెక్టివ్‌ సీఐ సైదులు, ట్రాఫిక్‌ సీఐ నాగమల్లు  పాల్గొన్నారు. 


logo