e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ కబ్జాదారులూ ఖబడ్దార్‌

కబ్జాదారులూ ఖబడ్దార్‌

కబ్జాదారులూ ఖబడ్దార్‌
  • రంగంలోకి ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం అధికారులు
  • 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక నజర్‌
  • ప్రారంభంలోనే 13మంది అరెస్టు.. 8 మంది పై పీడీ యాక్ట్‌
  • విచారణలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు మెమోలు జారీ
  • భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాల తయారీ దారులను వదలం
  • బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయండి
  • వివరాలు గోప్యంగా ఉంచుతాం : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సిటీబ్యూరో, జూన్‌ 20 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అదే స్థాయిలో అక్రమార్కులు కూడా పెరిగిపోయారు. ఒకే స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ అమాయకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇలాంటి వారి చేతిలో మోసపోయిన బాధితులు అనేక మంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాని బాధితులకు న్యాయం జరగడం లేదు. ఏండ్లుగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రోజురోజుకూ వీటి సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూనే ఉన్నది. విషయం తెలుసుకున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. ‘ఆపరేషన్‌ ల్యాండ్‌ గ్రాబర్స్‌’ను ప్రారంభించారు. ప్రారంభమైన 15 రోజుల్లోనే 13మందిని అరెస్టు చేయగా.. 8 మందిపై పీడీయాక్ట్‌ విధించారు. ప్రత్యేకంగా ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం అధికారులను రంగంలోకి దించి భూ అక్రమాలకు పాల్పడిన వారితో పాటు అందుకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కేసుల విచారణలో జాప్యం వహించిన స్టేషన్‌ అధికారులకు సైతం మెమోలు జారీ చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.

2013 నుంచి పెండింగ్‌లోనే..

గతంలో రూపొందిన లే-అవుట్‌లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారి స్థలాలను కొంత మంది ఉద్దేశ పూర్వకంగానే రీ లేఅవుట్‌లతో పాటు ఇతర కారణాలను చూపించి సరికొత్త పత్రాలను సృష్టిస్తున్నారు. గతంలో ఫొటో రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, భూ కబ్జాదారులు నకిలీ పత్రాలతో లిటిగేషన్‌ సృష్టించి సామాన్యుడిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లలో అనేకం నమోదయ్యాయి. కాని వాటి దర్యాప్తు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. దాదాపు 2013 నుంచి కేసుల విచారణ పెండింగ్‌లోనే ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వాటన్నింటిపై దృష్టి సారించిన సైబరాబాద్‌ పోలీస్‌ అధికారులు అప్పుడు పనిచేసిన అధికారుల నిర్లక్ష్యంపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఎందుకు ఆ కేసులు పెండింగ్‌లో ఉంచారు.., ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాత ఆధారాలు ఎందుకు సేకరించలేకపోయారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో తప్పుడు పత్రాలను సృష్టించారని బాధితులు పేర్కొన్నప్పటికీ స్టేషన్‌ అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే విషయంపై ఆరా తీస్తున్నారు. అందులో నిజంగా అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారికి ఇప్పుడు చార్జీ మెమోలను ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. సామాన్యుడికి అన్యాయం చేస్తున్న ల్యాండ్‌ గ్రాబర్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదలమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆదిలోనే దొరికారు.. పీడీ యాక్ట్‌ విధించారు

- Advertisement -

ఇటీవల సైబరాబాద్‌లో నకిలీ పత్రాలను సృష్టించి మోసానికి పాల్పడ్డారని కూకట్‌పల్లి, రాంచంద్రపురం పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణ చేపట్టడంతో రాంచంద్రపురంలో 13మంది పాత్ర బయటపడగా, కూకట్‌పల్లి కేసులో ఐదుగురి పాత్ర వెలుగులోకి వచ్చింది. రాంచంద్రపురం కేసులో మొత్తం 9మందిని అరెస్టు చేయగా మరికొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్‌ తెచ్చుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. వీరిలో 8మందిపై గతంలో ఇదే తరహా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి ప్లాట్లను విక్రయించడం, మోసాలకు పాల్పడటం వంటి కేసులు నమోదు కావడంతో వీరిపై పీడీయాక్ట్‌ను తెరిచి ఏడాది పాటు జైలులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. 13మంది కలిసి రూ.2.50 కోట్ల విలువైన స్థలాన్ని కాజేసి ఇతరులకు విక్రయించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. ఇక కూకట్‌పల్లి పీఎస్‌కు సంబంధించిన కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. వీరంతా మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామంలో దాదాపు రూ.52 కోట్ల విలువైన స్థలానికి నకిలీ పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారు. ఓ వ్యాపారి వద్ద దాదాపు 8 కోట్ల వరకు అడ్వాన్స్‌గా తీసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిపై కూడా పీడీయాక్ట్‌ విధించనున్నారు.

మోసం చేస్తే సహించం

సామాన్యుడి సొంతింటి కలను ఛిద్రం చేసే భూ కబ్జాదారులు, నకిలీ పత్రాలు సృష్టించే వారు, ఫోర్జరీ చేసే వారిని వదిలిపెట్టం. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం. బాధితులు డయల్‌ 100 లేదా సైబరాబాద్‌ వాట్సాప్‌ నం.9490617444కు సమాచారం అందించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కబ్జాదారులూ ఖబడ్దార్‌
కబ్జాదారులూ ఖబడ్దార్‌
కబ్జాదారులూ ఖబడ్దార్‌

ట్రెండింగ్‌

Advertisement