మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 22:46:13

దోమలపై సమరం

దోమలపై సమరం

సర్కార్‌కు తోడుగా కాలనీల సహకారం

నివారణకు యంత్రాలు కొనుగోలు చేసిన నాయకులు

గత అనుభవంతో ముందు జాగ్రత్త చర్యలు

 ఎల్బీనగర్‌ : ఎల్బీనగర్‌లో దోమలపై సమరం మొదలైంది. పక్క ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నారు. గతేడాది దోమ కాటుతో పలువురు దవాఖానల పాలయ్యారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు.. ఎమ్మెల్యే  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముందస్తు ప్రణాళికతో నియోజకవర్గం వ్యాప్తంగా ఫాగింగ్‌ చేయించేందుకు శ్రీకారం చుట్టారు. దోమల నివారణ కోసం జీహెచ్‌ఎంసీ, ఎంటమాలజీ చెరువులను క్లీన్‌ చేసేందుకు కృషి చేస్తున్నది. ఎమ్మెల్యే చొరవతో స్థానిక కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల ప్రధాన నాయకులు ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేశారు. కాలనీలవారీగా ప్రణాళికతో నిత్యం ఆయా ప్రాం తాల్లో ఫాగింగ్‌ చేసే విధంగా చొరవ తీసుకుంటున్నారు. 

ఫాగింగ్‌ యంత్రాలు

డివిజన్‌కు ఒక ఫాగింగ్‌ మిషన్‌ జీహెచ్‌ఎంసీ అందుబాటులో ఉంచింది. ఈ యంత్రాలు సరిపోకపోవడంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల సహాయంతో కూడా ఫాగింగ్‌ మిషన్లు కొనుగోలు చేసి కాలనీల్లో నిత్యం ఫాగింగ్‌ చేయిస్తున్నారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మూసీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కావడంతో మూసీ కార్పొరేషన్‌ ద్వారా కూడా నూతన ఫాగింగ్‌ మిషన్లు కొనుగోలు చేయించి.. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్‌ చేయిస్తున్నారు. కాలనీలవారీగా ఓ లిస్టును తయారు చేసుకుని.. అయా కాలనీల్లో తేదీలు, వారంవారీగా ఫాగింగ్‌ చేపడుతున్నారు.  దీంతో ఈసారి దోమల తీవ్రత కాస్తా తగ్గుముఖం పట్టింది. కరోనా నేపథ్యంలో కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ వారికి తోడుగా ఆయా డివిజన్ల నాయకులు సైతం తమ సొంత ఖర్చులతో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. 

ఫాగింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం 

దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం చేస్తున్న కృషికి అదనంగా కొంత జోడించాలన్న లక్ష్యంతో ముందడుగు వేశాం. సొంతంగా ఫాగింగ్‌ మిషన్లు కొనుగోలు చేయించి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని నిత్యం కాలనీల్లో ఫాగింగ్‌ చేయిస్తున్నాం. దోమల తీవ్రతను తగ్గించాలన్న లక్ష్యంతో చెరువుల్లో, మూసీలో దోమల ఆవాసాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మూసీలోనూ దోమల నివారణకు యాంటీ లార్వా మందులతో పాటుగా ఫాగింగ్‌ చేయిస్తున్నాం. 

- సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యే 

కాలనీల్లో ఫాగింగ్‌ 

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముందుచూపుతో దోమలపై యుద్ధం ప్రకటించడం సత్ఫలితాలను ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ వారికి తోడుగా మేము కూడా ఫాగింగ్‌, యాంటీ లార్వా మిషన్లను కోనుగోలు చేశాం. కాలనీల వారీగా లిస్టును తయారు చేసుకుని దోమల నివారణకు కృషి చేస్తున్నాం. 

- చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌, కార్పొరేటర్‌ నాగోలు


logo