ఓ బాధితురాలి పేరుపై ఇన్‌స్టాగ్రాంలో ఫేక్ ఐడీని సృష్టించిన ఇద్దరు మైనర్లను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన మైనర్… ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం చెప్పేందుకు స్నేహితుడు సూచించినట్లుగా ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫేక్ ఐడీని సృష్టించి దానికి ఓ యువతి ఫొటోను పెట్టాడు. చాటింగ్ ద్వారా ఇద్దరూ స్నేహితులైన తర్వాత.. ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు పంపాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెడతానని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలియగానే మైనర్లు ఇన్‌స్టాగ్రాంలో ఐడీని డిలీట్ చేయడంతో పాటు వారు ఉపయోగించిన ఫోన్లను ధ్వంసం చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు.