గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Aug 01, 2020 , 00:45:51

జీహెచ్‌ఎంసీలో విస్తృతంగా నిర్మాణాల తొలగింపు

జీహెచ్‌ఎంసీలో విస్తృతంగా నిర్మాణాల తొలగింపు

ఆధునిక యంత్రాలతో నేలమట్టం 

రోడ్డు ఆక్రమణలు సైతం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అనుమతి లేని నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపిస్తున్నది. దీనికోసం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. నగరవ్యాప్తంగా పెద్దఎత్తున అనుమతిలేని భవనాలను ఆధునిక యంత్రాలతో కూల్చివేస్తున్నారు. రోడ్డుపై ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాలు, షెడ్లు, తోపుడు బండ్లు తదితరవాటిని కూడా తొలగిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అనుమతి లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు బల్దియా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి, మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలను తొలగించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలో 30 భవనాలకు సంబంధించిన 130 స్లాబ్‌లను కత్తిరించారు. కొత్తగూడ ప్రశాసన్‌నగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను కూల్చివేశారు. కొండాపూర్‌ శ్రీరామ్‌నగర్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో అదనపు అంతస్తులను తొలగించారు. గచ్చిబౌలీ జంక్షన్‌లోని శిల్పా లేఔట్‌లోని షెడ్లను, సర్కిల్‌-6 మలక్‌పేట్‌లోని జాంబాగ్‌లో రోడ్డుపై నిర్మించిన ఆర్‌సీసీ పిల్లర్లను కూల్చివేశారు. బేగంపేట్‌ సర్కిల్‌లోని మేడిబావి ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మూడో అంతస్తును తొలగించారు. గాజులరామారంలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటిని, అదే ప్రాంతంలో మరో షెడ్డును కూల్చివేశారు. మల్కాజ్‌గిరి సర్కిల్‌లోని మల్లికార్జుననగర్‌లో అక్రమంగా నిర్మించిన కంపౌండ్‌ వాల్‌ను, ఆర్సీపురం రోడ్డు, ధోబీఘాట్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తీసివేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వాటిపై ట్రాఫిక్‌ పోలీసుల సహాయంతో చర్యలు తీసుకుంటున్నారు.

ఆధునిక యంత్ర సామగ్రి వినియోగం..

అత్యంత ఎత్తయిన భవనాలను సైతం కూల్చివేసే సామర్థ్యమున్న భారీ క్రేన్‌లతోపాటు కంప్రెషర్స్‌, గ్యాస్‌ కట్టర్లను కూల్చివేతల కోసం ఉపయోగించడం విశేషం. గతంలో కూల్చివేతలు మనుషుల ద్వారా మాత్రమే నిర్వహించేవారు. అరకొరగా గోడలకు రంధ్రాలు వేసి వదిలేసేవారు. దీనికి భిన్నంగా ఈసారి ఏకంగా స్లాబ్‌లను కత్తిరించడం, పిల్లర్లను కూల్చివేయడం వంటి చర్యలు తీసుకుంటూ భవనాన్ని పనికిరాకుండా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరూ అక్రమ నిర్మాణాలు చేసేందుకు సాహసం చేయరని అధికారులు పేర్కొంటున్నారు. 

అనుమతులు లేని ఆస్తులు కొనొద్దు: సీసీపీ

అనుమతులు లేని అపార్ట్‌మెంట్లు, లేఔట్లలో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయరాదని జీహెచ్‌ఎంసీ ముఖ్య నగర ప్రణాళికాధికారి(సీసీపీ) దేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్లాట్లు  కొనుగోలు చేసేముందు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉందో లేదో చూసుకోవాలని ఆయన సూచించారు. ఉంటేనే కొనుగోలు చేయాలన్నారు. ఆక్యుపెన్సీ లేని భవనాలను ఎప్పుడైనా బల్దియా కూల్చవచ్చని, వాటి ఆస్తిపన్ను, నీటి బిల్లులపై అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. భవనాలకు ఆక్యుపెన్సీ ఉందో, లేదో అనేది జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని, లేనిపక్షంలో సమీపంలోని బల్దియా కార్యాలయంలో సంప్రదిస్తే చెబుతారని సీసీపీ వివరించారు.

తాజావార్తలు


logo