శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Hyderabad - Jul 13, 2020 , 22:47:25

అనుభవంతో చెపుతున్నా.. భయం అక్కర్లేదు..!

అనుభవంతో చెపుతున్నా.. భయం అక్కర్లేదు..!

వ్యాయామం, కషాయానికితోడు ఆత్మైస్థెర్యం ముఖ్యం

వైరస్‌ భయపడేంత ప్రమాదకరమైంది కాదు

కరోనా విజేత రంజిత్‌కుమార్‌

 ‘క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. రోజుకు రెండుసార్లు కషాయం తాగితే కరోనాను జయించవచ్చు. కరోనా వచ్చిందని భయపడకూడదు. ఆత్మైస్థెర్యంతో మెలగాలి. ఐసోలేషన్‌లో ఉంటూ మన పని మనం చేసుకోవాలి. ప్రజలు భయపడుతున్నంత ప్రమాదకరమైనది కాదు.. నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా..’ అంటూ ‘నమస్తే తెలంగాణ’తో కరోనా విజేత, జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్‌ రంజిత్‌ కుమార్‌ తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నా దగ్గర పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే నేను టెస్టులు చేయించుకున్నా. నాకు కూడా పాజిటివ్‌ వచ్చింది. నాకు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏవీ లేకున్నా పాజిటివ్‌ అని తెలియగానే కొంత భయపడ్డా. వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయా. రెండు రోజుల తరువాత స్వల్పంగా జ్వరం వచ్చింది. అయినా భయపడకుండా పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యుడైన నా స్నేహితుడి సలహా ప్రకారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేశాను. రోజుకు రెండు సార్లు కషాయం తాగాను. రెండు పూటలా హోమియోపతి మాత్రలు వేసుకున్నా. రోజుకు రెండుసార్లు వేడి నీళ్లలో జిందా తిలిస్మత్‌ వేసుకొని ఆవిరి పట్టాను.   ‘అచినాసియా అంగుస్టిఫోలియో’ అనే హోమియోపతి మాత్రలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకున్నా. అంతేకాకుండా విటమిన్‌-సీ రోజుకు రెండు, జింకోవిట్‌ మాత్ర రోజుకు ఒకటి చొప్పున వేసుకున్నా. ఏడు రోజులపాటు గోరు వెచ్చని నీటినే తాగాను. ఉదయం పూట మేడపై కొద్దిసేపు వాకింగ్‌ చేసే వాడిని. నాకు పాజిటివ్‌ వచ్చిన వెంటనే మా ఇంట్లో అందరికీ పరీక్షలు చేయించాం. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. 

ఇదీ కరోనా కషాయం..

ఒక లీటరు నీటిలో ఒక టీ స్పూన్‌ పసుపు, రెండు లవంగాలు, పొట్టుతో కూడిన నిమ్మ ముక్కలు, పొట్టు తీసిన అల్లం సరిపడినంత వేసి నీరు అరలీటరు అయ్యే వరకు మరిగించి తాగాలి. ఇది నా స్నేహితుడు చెప్పిన చిట్కా. అతను కూడా కరోనా బారినపడి ఈ కషాయం సేవించడం ద్వారా తగ్గించుకున్నాడు. ఆయన చెప్పిన బాటలోనే నేను కూడా నడిచా. కషాయం తాగిన తరువాత 24గంటల్లోనే నెగెటివ్‌ వచ్చినట్లు అతడు చెప్పాడు. ఇది ఒక్క కరోనానేకాకుండా ఎటువంటి వైరస్‌నైనా తగ్గిస్తుందని అతడు భరోసా ఇచ్చాడు. అది తాగిన తరువాత నాకు కూడా పూర్తి నమ్మకం ఏర్పడింది. 

కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు

ఇంట్లో 78 సంవత్సరాల మా అమ్మ, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో విడిగా ఒక గదిలో ఉంటూ 14రోజులు డిస్పోజల్‌ వస్తువులే ఉపయోగించా. నా బట్టలు నేనే ఉతుక్కున్నా. మా స్నేహితుడి ద్వారా కషాయం, వ్యాయామం గురించి తెలుసుకొని రోజూ అవి పాటించాను. ఏడు రోజుల తరువాత మళ్లీ టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. నాకు అసలు కరోనా వచ్చిన ఫీలింగ్‌ కూడా కలగలేదు. ఇప్పుడు మునపటిలాగే కుటుంబంతో కలిసి ఉంటున్నా. యథావిథిగా డ్యూటీలో నిమగ్నమయ్యా. కరోనా అనేది ప్రజలు భయపడుతున్నంత ప్రమాదకర వైరస్‌ కాదని నా నమ్మకం. 

మందులు, పాటించాల్సిన నియమాలు

రోజుకు రెండుసార్లు వేడి నీళ్లలో జిందా తిలిస్మత్‌ వేసుకొని ఆవిరి

అచినాసియా అంగుస్టిఫోలియో అనే హోమియోపతి మాత్రలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి 

విటమిన్‌-సీ రోజుకు రెండు, జింకోవిట్‌ మాత్ర రోజుకు ఒకటి

పౌష్టికాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ 

క్రమం తప్పకుండా వ్యాయామం, ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాయామం, రోజూ రెండు పుటలా కషాయం తాగాలి.


logo