మంగళవారం 26 జనవరి 2021
Hyderabad - Dec 05, 2020 , 02:31:49

ఉత్కంఠగా కౌంటింగ్‌

 ఉత్కంఠగా కౌంటింగ్‌

టీవీలకు హత్తుకు పోయిన జనం

ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారోనని క్షణ క్షణం టెన్షన్‌

ఏ ఇద్దరు కలిసినా రిజల్ట్స్‌పైనే చర్చ

క్రికెట్‌ మ్యాచ్‌ ఉన్నా.. ఫలితాలపైనే దృష్టి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈ ఫలితాలను తెలుసుకునేందుకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, ప్రత్యర్థులు, పందెంరాయుళ్లు, సాధారణ ప్రజలు, వి ద్యార్థులు, యువత.. ఇలా అన్ని వర్గాల వారిని టెన్షన్‌కు గురిచేసింది. ఉదయం 8 గంటల నుంచే ప్రజలు టీవీలను ఆన్‌ చేసి పెట్టేశారు. రాజకీయ ప్రతినిధులు వేడి వేడి మాటలు ఎలా ఉంటాయనే ఆశతో ప్రజలు టీవీలకు హత్తుకుపోయారు. క్షణక్షణం టీవీ చానళ్లను మార్చుకుంటూ ఫలితాలను చూశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు... తమ వారి గెలుపు ప్రకటన ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడటం కనిపించింది. ఒక వైపు ఇండియా- ఆస్ట్రేలియా మధ్య 20-20 మ్యాచ్‌ ఉన్నా.. క్రికెట్‌ అభిమానులు కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్‌ లైవ్‌ను తిలకించారు. ఈ విధంగా మొత్తానికి ఫలితాలను చూస్తూ ఫ్రైడే రిలీజ్‌.. ఎన్నికల ఫలితాలతో ఎంజాయ్‌ చేశారు. వీధుల్లో ఏ ఇద్దరు కలుసుకున్నా ... అరే అక్కడ ఎవరు గెలిచారు...ఇక్కడ ఎవరు గెలిచారు అంటూ స్మార్ట్‌ఫోన్‌లలో ఫలితాల అప్‌డేట్‌ను తెలుసుకున్నారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుంటూ విశ్లేషకులు, సర్వే సంస్థల ప్రతినిధులు దాదాపు 9 గంటల పాటు నిరంతరంగా టీవీలను చూస్తుండి పోయారు. పోలీసు అధికారులు సైతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆసక్తిని చూపించారు. వారు అంచనా వేసిన అభ్యర్థుల గెలుపు ఓటములపై చర్చించుకున్నారు. అంతేకాకుండా ప్రచార సమయంలో రహస్యంగా సేకరించిన  నివేదికపై పోలీసు అధికారులు చర్చించుకున్నారు. మొత్తానికి సామాన్యుడు కూడా ఎన్నికల ఫలితాలను చూ స్తూ...గరం గరం చాయ్‌ తాగుతూ, పకోడీలు తిం టూ ఎంజాయ్‌ చేశారు. ముఖ్యంగా వారి ప్రాంతా ల్లో ఎవరు గెలిచారనే దానిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులు కూడా ఈ ఎన్నికల ఫలితాలపై అసలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అంటే ఏంటి, ఎంఎల్‌ఏ ఎన్నికలకు తేడా ఏంటి, ఎంపీ, ప్రధాన మంత్రి, సీఎం ఎలా  ఎన్నుకవుతారనే అనుమానాలను వారింట్లో వారిని అడిగి నివృత్తి చేసుకున్నారు. మధ్యాహ్న సమయాల్లో టీవీ సీరియల్స్‌ చూస్తూనే వాణిజ్య ప్రకటనలు వచ్చే సమయంలో ఎన్నికల ఫలితాల కోసం న్యూస్‌ చానల్స్‌కు మారిపోయారు. ఈ విధంగా ఫ్రైడే ఎంజాయ్‌ చేశారు. కొన్ని సందర్భాల్లో న్యూస్‌ చానళ్లలో వివిధ రకాలుగా ఫలితాలను వెలువరిస్తుండటంతో వీక్షకులు కొంత గందరగోళానికి గురయ్యారు. 


logo