శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:42:15

అందరూ పరీక్షలు చేయించుకోవాలి

అందరూ పరీక్షలు చేయించుకోవాలి

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ 

సైదాబాద్‌: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సోమవారం అక్బర్‌బాగ్‌ డివిజన్‌ పరిధి పల్టన్‌లో ఉచిత కరోనా మొబైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను మలక్‌పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌-19 నిబంధనలను పాటించాలన్నారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలన్నారు. అందరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పక ధరించాలన్నారు. ముఖ్యంగా పాతబస్తీలో కరోనా వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. లక్షణాలు ఉన్న వారు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా సోకినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తే చాలన్నారు. ఇదిలా ఉంటే మొబైల్‌ కేంద్రం వద్ద ఎంపీ ఒవైసీ, ఎమ్మెల్యే బలాల కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అక్బర్‌బాగ్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సయ్యద్‌ మినాజుద్దీన్‌, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 

 పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు..


- అహ్మద్‌నగర్‌: చింతల్‌బస్తీ పీహెచ్‌సీ పరిధిలో సోమవారం 12 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాక శాంతినగర్‌ యూపీహెచ్‌సీలో 1 ,  సయ్యద్‌నగర్‌ పీహెచ్‌సీలో 3 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

- వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో 14 మందికి కరోనా సోకిందని ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. ఇందులో రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో ఏడు, బోరబండ డివిజన్‌లో ఐదు, ఎర్రగడ్డ డివిజన్‌లో ఇద్దరికి కరోనా సోకినట్లు డీఎంసీ వివరించారు. 

- ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో సోమవారం 210 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని దవాఖాన సూపరింటెండెంట్‌ పరమేశ్వర నాయక్‌ తెలిపారు. అంతేకాక 48 మంది కరోనా  రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. 

-ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో 66 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 

- కాప్రా: కాప్రా సర్కిల్‌ పరిధిలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్కిల్‌లో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 450కి చేరింది. ఇందులో 340 మంది డిశ్చార్జి కాగా, 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం 102 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏఎంఓహెచ్‌ మైత్రేయి తెలిపారు.

-రామంతాపూర్‌: ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యకేంద్రం అధికారి తెలిపారు.

మేయర్‌ రామ్మోహన్‌కు నెగిటివ్‌..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు సోమవారం నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. గతంలో పాజిటివ్‌ రాగా కొంతకాలంగా మేయర్‌ హోం ఐసొలేషన్‌లో ఉన్నా రు. దాదాపు రెండు వారాల తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది.

కరోనాతో వృద్ధురాలు మృతి

నేరేడ్‌మెట్‌: కరోనాతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన (65) సంవత్సరాల వృద్ధురాలు కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో గాంధీకి తరలించారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. 

మేడ్చల్‌, రంగారెడ్డిలో  3133 మందికి పరీక్షలు 

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ: గ్రేటర్‌లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం గ్రేటర్‌లోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మొత్తం 3133 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరపగా 535 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 1932 మందికి పరీక్షలు జరుపగా 194 మంది, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 1201 మందికి పరీక్షలు జరుపగా 341 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.


logo